ప్రభుత్వ భూమిలో బిల్డింగులు కడుతున్నరు

మంచిర్యాల/ బెల్లంపల్లి,  వెలుగు: నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో కొత్త కలెక్టరేట్​కు కూతవేటు దూరంలో కోట్ల రూపాయల విలువజేసే ఐదున్నర ఎకరాల ప్రభుత్వ భూమి అక్రమార్కుల పాలవుతోంది. కొంతమంది పట్టా భూముల పేరిట హౌస్ పర్మిషన్లు తీసుకొని దాని పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిలో బిల్డింగులు కడుతున్నారు. అది గవర్నమెంట్ ల్యాండ్ అని తెలిసినా రెవెన్యూ, మున్సిపల్ ఆఫీసర్లు టీఎస్ బీపాస్ ద్వారా హౌస్ పర్మిషన్లు ఇస్తున్నారు. ఇటీవల ఈ విషయం బయటకు రావడంతో రెండు పర్మిషన్లు క్యాన్సల్ చేసి నిర్మాణాలను నిలిపివేశారు. కానీ ఇప్పటికే అందులో నాలుగైదు బిల్డింగులు వెలియడంతో  పాటు మరికొందరు కూడా ఇండ్లు కట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే అడ్డుకోకుంటే మిగిలిన జాగా కూడా ఖతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఏండ్ల కిందటే అమ్మకాలు.. 

తోళ్లవాగును ఆనుకొని ఉన్న సర్వే నంబర్ 36లో ఐదున్నర ఎకరాల పరంపోగు భూమి, దాని పక్కనే సర్వే నంబర్ 35లో 9.8 ఎకరాల పట్టా భూమి ఉంది. ఈ పట్టా భూమిని ఏండ్ల కిందనే ప్లాట్లు చేసి అమ్మేశారు. సర్వేనంబర్ 35 డాక్యుమెంట్లతోనే 36 సర్వేనంబర్​లోని భూమిని కూడా అమ్మినట్టు తెలుస్తోంది. ఈ భూములు క్రయ విక్రయాల ద్వారా పలువురి చేతులు మారాయి. దగ్గరలోనే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణం జరుగుతుండడంతో ఇటీవల ఈ ప్రాంతంలో ఇండ్ల నిర్మాణాలు జోరందుకున్నాయి. ప్రస్తుతం ఇక్కడ గజం ధర రూ.15 వేల నుంచి రూ.20 వేలు పలుకుతోంది. 

ప్రభుత్వ భూమిలోనే నిర్మాణాలు.. 

ఇటీవల కొంతమంది సర్వేనంబర్ 35కు సంబంధించిన డాక్యుమెంట్లతో టీఎస్ బీపాస్​లో హౌస్ పర్మిషన్ల కోసం అప్లై చేశారు. ముందుగా రెవెన్యూ ఆఫీసర్లు డాక్యుమెంట్లను పరిశీలించి ఫిజికల్​గా వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. అన్నీ సరిగా ఉంటే మున్సిపల్  ఆఫీసర్లు హౌస్ పర్మిషన్ ఇస్తారు. కానీ సర్వేనంబర్ 35కు సంబంధించిన డాక్యుమెంట్లు పెట్టి సర్వేనంబర్ 36లో బిల్డింగులు కడుతున్నట్లు.. రెవెన్యూ ఆఫీసర్లు గుర్తించి రిమార్క్స్​లో ఈ విషయాన్ని పేర్కొన్నట్టు చెప్తున్నారు. మున్సిపల్ ఆఫీసర్లు ఇవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వ భూమిలో ఇండ్లు కట్టుకోవడానికి పర్మిషన్లు ఇచ్చినట్లు  ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయం బయటకు రావడంతో పర్మిషన్లు క్యాన్సల్ చేసి నిర్మాణాలను నిలిపివేశారు. దీంతో సంబంధిత యజమానులు హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. 

విలువైన భూమిని కాపాడుతారా?

నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటికే  వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయి. కొంతమంది అసైన్మెంట్ పేరుతో కబ్జాలు చేయగా, మరికొందరు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ప్రభుత్వ భూముల్లో పాగా వేశారు. దీనికి రెవెన్యూ ఆఫీసర్ల నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ భూములను సర్వే చేసి వాటి చుట్టూ ఫెన్సింగ్ వేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు.  ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్ల ప్రభుత్వ భూమి ఏదో, ప్రైవేట్ భూమి ఏదో అంతుచిక్కని పరిస్థితి. ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జాదారులు ఖతం చేస్తున్నారు. ఇప్పుడు సర్వేనంబర్ 36 వంతు వచ్చింది. ఉన్నతాధికారులు స్పందించి కోట్ల విలువైన ఈ భూమిని కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 

బెల్లంపల్లిలో  సింగరేణి భూమి కూడా..

బెల్లంపల్లి పట్టణ నడిబొడ్డున అశోక్ నగర్ క్రాస్ రోడ్డు కు వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపుల గతంలో  బూడిద కుప్పలు పోసి ఉన్న     కోట్ల రూపాయల విలువైన సింగరేణి  భూములు కబ్జా చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.  కొద్ది రోజుల  కింద ఓ వ్యక్తి బూడిద కుప్పల భూమిని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. బూడిదికుప్పలను ,ఆ కుప్పలపై ఉన్న  భారీ వృక్షాలను నరికేసి దాదాపు 4 నుంచి 5 గుంటల  భూమిని ఆక్రమించి సదరు  భూమిలో ఇల్లు నిర్మించేందుకు  పునాదులు నిర్మిస్తున్నారు.  సంస్థ భూమిని అక్రమార్కులు కబ్జా చేస్తున్నా.. అటు  సింగరేణి, రెవెన్యూ ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో పలు విమర్శలు వస్తున్నాయి. సింగరేణి, ప్రభుత్వ భూములపై భూ బకాసురులు కన్నేసి రాజకీయ అండదండలతో  మింగేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇదిలా ఉండగా.. గతంలో పట్టణంలో కొత్తగా నిర్మిస్తున్న అంబేద్కర్ భవనం వెనక గల భూములను కాపాడేందుకు సింగరేణి యాజమాన్యం పెన్సింగ్ పోల్స్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ భూమిలో చెట్లు భారీగా పెరిగాయి. దీన్ని ఆసరా చేసుకుని చెట్ల మాటున భూమిని కబ్జా చేసి నామ రూపాలు లేకుండా చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ, సింగరేణి రక్షణ విభాగం ఆఫీసర్ల కను సన్నల్లోనే ఈ  దందా సాగుతోందని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సింగరేణి, రెవెన్యూ హయ్యర్​ఆఫీసర్లు వెంటనే స్పందించి సంస్థ భూములను కాపాడాలని కోరుతున్నారు.