
- నోటీసులివ్వకుండా కూల్చివేతలొద్దు
- రాష్ట్రాలు, యూటీలకు గైడ్ లైన్స్ జారీ చేసిన అత్యున్నత న్యాయస్థానం
- నిందితుల ఇండ్లు కూల్చడం చట్ట వ్యతిరేకం
- ఒక్కరు తప్పు చేస్తే కుటుంబానికి శిక్ష వేస్తరా?
- అధికారులు జడ్జిల్లా తీర్పులు చెప్పొద్దు
- గైడ్ లైన్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం
- ప్రాసిక్యూట్ చేయడంతోపాటు బాధితులకు పరిహారం ఇప్పిస్తామని తీర్పు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా యూపీ, మధ్యప్రదేశ్, తదితర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు చేపడుతున్న ‘బుల్డోజర్ న్యాయం’ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల ఇండ్లను, షాపులను అక్రమంగా కూల్చివేయడం పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని తేల్చిచెప్పింది. షో కాజ్ నోటీసులు ఇవ్వకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్తుల కూల్చివేత చేపట్టవద్దంటూ అన్ని రాష్ట్రాలు, యూటీల అధికారులకు గైడ్ లైన్స్ ను జారీ చేసింది.
గైడ్ లైన్స్ ను ఉల్లంఘించే అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని, బాధితులకు వారి జీతాల నుంచే పరిహారం ఇప్పించాల్సి ఉంటుందని హెచ్చరించింది. వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ అధికారులు అమలు చేస్తున్న బుల్డోజర్ యాక్షన్ కు వ్యతిరేకంగా దాఖలైన పలు పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ తో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ బుధవారం తీర్పు వెలువరించింది. అధికారులు జడ్జిల మాదిరిగా తీర్పులు చెప్పొద్దని, పౌరుల ఆస్తులను కూల్చివేయడం ద్వారా శిక్షలు అమలుచేయొద్దని చెప్పింది. ప్రజల ఆస్తుల కూల్చివేతపై పూర్తిస్థాయిలో చట్ట ప్రకారమే చర్యలు తీసుకోవాలని 95 పేజీల తీర్పులో బెంచ్ ఆదేశించింది. ఈ గైడ్ లైన్స్ కాపీలను అన్ని రాష్ట్రాలు, యూటీల చీఫ్ సెక్రటరీలు, అన్ని హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్స్ కు పంపాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌కు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ గైడ్ లైన్స్ గురించి అన్ని రాష్ట్రాలు కలెక్టర్లకు, స్థానిక అధికారులకు సర్క్యులర్లు జారీ చేయాలని పేర్కొంది.
ఒక్కరు తప్పు చేస్తే.. మొత్తం కుటుంబానికి శిక్షా?
కుటుంబంలో ఎవరో ఒకరు తప్పు చేస్తే.. ఇండ్లను కూల్చివేయడం ద్వారా మొత్తం కుటుంబానికి శిక్ష వేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక్కరు చేసిన తప్పుకు రాత్రికి రాత్రే ఆ కుటుంబంలోని వృద్ధులు, పిల్లలు, మహిళలు, ఇతరులందరినీ రోడ్డున పడేయడం చట్ట వ్యతిరేకమని తేల్చిచెప్పింది. ఇలాంటి చట్ట విరుద్ధమైన చర్యలకు రాజ్యాంగంలో ఎలాంటి స్థానం లేదని పేర్కొంది.
ఆర్టికల్ 21 (జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ) ప్రకారం.. ఒక ప్రాపర్టీ అనేది కుటుంబంలోని అందరు సభ్యుల ఆశలు, భద్రత, భవిష్యత్తుకు సంబంధించిన విషయమని స్పష్టం చేసింది. అధికార దుర్వినియోగంతో చేపట్టే చర్యలను న్యాయ వ్యవస్థ చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించింది. ‘‘ఒక కేసులో నిందితుడుగా ఉన్న వ్యక్తి దోషి అని అధికారులు నిర్ణయించరాదు. వారి నివాసాలు, వాణిజ్య, ఇతర ఆస్తులు కూల్చివేయడం ద్వారా శిక్షించరాదు. ఇలాంటి చర్యలు తీసుకోవడం అంటే వారు హద్దులను మీరినట్టే అవుతుంది. అందుకే ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు ఉన్న విశేష అధికారాలను వినియోగిస్తూ.. పౌరుల హక్కులను కాపాడేందుకు గైడ్ లైన్స్ జారీ చేస్తున్నాం” అని బెంచ్ పేర్కొంది.
