పేదలను అడ్డంపెట్టుకొని బిల్డర్ల వ్యాపారం

పేదలను అడ్డంపెట్టుకొని బిల్డర్ల వ్యాపారం
  • మూసీని సుందరీకరిస్తం.. లేకుంటే విజయవాడలాంటి పరిస్థితులు వస్తయ్: భట్టి
  • హైదరాబాద్​ అంటేనే రాక్స్, లేక్స్​, పార్క్స్​.. నేడు అవి కనుమరుగైతున్నయ్​
  • మూసీ నదిలో మంచినీరు పారేలా చేయాలనేదే సర్కారు ఆలోచన 
  • ఇండ్లు కోల్పోయిన వారికి డబుల్​ బెడ్రూం ఇండ్లు
  • అభివృద్ధి, స్వేచ్ఛకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​లో పేదలను అడ్డంపెట్టుకొని బిల్డర్స్ వ్యాపారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. మూసీ నదిలో  మంచినీరు పారేలా చేయాలనేదే ప్రభుత్వం ఆలోచన అని పేర్కొన్నారు. అమెరికాలోని సదరన్ కాలిఫోర్నియా తెలుగు కమ్యూనిటీ, స్థానిక కాన్సుల్ జనరల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో భట్టి ప్రసంగించారు. మూసీ బ్యూటిఫికేషన్ లో భాగంగా నిర్వాసితులకు అవగాహన కల్పించి, పునరావాస చర్యలు చేపడుతున్నామని చెప్పారు. మూసీలో ఇండ్లు కట్టుకున్న వాళ్లకు బయట డబుల్​ బెడ్రూమ్ ఇండ్లు కేటాయిస్తున్నామని తెలిపారు.

‘హైదరాబాద్ అంటేనే రాక్స్, లేక్స్, పార్క్స్.. ఇండ్ల నిర్మాణం పేరిట నేడు అవి కనుమరుగైతున్నయ్. లేక్స్ కబ్జా చేసి ఇల్లు కట్టుకున్నరు. రాక్స్, పార్క్స్​లేకుండా పోయాయి. లేక్స్ లేకపోతే వరదలు వచ్చినప్పుడు ఇటీవల విజయవాడలాంటి పరిస్థితే హైదరాబాద్​కు ఎదురవుతుంది. నది గర్భంలో ఇండ్లు నిర్మిస్తున్నరు. వీటిని ఇప్పటికీ ఆపకపోతే భవిష్యత్తు తరాలకు పెను ప్రమాదం” అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడడం తమ బాధ్యత అని తెలిపారు.  అందులో భాగంగానే చెరువులను రక్షించి, భవిష్యత్తు తరాలకు అందించేందుకు రాష్ట్రంలో చర్యలు చేపట్టామని చెప్పారు. ఇప్పటివరకూ ఎఫ్​టీఎల్​లో కట్టుకున్న ఇండ్లను మాత్రమే కూల్చేస్తున్నామని, బఫర్​ జోన్​లో ఉన్నవాటిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.

మూసీ నిర్వాసితులను ఆదుకుంటం..

మూసీ నిర్వాసితులకు పూర్తి అవగాహన కల్పించి, పునరావాస చర్యలు చేపడుతున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు, వారి పిల్లలు చదువుకునేందుకు అవకాశం కల్పించడం, వారి ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు చేపట్టడం, వారంతా మంచి వాతావరణంలో బతికేలా చూడడమే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. మూసీనది పరివాహక ప్రాంతంలో కుటుంబాలు ఆరోగ్యంగా జీవించేందుకు ఆ నదిని తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ ఆలోచన అని చెప్పారు. కలుషితమైన మూసీ నదిలో జీవించడం ఎవరికి కూడా మంచిది కాదన్నారు. అభివృద్ధి, స్వేచ్ఛ ప్రధాన అంశాలుగా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని చెప్పారు.

గతంలో ఫ్యూడల్ మనస్తత్వంతో బందీ చేయబడ్డ రాష్ట్రాన్ని తాము పూర్తి స్వేచ్ఛాయుత రాష్ట్రంగా మార్చామని తెలిపారు. భవిష్యత్తులో ఈ విధానం కొనసాగుతుందన్నారు. ఎవరు ఏ భావజాలాన్ని అయినా వ్యక్తపరిచే వాతావరణాన్ని  ఏర్పరిచామని  వివరించారు. అమెరికాలో స్థిరపడిన తెలుగు వారి మేధస్సు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఉపయోగపడాలని, పెట్టుబడులు పెట్టి అభివృద్ధిని పరుగులు పెట్టించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో  వనరులను గుర్తించి పద్ధతి ప్రకారం వినియోగిస్తామన్నారు. విద్య, వైద్యం, సేవా రంగాలను తీర్చి దిద్దుతామని తెలిపారు.