300 జంక్షన్ల అభివృద్ధికి బల్దియా ప్లాన్

  • ప్రతి సర్కిల్ నుంచి 10  ప్రాంతాల చొప్పున ఎంపిక  
  • ప్రధాన జంక్షన్లను గుర్తించాలని  కమిషనర్ ఆదేశాలు 
  • లోక్ సభ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పనులు  
  • పదేండ్ల పాలనలో జంక్షన్లను పట్టించుకోని గత సర్కార్ 

హైదరాబాద్, వెలుగు :సిటీలో ట్రాఫిక్​ ప్రాబ్లమ్స్ కు చెక్ పెట్టేందుకు జంక్షన్ల డెవలప్ మెంట్ కు జీహెచ్ఎంసీ ప్లాన్ చేసింది.  సర్కిల్ కు 10 జంక్షన్ల చొప్పుల డెవలప్ చేయనుంది. ఇందుకు మొత్తం 300 జంక్షన్లను వెంటనే గుర్తించాలని కొద్దిరోజుల కిందట అధికారులకు కమిషనర్ రోనాల్డ్ రాస్ ఆదేశాలు జారీ చేశారు. లోక్ సభ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత వెంటనే పనులు మొదలు పెట్టాలని సూచించారు.

గ్రేటర్ సిటీలో ఏండ్లుగా జంక్షన్లను అభివృద్ధి చేయలేదు.  మెట్రో రైల్ నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత ప్రధాన జంక్షన్లు కనుమరుగు అయ్యాయి. అప్పట్లో పెద్ద జంక్షన్లతో పాటు చాలా చోట్ల  సిగ్నల్​ఫ్రీ అంటూ కొంతదూరాన యూ టర్న్​లు పెట్టారు. మెట్రో రైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం జంక్షన్ల అభివృద్ధిని విస్మరించింది.

కేవలం వాటిని డెవలప్ చేస్తామని ప్రకటించింది. కానీ బల్దియా అప్పుల్లో కూరుకుపోయి ఉండగా.. పనులపై ముందుకు వెళ్లలేదు. కోర్ సిటీలో ట్రాఫిక్ జామ్​ఎక్కువగా ఉండే నాంపల్లి, పంజాగుట్ట, లిబర్టీ, రేతిబౌలి, మాసబ్ ట్యాంక్, బంజారాహిల్స్​ రోడ్డు నం.12, రోడ్ నం.10, తాజ్ కృష్ణ,  ప్యారడైస్, ప్యాట్నీ, రాణిగంజ్, కోఠి, పురానాపూల్, చాదర్​ఘాట్, మలక్ పేట్, లింగంపల్లి  తదితర మెయిన్ జంక్షన్ల డెవలప్ మెంట్ ని కూడా పూర్తిగా విస్మరించింది. 

ప్రతిపాదనలతోనే సరిపెట్టి

సిటీలో రోడ్ల విస్తరణ చేపట్టిన కొద్దీ ట్రాఫిక్​ కూడా అంతే స్థాయిలో పెరుగుతుంది. ఒకప్పుడు సిగ్నల్ కూడా అవసరంలేని ప్రాంతాల్లో ఇప్పుడు కిలోమీటరు ట్రాఫిక్ జామ్​ అవుతుంది. పోలీస్ శాఖ ఆదేశాల మేరకు సిటీలో 90 జంక్షన్ల అభివృద్ధికి నాలుగేండ్ల కిందట జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది. ఆయా ప్రాంతాల్లో  విస్తరణ పనులను జోనల్ కమిషనర్లకు అప్పగించింది. ఇందులో కొన్ని పనులు పూర్తయినట్లు చెబుతున్నా..  గ్రౌండ్ లెవల్ లో కనిపించడంలేదు.

0ఎప్పుడో పూర్తయిన హైటెక్ సిటీ, వంద ఫీట్ల రోడ్డు, ఎల్ బీనగర్, ఖైరతాబాద్​, నెక్లెస్​ రోడ్, ఫైనాన్షియల్​ డిస్ట్రిక్ట్ లోని పలు జంక్షన్లను కూడా మూడేండ్ల కిందట  పూర్తి చేసినట్లు జీహెచ్ఎంసీ చూపించింది.కానీ కొత్త జంక్షన్ల డెవలప్ మెంట్​పై మాత్రం దృష్టిపెట్టలేదు. ఎల్ బీ నగర్ జోన్ లో 11, చార్మినార్ జోన్ లో 9,  ఖైరతాబాద్ జోన్ లో 34, శేరిలింగం పల్లిలో 11, కూకట్ పల్లిలో 10, సికింద్రాబాద్ జోన్ లో15 జంక్షన్లను డెవలప్ చేయాలని గతంలో నిర్ణయించినా పనులైతే చేయలేదు. 

అధికారులతో బల్దియా కమిషనర్ మీటింగ్ 

జంక్షన్ల డెవలప్ పై బల్దియా కమిషనర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. దీనిపై ఇటీవల టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ అధికారులతో భేటీ అయ్యారు. ట్రాఫిక్ రద్దీ నియంత్రణలో భాగంగా పోలీస్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ అధికారులు సంయుక్తంగా జంక్షన్లను గుర్తించారు. ఆయా ప్రాంతాల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేసి టెండర్లు పిలవాలని అధికారులను కమిషనర్ ఆదేశించా రు. డెవలప్ చేయాల్సినవి ఇంకా గుర్తించకపోతే వెంటనే పూర్తి చేయాలని సూచించారు.

పాదచారుల ప్రమాదాల నివారణకు అవసరమైన చోట ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలకు స్థలం గుర్తించాలని స్పష్టం చేశారు. అయితే.. ఇప్పటికే  సిటీలో 22 చోట్ల బల్దియా ఫుట్ ఓవర్ బ్రిడ్జి ల నిర్మాణాలను చేపట్టింది. ఇందులో 11 అందుబాటులోకి వచ్చాయి. ఫుట్ ఓవర్ బ్రిడ్జిల వద్ద ఎస్కలేటర్లు పని చేయకుంటే వెంటనే మరమ్మతులు చేపట్టాలని కమిషనర్ సమావేశంలో ఆదేశించారు.