నేరాలు.. ఘోరాలు చేస్తున్న వ్యక్తుల ఇళ్లను బుల్ డోజర్లతో కూల్చివేయటం.. ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్ లో చూశాం.. ఇప్పుడు మధ్యప్రదేశ్ సర్కార్ సరికొత్తగా ఆలోచించింది. కేవలం ఇళ్లనే కాదు.. వారి పొలాల్లోకి బుల్ డోజర్లను పంపించింది. పంటను నాశనం చేసింది. పొలాలను స్వాధీనం చేసుకున్నది.. కొత్త తరహా జడ్జిమెంట్ పై స్థానికుల నుంచి మద్దతు లభించటం విశేషం.. పూర్తి వివరాల్లోకి వెళితే..
మధ్య ప్రదేశ్ రాష్ట్రం దామోహ్ జిల్లాలోని హీనౌటా గ్రామంలో కొన్ని రోజుల క్రితం బద్రీ శుక్లా, రాంశుక్లా అనే ఇద్దరు వ్యక్తులను ఇంటికొచ్చి కాల్చి చంపారు. ఈ హత్యలు చేసింది జహర్ సింగ్, ఉమైద్ సింగ్, మఖన్ సింగ్, అర్జున్ సింగ్ అని గుర్తించారు పోలీసులు. మూడేళ్లుగా ఈ రెండు కుటుంబాల మధ్య భూ వివాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే మార్చి 2వ తేదీన ఈ నలుగురు వ్యక్తులు శుక్లా ఇంటికొచ్చి.. తుపాకీతో కాల్చి చంపి.. అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన తర్వాత స్థానికుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. నిందితులను పోలీసులు కాపాడుతున్నారంటూ ఆందోళనలకు దిగారు.
ఆందోళనకారుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు స్థానిక అధికారులు రంగంలోకి దిగారు. మార్చి 15వ తేదీన హత్యకేసులోని నిందితుల ఇళ్లను కూల్చటంతోపాటు.. గ్రామంలో వారికి చెందిన పొలాల్లోని పంటలను నాశనం చేశారు. చేతికి వచ్చిన పంటను బుల్ డోజర్లతో తొక్కించారు. పొలాన్ని మొత్తం దున్నేశారు.. పంట వేసుకోవటానికి కూడా వీల్లేకుండా చేశారు అధికారులు. ఇప్పటి వరకు ఇళ్లను మాత్రమే కూల్చుతూ వస్తున్న యూపీ ప్రభుత్వానికి కొనసాగింపుగా అన్నట్లు.. మధ్యప్రదేశ్ సర్కార్ సైతం బుల్ డోజర్లను ఉపయోగించటం విశేషం. పొలాల్లోని పంటలను నాశనం చేస్తూ.. పొలాలను దున్నేస్తూ నిందితుల ఆర్థిక మూలాలపై దెబ్బకొడుతున్నారు.
అధికారుల చర్యలకు స్థానికుల మద్దతు లభించటం విశేషం. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ కృష్ణ చైతన్య స్పందించారు. హీనౌటా జంట హత్యల కేసులోని నిందితులు.. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని.. వాటిని మాత్రమే స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని.. కఠిన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నిందితులకు చెందిన పంటలను నాశనం చేయలేదని.. పొలాలను స్వాధీనం చేసుకున్నామని వివరించారు కలెక్టర్.