నిర్మించి.. వదిలేసిన్రు.. రూ.కోటితో కట్టినా ప్రారంభించలేదు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లా కేంద్రంలో రూ.కోటి వెచ్చించి నిర్మించిన బిల్డింగ్ ప్రారంభించక ముందే శిథిలావస్థకు చేరుకుంది. ఇప్పుడది అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. బిల్డింగ్ నిర్మించిన ఆ ల్యాండ్​ రూ.3కోట్లకు పైగా విలువ చేస్తుంది. అధికార పార్టీ నేతల అండదండలతో కొందరు బడాబాబులు కబ్జా చేసేందుకు కన్నేశారు. అయితే ఈ బిల్డింగ్​ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చే విధంగా ఆఫీసర్లు చర్యలు చేపట్టాల్సి ఉంది. లేదంటే ల్యాండ్​ఆక్రమణకు గురయ్యే ప్రమాదం ఉందని స్థానికులు వాపోతున్నారు. 

వినియోగంలోకి తీసుకురావాలని...

కొత్తగూడెంలోని 1,2,3,4,23,24,25,26 వార్డులకు చెందిన ప్రజల కోసం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్​హయాంలో కమ్యూనిటీ హాల్(ఎంపవర్​మెంట్​సెంటర్)ను ఆరేండ్ల కింద నిర్మించారు. ఈ బిల్డింగ్​తమకు చాలా ఉపయోగపడనుందని ఆయా వార్డుల ప్రజలతో పాటు పట్టణ వాసులు భావించారు. గవర్నమెంట్​మీటింగ్ లకు కూడా ఈ బిల్డింగ్​పనికొస్తుందనే ఆలోచనతో కమ్యూనిటీ హాల్​ను మెయిన్​రోడ్డుకు సమీపంలో హనుమాన్​బస్తీ ప్రాంతంలో నిర్మించారు.

మరో రూ.10 నుంచి రూ.15 లక్షలు వెచ్చిస్తే ఈ కమ్యూనిటీ హాల్ వినియోగంలోకి వచ్చేది. ఎమ్మెల్యే మారాక ప్రస్తుత ఎమ్మెల్యే ఆ బిల్డింగ్​ను ప్రజల్లోకి తీసుకురావడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. బిల్డింగ్​ను వినియోగించుకునేందుకు ఆఫీసర్లు కూడా దృష్టి సారించలేకపోతున్నారు. ఫలితంగా ఆ బిల్డింగ్ లో​మందుబాబులు విందులు వంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్నది స్థానికుల వాదన.

సర్కార్​ప్రోగ్రామ్స్ కోసం కొన్ని సందర్భాల్లో మీటింగ్​హాల్స్ లేక ఆఫీసర్లు ఇబ్బంది పడుతున్న దాఖలాలున్నాయి. నేషనల్ హైవేకు అతి సమీపంలో ఉన్న ఈ కమ్యూనిటీ హాల్​ను వినియోగంలోకి తేవడంలో మాత్రం ఎవరికి వారు ‘నాకేందుకులే’ అనే విధంగా ఆఫీసర్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మరోవైపు దాన్ని ఆక్రమించుకునేందుకు కొందరు అధికార పార్టీ నేతల అండదండలతో కబ్జాకు స్కెచ్​వేస్తున్నారు.

పాత డాక్యుమెంట్లు సృష్టించి ఈ ల్యాండ్​ను రిజిస్ట్రేషన్​ చేయించుకునేందుకు ప్లాన్​చేస్తున్నారని ఈ ప్రాంత వాసులు ఆరోపిస్తున్నారు. చిన్నా చితక మిగిలి ఉన్న పనులను పూర్తి బిల్డింగ్​ను ఫంక్షన్​హాలులా మారిస్తే గవర్నమెంట్​కు ఆదాయం రావడంతోపాటు అందరికీ ఉపయోగపడనుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి ఈ బిల్డింగ్​ను వాడుకలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని, లేదంటే కబ్జా చేస్తారని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

అందుబాటులోకి తేవాలె..

రూ. కోట్లు ఖర్చు పెట్టి కట్టిన బిల్డింగ్​ను ప్రజలకు ఉపయోగపడేలా ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలే. ఈ బిల్డింగ్​ను పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని ఆఫీసర్లను కోరినా పట్టించుకుంటలేరు. ఇప్పటికైనా స్పందించకుంటే జరిగే నష్టం జరిగిపోతుంది.  –సాహెరాబేగం, కౌన్సిలర్

కబ్జాకు స్కెచ్​వేస్తున్నరు...

ఇక్కడి స్థలం దాదాపు రూ.3కోట్ల విలువ చేస్తది. ఈ ల్యాండ్​ను కబ్జా చేసేందుకు కొందరు స్కెచ్​గీస్తున్నరు. వారి ఆటలు సాగనీ యద్దంటే ఆఫీసర్లు మేల్కోవాలే. విలువైన గవర్నమెంట్​స్థలాలు కబ్జా కాకుండా చూసే బాధ్యత ఆఫీసర్లదే. ఎంపవర్​మెంట్​ సెంటర్ పేరుతో కమ్యూనిటీ హాల్​కట్టిన ఈ బిల్డింగ్​ వినియోగం లోకి తెచ్చేందుకు ఉద్యమిస్తం.   –వై. శ్రీనివాస్​రెడ్డి, మున్సిపల్​ సీపీఐ ఫ్లోర్ లీడర్​