మామూలుగా ఫారిన్ ట్రిప్ అంటే ఆకాశాన్నంటే మేడలు–మిద్దెలు, విశాలమైన రోడ్లు, రకరకాల వాహనాలు వగైరా.. ఇవే గుర్తొస్తుంటాయి. కానీ, ఈ ఊరి గురించి తెలిస్తే మాత్రం.. ఒక చిన్న విలేజ్ ఇంత బాగుందా? అనిపిస్తుంది. జానపద కళలకు నిలయమైన ఆ ఊరికి వెళ్తే ఎన్నో కథలు వినొచ్చు. ఆ ఊరి పేరు బుక్చాన్ హనోక్. సౌత్‌కొరియాలో ఉన్న బుక్చాన్ గురించి ఇంట్రెస్టింగ్ సంగతులు తెలియాలంటే ఇది చదవాల్సిందే!
సౌత్ కొరియాలోని సియోల్‌లో కొండ మీద ఉంది బుక్చాన్ హనోక్ విలేజ్. జంగ్బుకంగ్, చెంగ్బుకంగ్ ప్యాలెస్‌ల మధ్య ఆరు వందల ఏండ్ల నాటి చెక్క ఇళ్లతో ఉన్న ఊరు ఇది. బుక్చాన్ అంటే కొరియాలో నార్తర్న్ విలేజ్ అని అర్థం. అది చెయొంగ్చెయిన్ నది పక్కనే ఉంటుంది. అప్పట్లో ఇక్కడ జొసియిన్ రాజవంశం ఉండేది. కొరియా యుద్ధం, కొన్ని విపత్తుల కారణంగా ఊరు నాశనమైంది. ఆ తర్వాత కొంతకాలానికి కోలుకుని, జానపద కళలకు నిలయంగా మారింది.
ఇప్పటికీ ఇక్కడ కనిపించే రెస్టారెంట్స్‌లో చాలా వరకు జొసియన్ రాజవంశపు ఛాయలు కనిపిస్తాయి. ఇక్కడ కల్చరల్ సెంటర్స్, మ్యూజియంలు ఉంటాయి. ఇదొక ఫేమస్ టూరిస్ట్ ప్లేస్. ఇక్కడ వాకింగ్ టూర్స్ చేయొచ్చు. ఊరి ఎంట్రన్స్‌లో అక్కడి ట్రెడిషనల్ డ్రెస్‌లు రెంట్‌కి ఇస్తుంటారు. ఆ డ్రెస్‌లని ‘హాన్బాక్’ అంటారు. ఇక్కడున్న చాలా స్టోర్స్ లేదా షాప్స్ బయట ఆ షాప్ యజమాని ఫొటో ఉంటుంది.
ఇప్పుడు ఇలా..
బుక్చాన్.. కొరియన్ ట్రెడిషనల్ విలేజ్. ఈ ఊళ్లో ఇప్పటికీ కొన్ని వందల ఏండ్ల నాటి ట్రెడిషనల్ ఇళ్లు ఎక్కువగా కనిపిస్తాయి. వాటిని చూస్తే వందల ఏండ్ల నాటి చరిత్ర కళ్లముందు మెదలడం ఖాయం. ఊరి లోపలికి వెళ్లడానికి ఎంట్రీ ఫీజు ఉండదు. కానీ కొన్ని రూల్స్ మాత్రం తప్పకుండా పాటించాలి. ఆ ఊళ్లో కనిపించే ఇళ్లు కొరియన్ సినిమాలు చూసేవాళ్లకి అయితే చాలా పరిచయం ఉన్నట్టే అనిపిస్తాయి. ఎందుకంటే చాలావరకు సినిమా షూటింగ్‌లు ఈ ఇళ్లలో లేదా వీటి బ్యాక్‌గ్రౌండ్‌లో తీస్తారు.
ఇక్కడ ఇళ్లన్నీ చెక్క, రాయి వాడి కట్టినవే. అద్భుతమైన ఆర్కిటెక్చర్‌తో ఆకట్టుకునే ఈ ఇళ్లు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయంటే వాటికోసం ప్రత్యేకంగా తీసుకునే శ్రద్ధే అందుకు కారణం. దూరం నుంచి చూస్తే అన్నీ ఒకేలా కనిపిస్తాయి. దగ్గరకి వెళ్లి చూస్తే కానీ వాటిలోని రకరకాల డిజైన్స్ కనిపించవు. ఒక్కో ఇంటినీ దగ్గరగా చూస్తూ నడుస్తుంటే తెలియకుండా టైం గడిచిపోతుంది. కానీ, ఆ ఇళ్లలో ఉండే వాళ్లను డిస్టర్బ్ చేయకూడదు. తలుపు కొట్టడం, గోల చేయడం వంటివి చేయకూడదు. వాటిలో కొన్ని ఇళ్లను గెస్ట్‌హౌస్‌లుగా, రెస్టారెంట్లుగా కూడా మార్చేశారు.
కొరియా యుద్ధం జరిగినప్పుడు అప్పటి నిర్మాణాలన్నీ పాడైపోయాయి. అప్పట్లో ఒక్కో ఇంట్లో చాలామంది ఉండేవాళ్లు. అందుకు తగ్గట్టే ఆ ఇళ్లని కట్టారు. ఈ గ్రామాన్ని సియోల్ దత్తత తీసుకుంది. అప్పటి నుంచి మోడర్న్ లైఫ్ స్టైల్‌కి అలవాటు పడ్డారు. 1990లో ‘హనొక్ కన్జర్వేషన్ అండ్ రీజనరేషన్’ ప్రాజెక్ట్ తెచ్చారు. అందులో భాగంగా ఈ ప్రాంతాన్ని కొరియన్ సంస్కృతి కాపాడేందుకు వాడాలని నిర్ణయించారు. అంతేకాకుండా కొంచెం మోడర్న్‌గా మార్చి, కేఫ్, ఆర్ట్ గ్యాలరీ, హోం స్టే సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
సియోల్ టవర్
బుక్చాన్ విలేజ్ నుంచి సియోల్ టవర్ మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడికి వెళ్తే టవర్ ఎక్కి సియోల్ సిటీ అందాలు చూడొచ్చు. సూర్యాస్తమయం టైంలో వెళ్తే అందమైన ప్రకృతి దృశ్యాలు కెమెరాలో క్యాప్చర్ చేయొచ్చు.
