ధర్నాలతో అట్టుడికిన కలెక్టరేట్.. నిరసన తెలుపుతున్న వార్డు ప్రజలు

ధర్నాలతో అట్టుడికిన కలెక్టరేట్.. నిరసన తెలుపుతున్న వార్డు ప్రజలు

నస్పూర్, వెలుగు: ధర్నాలతో మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ దద్దరిల్లింది. గోదావరి బ్యాక్ వాటర్ కారణంగా తమ ఇండ్లు నీట మునిగిపోతున్నాయని, సమస్య పరిష్కరించాలంటూ నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు ప్రజలు సోమవారం నిరసన తెలిపారు. రెడ్ జోన్ ఏరియాలో ఉన్న తమకు వేరే ప్రాంతంలో ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. గుడిపేట శివారులోని సర్వే నంబర్ 294లో ఉన్న 11ఎకరాల దళితుల భూముల్ని కొందరు ఆక్రమించుకొని ఇటుక బట్టీలు పెట్టారని రాపెల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై నిర్లక్ష్యం వహిస్తున్న తహసీల్దార్, సర్వేయర్ పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. తమ భూములను ఇప్పించాలని కోరారు.

తమను పర్మినెంట్ చేయాలంటూ గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు ధర్నా చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 50 వేల మంది కార్మికుల సమస్యలు పరిష్కరించి, వారిని పర్మినెంట్ చేయాలని కోరారు. అర్హులైన అందరికీ దళిత బంధు, గృహలక్ష్మి, పోడు భూములకు పట్టాలు అందించాలని దళిత హక్కుల పోరాట సమితి డిమాండ్​ చేసింది. 

సాగు భూములకు హక్కు పత్రాలివ్వాలి

పోడు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న జిల్లాలోని ఆదివాసీలందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్​చేసింది. కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించింది. కొన్ని గ్రామాల్లో ఆర్వోఎఫ్ఆర్ కమిటీలు సర్వే చేసినప్పటికీ పూర్తిస్థాయిలో హక్కు పత్రాలు ఇవ్వలేదని, ఇచ్చినవారికీ మొత్తంగా ఇవ్వలేదని సభ్యులు తెలిపారు. వెంటనే రీ సర్వే చేసి అర్హులకు హక్కు పత్రాలు అందించాలన్నారు.