7 నెలలుగా అద్దె చెల్లించలేదని జిల్లా సబ్ రిజిస్ట్రార్​ ఆఫీసుకు తాళం

7 నెలలుగా అద్దె చెల్లించలేదని జిల్లా సబ్ రిజిస్ట్రార్​ ఆఫీసుకు తాళం
  • కరెంట్, నల్లా కనెక్షన్లు కట్
  • పైసలు కట్టేవరకు ఓపెన్​చేయనని భీష్మించిన బిల్డింగ్ యజమాని

మెహిదీపట్నం, వెలుగు: ఏడు నెలలుగా అద్దె చెల్లించడం లేదని నాంపల్లిలోని హైదరాబాద్​జిల్లా సబ్ రిజిస్ట్రార్, రెడ్ హిల్స్​సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు బిల్డింగ్​యజమాని తాళం వేసి, కరెంట్, నల్లా సప్లయ్​కట్​చేశాడు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం వరకు రిజిస్ట్రేషన్లు, అధికారుల కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇంతియాజ్ ఖురేషి అనే వ్యక్తికి సంబంధించిన బిల్డింగ్​లో 20 ఏండ్లుగా రెడ్​హిల్స్​సబ్​రిజిస్ట్రార్, హైదరాబాద్​జిల్లా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు కొనసాగుతున్నాయి.

అయితే ఏడు నెలలుగా బిల్డింగ్​అద్దె చెల్లించాలని ఇంతియాజ్​ఖురేషి అధికారులను అడుగుతున్నా స్పందించకపోవడంతో గురువారం అర్ధరాత్రి బిల్డింగ్ కు తాళం వేశాడు. కరెంట్​మీటర్ బాక్స్​వద్ద ఫ్యూజులు తీసేశాడు. వాటర్​ట్యాంక్​నుంచి సప్లయ్​బంద్​చేశాడు. శుక్రవారం ఉదయం ఆఫీసుకు వచ్చిన అధికారులు, సిబ్బంది వెంటనే బిల్డింగ్​యజమానికి ఫోన్ చేయగా, రెంట్​కట్టేవరకు తాళం తీయనని తేల్చి చెప్పాడు.

స్పందించిన ఉన్నతాధికారులు ఇంతియాజ్​ఖురేషితో ఫోన్లో మాట్లాడారు. అద్దె చెల్లిస్తామని చెప్పడంతో శుక్రవారం మధ్యాహ్నం ఆఫీసులను తెరిచాడు. లోనికి వెళ్లిన సిబ్బంది చాలాసేపు చీకట్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా అద్దె చెల్లించకపోతే బిల్డింగ్ ఖాళీ చేయాలని ఇంతియాజ్ ఖురేషి హెచ్చరించినట్లు తెలిసింది.