ఖమ్మం, వెలుగు: రాష్ట్రంలో దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టులో ఎంపికైన ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో లబ్ధిదారులకు యూనిట్లు ఇంకా పూర్తి స్థాయిలో పంపిణీ కాలేదు. బర్రెల యూనిట్లు సెలక్ట్ చేసుకున్న వారికి ముందుగా రేకుల షెడ్డు వేసుకునేందుకు అధికారులు లక్షన్నర చొప్పున మంజూరు చేశారు. ఈ డబ్బులతో షెడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులు.. మూడు నెలల కింద భూమి కౌలుకు తీసుకొని గడ్డి విత్తనాలు కూడా చల్లుకున్నారు. ఈ గడ్డి ఏపుగా పెరిగి కంకులు కూడా మొలుస్తున్నాయి. అయితే బర్రెలను మాత్రం ఇంకా ఇవ్వకపోవడంతో గడ్డి నిరుపయోగంగా మారే పరిస్థితి ఏర్పడింది. దీంతో సోమవారం చింతకాని మండలం పాతర్లపాడుకు చెందిన లబ్ధిదారులు..గడ్డిని కోసుకొని కట్ట కట్టుకొని ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో గ్రీవెన్స్‌కు వచ్చారు. కలెక్టర్ వీపీ గౌతమ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన సూచన మేరకు అడిషనల్ కలెక్టర్ స్నేహలతకు వినతిపత్రాన్ని ఇచ్చారు.
బర్రెలు వస్తాయన్న ఆశతో..
పాతర్లపాడులో 30 మంది లబ్ధిదారులు బర్రెల యూనిట్లను సెలక్ట్ చేసుకున్నారు. బర్రెలు వస్తాయన్న ఆశతో ఒక్కొక్కరు ఎకరం రూ. 20 వేల చొప్పున కౌలుకు తీసుకొని గడ్డి పెంచుతున్నారు. మనిషి ఎత్తులో గడ్డి పెరగడంతో ఏకంగా గడ్డి కట్టతోనే గ్రీవెన్స్‌కు వచ్చారు. మండలంలో అధికారులను అడిగితే.. ఇదిగో అదిగో అంటూ దాటవేస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. మిగతా యూనిట్ల కంటే ముందుగా రైతులకు ఇవ్వాల్సిన బర్రెల యూనిట్లను మంజూరు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తొందరగా ఇప్పించాలి
రేకుల షెడ్లు వేసుకొని, గడ్డి పెంచుకొని నాలుగు నెలలు కావస్తున్నా బర్రెలు ఇయ్యలే. ఆఫీసర్లను కలిస్తే పంజాబ్, హర్యానా, గుజరాత్, కర్నాటక రాష్ట్రాల నుంచి బర్రెలు కొని తీసుకొని రావాల్సి ఉందని చెప్తున్నరు. చింతకాని మండలంలోని నాలుగు ఊర్లలో మాత్రమే బర్రెల యూనిట్లు గ్రౌండింగ్ చేసిన్రు. రూ.20 వేల చొప్పున ఎకరం భూమి కౌలుకు తీసుకొని పెంచిన గడ్డి, కోత దశ దాటిపోయి కంకులు వేస్తున్నది. త్వరగా గడ్డి కోసుకోకపోతే నిరుపయోగంగా మారుతది. ఆ తర్వాత బర్రెలు కూడా తినవు. తొందరగా ఇప్పించాలని అధికారులను కోరినం. పర్చేజింగ్ కమిటీల ఆధ్వర్యంలో బర్రెలు కొని, పది రోజుల్లో ఇస్తమంటున్నరు.
- ఉసికల నాగమణి, పాతర్లపాడు, చింతకాని మండలం