దోమల హాట్​ స్పాట్లను గుర్తించాలి

  • బల్దియా కమిషనర్​ ఆమ్రపాలి ఆదేశం

హైదరాబాద్, వెలుగు: దోమలు ఉత్పత్తి అయ్యే హాట్ స్పాట్లను గుర్తించి, నివారణ చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. గురువారం జోనల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్, యూసీడీ, హెల్త్, చీఫ్ ఎంటమాలజీ, కాల్ సెంటర్ ఓఎస్డీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. స్కూళ్లు, కాలేజీల్లో డెంగ్యూ అవగాహన కార్యక్రమాలు పూర్తిచేసి, హాట్ స్పాట్లపై దృష్టి పెట్టాలన్నారు.

చెత్త సేకరణను సక్రమంగా నిర్వహిస్తున్న ఆటో డ్రైవర్లకు అవార్డులు ఇవ్వాలని శానిటేషన్ అడిషనల్ కమిషనర్​ను ఆదేశించారు. అంతకు ముందు కమిషనర్ జూబ్లీహిల్స్ సర్కిల్ లో పర్యటించారు. లోటస్ పాండ్, పాత్ వే, మంగోలియా బేకరీ తదితర ప్రాంతాలను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కమిషనర్ అనురాగ్ జయంతి, ఈఈ విజయ కుమార్, డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి పాల్గొన్నారు.