
బషీర్ బాగ్, వెలుగు: గోషామహల్ పరిధిలోని చాక్నావాడి నాలా మంగళవారం రాత్రి మరోసారి కుంగింది. ఇలా జరగడం ఈ నెలలో ఇది రెండోసారి. ఈ నెల 10న నాలా కుంగడంతో రెడీ మిక్స్లారీ అందులో పడిపోయింది. గడిచిన రెండేండ్లలో చాక్నావాడి నాలా కుంగడం నాలుగోసారి. మంగళవారం రాత్రి దారుసలం వైపు మెయిన్‌రోడ్డుపై నాలా కుంగడంతో ఓ కారు, ప్యాసింజర్ ఆటో, ట్రాలీ ఆటో, ట్రాక్టర్ అందుటో పడిపోయాయి. ఒక్కసారిగా నాలా కుంగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
నాలాను తిరిగి నిర్మించి, రోడ్డు వేయాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఘటనా స్థలాన్ని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జోనల్ కమిషనర్ అనురాగ్ పరిశీలించారు. స్థానికులు మేయర్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోకపోవడంతో పదేపదే నాలా కుంగుతోందని మండిపడ్డారు. అలాగే గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా హాస్పిటల్ నిర్మించొద్దని నినాదాలు చేశారు.