ఢిల్లీలో కూలిన బిల్డింగ్..11 మంది మృతి.. మరో 11 మందికి గాయాలు.. 9 మందిని కాపాడిన రెస్క్యూ టీమ్

ఢిల్లీలో కూలిన బిల్డింగ్..11 మంది మృతి.. మరో 11 మందికి గాయాలు.. 9 మందిని కాపాడిన రెస్క్యూ టీమ్

న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో నాలుగు అంతస్తుల భవనం పేకమేడలా కూలిపోవడంతో 11 మంది చనిపోయారు. మరో 11 మంది గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు శక్తివిహార్  ఏరియాలోని ముస్తఫాబాద్  కాలనీలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఢిల్లీ ఫైర్  సర్వీసెస్ (డీఎఫ్ఎస్) బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. బిల్డింగ్  శిథిలాలను తొలగించి అందులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. దాదాపు 12 గంటల పాటు శ్రమించి 9 మందిని రెస్క్యూ బృందాలు కాపాడాయి. 

ప్రమాదం జరిగినపుడు బిల్డింగ్  శిథిలాల కింద 22 మంది కూరుకుపోయారు. బాధితులను బయటకు తీసి జీబీటీ హాస్పిటల్ కు తరలించారు. వారిలో అప్పటికే నలుగురు చనిపోయారని డాక్టర్లు ధ్రువీకరించారు. మరో ఏడుగురు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన 11 మందిలో నలుగురికి చికిత్స అందించి డిశ్చార్జ్  చేశారు. మిగతా వారికి ట్రీట్ మెంట్  అందిస్తున్నారు. 

కాగా.. బిల్డింగ్ పేకమేడలా కూలిపోయిందని డీసీపీ సందీప్  లామా తెలిపారు. ‘‘బిల్డింగ్  కూలిపోయిన ఏరియా చాలా ఇరుకుగా ఉంది. దీంతో శిథిలాలను తొలగించడం కష్టంగా మారింది. స్థలం సరిపోకపోవడంతో భారీ యంత్రాలను ఉపయోగించలేకపోయాం. ఎంతో కష్టపడి శిథిలాలు క్లియర్  చేశాం. ఎన్డీఆర్ఎఫ్, ఫైర్  సర్వీసెస్  టీం, ఢిల్లీ పోలీసులు కలిసి రెస్క్యూ ఆపరేషన్  చేపట్టారు. అలాగే, వలంటీర్లు కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు” అని డీసీపీ లామా చెప్పారు.

గ్రౌండ్ ఫ్లోర్​లో నిర్మాణ పనుల వల్లే ప్రమాదం!

కూలిపోయిన బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లో రెండు, మూడు షాపుల నిర్మాణం జరుగుతోంది. ఈ షాపుల నిర్మాణమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నామని డీసీపీ సందీప్  లామా పేర్కొన్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లో నిర్మాణ పనులు జరుగుతున్నాయని, భవనం కూలిపోవడానికి అదే కారణంగా అనుమానిస్తున్నామని స్థానికులతో పాటు అందులో ఉంటున్నవారు కూడా చెప్పినట్లు ఆయన వెల్లడించారు. 

‘‘బిల్డింగ్  కూలిపోయే ప్రమాదం ఉందని నివాసులు అంతకుముందే ఆందోళ చెందారు. డ్రైనేజీ పైపుల నుంచి వ్యర్థాల నీళ్లు కొన్నేండ్లుగా లీకై బిల్డింగ్ గోడల్లోకి వెళుతున్నాయని, దీంతో గోడల్లో తేమ చేరి బలహీనమై, పగుళ్లు వచ్చాయని స్థానికులు తెలిపారు’’ అని డీసీపీ లామా వివరించారు. ఇక, చనిపోయిన వారిలో బిల్డింగ్ యజమాని తెహ్​సీన్​తో పాటు ఆయన కుటుంబ సభ్యులు మొత్తం ఏడుగురు ఉన్నారని చెప్పారు. ఆయన కుటుంబం ఫస్ట్  ఫ్లోర్​లో ఉంటుండగా.. మిగతా ఫ్లోర్లలో కిరాయిదారులు ఉంటున్నారు. కాగా.. 20 ఏండ్ల క్రితం బిల్డింగ్  కట్టారని, ఖాళీ స్థలం వదలకుండా స్థలమంతా ఆక్యుపై చేసి నిర్మాణం చేపట్టారని ఢిల్లీ మునిసిపల్  కార్పొరేషన్  అధికారులు చెప్పారు.

బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు: సీఎం

బిల్డింగ్  కూలిన ఘటనపై ఢిల్లీ సీఎం రేఖా గుప్తా స్పందించారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసి దిగ్ర్భాంతికి గురయ్యానని ‘ఎక్స్’ లో ఆమె తెలిపారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. బాధ్యులుగా తేలినవారిపై కఠిన చర్యలు 
తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు.