అసంపూర్తి భవనాలు అందని వైద్యం.. గోస పడుతున్న గిరిజనం

ఆసిఫాబాద్ ,వెలుగు : గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం నిర్మించిన హెల్త్ సబ్ సెంటర్ల భవనాలు పూర్తి కాక వెక్కిరిస్తున్నాయి.  పూర్తయిన భవనాలు  కూడా ప్రారంభానికి నోచుకోవడం లేదు. అధికారుల అలసత్వం కారణంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందడం లేదు. ట్రీట్ మెంట్ కోసం 30 నుంచి 40 కిలోమీటర్ల దూరం పోవాల్సిన దుస్థితి జిల్లాలో నెలకొంది.  చాలా చోట్ల  ప్రారంభానికి ముందే భవనాలు శిథిలమవుతున్నాయి. 

సిబ్బంది కొరతతో ఇక్కట్లు...

జిల్లా వ్యాప్తంగా 20 పీహెచ్​సీలు, 2 కమ్యూనిటీ ఆరో గ్య కేంద్రాలు,  2 అర్బన్​ హెల్త్​ సెంటర్స్, 108  ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. 46 డాక్టర్ పోస్టులకు గాను24 ఖాళీలు ఉన్నాయి. 77  స్టాప్ నర్స్​ పోస్టులకు 38 ఖాళీలు, 25 ఫార్మసిస్ట్ పోస్టులకు గాను3 ఖాళీలు, 26 ల్యాబ్ టెక్నీషియన్​ పోస్టులకు 7 ఖాళీలు, 114  మల్టీపర్సస్ హెల్త్ వర్కర్స్ (ఆడ ) గాను 31 ఖాళీలు ఉన్నాయి. మల్టీపర్సస్ హెల్త్ వర్కర్స్ (మగ ) 65 పోస్టులకు 31 ఖాళీలు ఉన్నాయి. సూపర్ వైజర్ (ఆడ) 22 పోస్టులకు 3 ఖాళీలు, సూపర్ వైజర్ (మగ ) 22పోస్టులకు10 ఖాళీలు, మల్టీపర్పస్ హెల్త్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్13 పోస్టులకు 5 ఖాళీలు, సెకండ్ ఏఎన్ఎం106 పోస్టులకు గాను 5 ఖాళీలు ఉన్నాయి.  దీంతో ఏజెన్సీ వాసులకు మెరుగైన వైద్యం అందడం లేదు. జిల్లాలో 108 ఉప కేంద్రాల్లో48 కేంద్రాలకు  ఇప్పటికీ  పక్కా  భవనాలు లేవు.

కెరమెరి మండలం నిషాని గ్రామంలో పదేళ్ల క్రితం రూ.10 లక్షలతో సబ్ సెంటర్ నిర్మించినా ఇప్పటి వరకు ప్రారంభించ లేదు.  ట్రీట్మెంట్ కోసం గిరిజనలు 30 కిలోమీటర్ల దూరం పోతున్నారు.
 
 కాగజ్ నగర్ మండలం కొసిని గ్రామంలో నిర్మించిన సబ్ సెంటర్ కంప్లీట్ అయి నెలలు గడుస్తున్నా ఓపెన్ చేయడం లేదు. ఫలితంగా  ప్రజలు వైద్య సేవల కోసం 5 కి.మీ. దూరంలో ఉన్న కాగజ్ నగర్ కు పోతున్నారు. 

 దహెగాం మండలంలోని బీబ్రా గ్రామంలో వెల్ నెస్ సెంటర్ భవన నిర్మాణం పూర్తయి ఏడాదైనా ఇంకా ప్రారంభం కాలేదు. అద్దె ఇంట్లో నడుపుతున్నారు. దీన్ని ప్రారంభిస్తే 11గ్రామాలకు వైద్య సేవలు అందించడానికి సౌలత్ ఉంటది..

 తిర్యాణి మండలం గుండాల గ్రామంలో  సబ్ సెంటర్లను నిర్మించినా ఓపెన్ చేయలేదు.  గిరిజనులు వైద్యం కోసం 12 కి.మీ. దూరంలో ఉన్న మండల కేంద్రానికి వెళుతున్నారు. కొండలు గుట్టలు ఎక్కి ట్రీట్మెంట్ కోసం గోస పడుతున్నారు.

 తిర్యాణి మండలం గిన్నేధరి  గ్రామంలో నిర్మించిన సబ్ సెంటర్ ఏనిమిదేళ్లుగా అసంపూర్తిగా ఉంది. మంగి గ్రామంలో నిర్మిస్తున్న హెల్త్ సబ్ సెంటర్ ఏళ్లు గడుస్తున్నా కంప్లీట్ కాలేదు.

ఎనిమిదేళ్లు అవుతున్నా కంప్లీట్ చేస్తలేరు

మారుమూల గ్రామం మంగిలో ఎనిమిదేళ్లు గడుస్తున్నా హెల్త్ సబ్ సెంటర్ కంప్లీట్ చేయలే. ఇక్కడి గిరిజనులకు సరైన మందులు, ట్రీట్​మెంట్ అందడం లేదు. మండల కేంద్రానికి వెళ్లాలంటే 18 కి.మీ   వెళ్లాలి. ఇప్పటికైనా అధికారులు స్పందించి బిల్డింగ్ కంప్లీట్ చేయాలి.
ఆత్రం భీంరావు , మంగి కొలాం గుడా , తిర్యాణి

సబ్ సెంటర్ అందుబాటులో తేవాలి

గ్రామంలో నిర్మించిన హెల్త్ సబ్ సెంటర్ ను ప్రజలకు అందుబాటులోకి తేవాలి.  చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా  కి.మీ నడిచి మండల కేంద్రానికి పోవాలె. ఎందుకింత నిర్లక్ష్యం. అధికారులు పట్టించుకోవాలే. గిరిజనులకు వైద్య సేవలు అందుబాటులోకి తేవాలే.

మర్సుకోల శంకర్, గుండాల