
దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సోమవారం (జనవరి 27) సాయంత్రం భారీ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటన బురారీ ప్రాంతంలో జరిగింది. చాలా మంది భవన శిథిలాల కింద చిక్కుకున్నారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, సహయక బృందాలు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని రెస్య్కూ ఆపరేషన్ చేపట్టాయి.
ఈ ఘటనపై ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ చీఫ్ అతుల్ గార్గ్ మీడియాతో మాట్లాడారు. బురారీ కౌశిక్ ఎన్‌క్లేవ్‌లోని ఆస్కార్ పబ్లిక్ స్కూల్ సమీపంలో ఓ భవనం ఆకస్మాత్తుగా కుప్పకూలిందని తెలిపారు. భవన శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నారని.. సోమవారం సాయంత్రం 6:56 గంటలకు ఈ ఘటన జరిగిందన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించి రక్షించేందుకు పోలీసులతో పాటు మా డీఎఫ్ఎస్ బృందాలు పని చేస్తున్నాయని తెలిపారు.
బలహీనమైన నిర్మాణ లోపం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని చెప్పారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తోన్నట్లు తెలిపారు.
భవనం కుప్పకూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు. ఈ సంఘటన చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. బురారీకి చెందిన ఆప్ ఎమ్మెల్యే సంజీవ్ ఝా జీను వెంటనే ఘటన స్థలానికి వెళ్లి సహయక చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. స్థానిక ప్రజలు కూడా సాధ్యమైన మేరకు సహయక చర్యల్లో పాల్గొనాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. కేజ్రీవాల్ ఆదేశాల మేరకు ఆప్ ఎమ్మెల్యే సంజీవ్ ఝా పార్టీ కార్యకర్తలతో కలిసి ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.