వీటికి మాత్రం మినహాయింపు..
ఆస్తుల కూల్చివేతకు సంబంధించి తాము జారీ చేసిన గైడ్‌లైన్స్ కొన్నిచోట్ల నిర్మించే అక్రమ కట్టడాలకు వర్తించబోవని సుప్రీం బెంచ్ తెలిపింది. రోడ్లు, వీధులు, ఫుట్‌పాత్‌లు, రైల్వే లైన్ల వంటి పబ్లిక్ ప్లేస్‌లు లేదా నదులు, జలాశయాలపై నిర్మించిన అక్రమ కట్టడాల కూల్చివేతలకు వర్తించవని చెప్పింది. అలాగే కోర్టులు ఆదేశాలు ఇచ్చిన సందర్భాల్లోనూ తమ గైడ్ లైన్స్‌ను అమలు చేయక్కర్లేదని వివరించింది.
గైడ్ లైన్స్ ఇవే..
- యజమానులకు ముందస్తుగా షో కాజ్ నోటీసు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్ట రాదు. వివరణ ఇచ్చేందుకు కనీసం 15 రోజులు లేదా స్థానిక చట్టాల ప్రకారం ఏది ఎక్కువైతే అంత సమయం ఇవ్వాలి.
- ప్రాపర్టీల ఓనర్లకు నోటీసులను రిజిస్టర్డ్ పోస్టులోనే పంపాలి. సంబంధిత నిర్మాణం ముందు భాగానికి నోటీసు అతికించాలి.
- షోకాజ్ నోటీసు అందించిన వెంటనే ఆ విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు ఈ–మెయిల్ చేసి అక్నాలెడ్జ్ మెంట్ పొందాలి.
- బిల్డింగ్ రెగ్యులేషన్స్, కూల్చివేతలకు సంబంధించి అధికారులతో సంప్రదింపుల కు జిల్లాకు ఒక నోడల్ ఆఫీసర్‌ను నేటి నుంచి నెల రోజుల్లోపు నియమించాలి.
- కూల్చివేయడానికి గల కారణాలను నోటీసులో తప్పనిసరిగా పేర్కొనాలి.
- షో కాజ్ నోటీసులు, బాధితుల సమాధానాలు, అధికారులు జారీ చేసిన ఆదేశాల వివరాలను అందుబాటులో ఉంచేందుకు గాను ప్రతి మున్సిపల్/లోకల్ అథారిటీకి ప్రత్యేక డిజిటల్ పోర్టల్‌ను నేటి నుంచి 3 నెలల్లో అందుబాటులోకి తేవాలి.
- కలెక్టర్ నియమించే నోడల్ ఆఫీసర్ బాధిత వ్యక్తుల నుంచి వ్యక్తిగత వివరణ తీసుకున్న తర్వాతే తుది ఆదేశాలు జారీ చేయాలి. ఆ వివరణతో ఎందుకు సంతృప్తి చెందలేదనే వివరాలను ఫైనల్ ఆర్డర్లో తప్పనిసరిగా పేర్కొనాలి.
- కూల్చివేతకు ముందు అధికారులు సమగ్రంగా ఇన్ స్పెక్షన్ రిపోర్టు తయారు చేయాలి. కూల్చివేతలను వీడియో రికార్డు చేసి పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి.
- ఈ గైడ్ లైన్స్ అధికారులు కచ్చితంగా పాటించాలి. ఉల్లంఘించే అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీస్కోవడంతో పాటు ప్రాసిక్యూట్ చేయాల్సి వస్తుంది.
- ఈ నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేతలు జరిపితే అధికారులదే పూర్తి బాధ్యత. ఆ కట్టడాల పునర్నిర్మాణానికి అయ్యే ఖర్చును వారే భరించాల్సి ఉంటుంది.