ట్రెడిషన్ కోసం...
సియోల్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్‌లో ఎనిమిది మ్యూజిక్ గ్రూప్‌లు ఉంటాయి. ట్రెడిషనల్ వాల్యూస్, కళలను ప్రోత్సహించడానికి అక్కడి ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. ఇందులో కల్చరల్ మాస్టర్స్ ప్రజలకు ట్రైనింగ్ ఇస్తుంటారు. ఎన్నో ఈవెంట్స్, కాన్ఫరెన్స్‌లు జరుగుతుంటాయి. క్రాఫ్ట్ మాస్టర్స్ ‘నేషనల్ ఇంటాంజిబుల్ కల్చరల్ ఎసెట్స్’ పేరుతో పన్నెండు క్రాఫ్ట్స్‌ను డబ్ చేసి చెప్తుంటారు.
ఇలా వెళ్లాలి
ముందుగా సౌత్ కొరియాలోని సియోల్ వెళ్లాలి. సియోల్ నుంచి సబ్వే ట్రైన్లో వెళ్తే అంగక్ స్టేషన్ నుంచి బుక్చాన్ విలేజ్‌కి చేరుకోవచ్చు. అక్కడి నుంచి కొంచెం దూరం నడిస్తే ఊళ్లోకి వెళ్తారు. సియు అనే కన్వెన్షన్ స్టోర్‌కి వెళ్లి టీం అనే కార్డ్ తీసుకోవాలి. అది మెట్రో రైల్ లేదా బస్ ఎక్కడానికి ఉపయోగపడుతుంది. ఒక్కోటి నాలుగు వేల కొరియన్ వోన్లు ఉంటుంది. అక్కడి నుంచి మెట్రోలో బుక్చాన్ విలేజ్ వెళ్లాలి. రెంట్‌కి సైకిల్స్, క్విక్బోర్డ్ స్కూటర్స్ దొరుకుతాయి. వీటికోసం కకావ యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.
కొరియన్ డ్రామాల ఎఫెక్ట్
కె (కొరియన్) డ్రామాల గురించి చెప్పక్కర్లేదు. కొరియన్ డ్రామాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. కె డ్రామా ఫిల్మ్ షూటింగ్స్ జరిగే లొకేషన్స్ అన్నీ ఈ ఊళ్లో కనిపిస్తాయి. ఎందుకంటే వాళ్లు షూటింగ్ చేసేది ఇక్కడే.
అన్నింటికీ మ్యూజియాలే!
టీ మ్యూజియం : ఇక్కడ ట్రెడిషనల్ టీ షాప్స్ ఉంటాయి. అందులో టీ వల్ల కలిగే ఉపయోగాలను టీ థెరపీ పేరుతో ఒక బోర్డ్ మీద రాసి పెడతారు. రకరకాల టీలు, వాటి వల్ల కలిగే లాభాల గురించి ఉంటుంది. టీ మ్యూజియంలో కప్పులు, సాసర్లు, రకరకాల టీ పొడులు ఉంటాయి.
గొహొ : ఇది ప్రైవేట్ మ్యూజియం. దీన్ని 2002లో ప్రారంభించారు. ఇందులో1500 ఆర్ట్ క్రాఫ్ట్స్ ఉంటాయి. అందులో 150 క్లాసికల్ బుక్స్, 250 ఫోక్ ఆర్టిస్ట్‌లు వేసిన పెయింటింగ్స్, 750 కడియాలు, 250 కల్చరల్ ఐటమ్స్ ఉంటాయి. మెయిన్ ఎగ్జిబిషన్ హాల్లో జొసియన్ రాజవంశానికి చెందిన ట్రెడిషనల్ ఐటమ్స్ కనిపిస్తాయి. గొహొ ఫోక్ పెయింటింగ్ వర్క్‌షాప్ జరుగుతుంది ఇక్కడ.
బుక్చాన్ ఏసియన్ ఆర్ట్ : ఇక్కడ టూరిస్ట్‌ల కోసం రకరకాల ఆర్టిక్రాఫ్ట్స్ తయారుచేసి పెడతారు. అందులో 200 చైనీస్ ఆర్ట్, 150 కొరియన్ కాంటెంపరరీ ఆర్ట్, జొసియన్ రాజవంశానికి చెందిన 2500 పాత డాక్యుమెంట్స్ ఉంటాయి.
డాంగ్లిమ్ నాట్ : దీన్ని 2004లో ప్రారంభించారు. నాట్ అంటే ముడివేసిన దారం. ఇక్కడ బెల్ట్స్, థ్రెడ్, పౌచ్‌లు, హాన్బాక్, కొరియన్ నాట్స్ వంటివి దొరుకుతాయి.
హాన్ శాంగ్సూ ఎంబ్రాయిడరీ : హాన్ శాంగ్ సూ దీన్ని ప్రారంభించారు. ఇక్కడ దక్షిణ కొరియా ఎంబ్రాయిడరీ వర్క్స్ చాలా కనిపిస్తాయి.