బిర్యానీ అంటే చాలు భోజన ప్రియుల నోట్లో నీళ్లూరుతాయి. ఏ టైం అయినా సరే వేడి వేడి బిర్యానీ రెడీగా ఉందంటే.. లొట్టలేసుకుంటూ తింటారు. అలాంటిది బిర్యానీ ఫ్రీ అంటే చాలు... ఎగిరి గంతులేస్తారు. అయితే అలాంటి అదిరే ఆఫర్ఇచ్చాడు ఓ రెస్టారెంట్ యజమాని. అయితే ఇక్కడ ఓ చిన్న కండీషన్ పెట్టాడండీ. పూర్తిగా ఫ్రీ కాకుండా.. బిర్యానీ కావాలంటే... కిలో టమాటా ఇవ్వాలని రూల్ పెట్టాడు. తమిళనాడు చెన్నైలో ఓ బిర్యానీ సెంటర్ వారు పెట్టిన ఈ ఆఫర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టమాటా ధర ఆకాశానికి అంటింది. ఏకంగా సెంచరీ కొట్టింది. కిలో టమాటా.. రూ.100కు చేరింది. అయితే కొన్ని చోట్ల వంద కూడా దాటింది. సామాన్యులు, మధ్యతరగతి వాళ్లు కొనలేని పరిస్థితి. వంద పెట్టి టమాటాలు కొనడం ఎందుకులే అని కొందరు కొనకుండా మానుకున్న పరిస్థితి వచ్చింది. అయితే తమిళనాడులో రూ. 150 రూపాయలకు కిలో టమోటా అమ్ముతున్నారు. దీంతో అక్కడ కూడా టమోటాలు కొనడం మానేశారు జనం. భోజన ప్రియులైతే బిర్యానీలపై పడ్డారు. చెన్నైలో ఓ బిర్యానీ సెంటర్ వారు పెట్టిన ఆఫర్ బంపర్ హిట్ అయింది. కిలో టమాటాలు తీసుకొస్తే.. అందుకు బదులుగా ఓ కిలో బిర్యానీ ఉచితంగా ఇస్తామని ఓ బిర్యానీ సెంటర్ ప్రకటించింది.
చెన్నై శివార్లలో ఉన్న అంబూర్ బిర్యానీ సెంటర్ నిర్వాహకుల ఈ అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చారు. బిర్యానీ లవర్స్ కోసం ఈ బంపర్ ఆఫర్ ప్రకటించారు. అయితే ఈ ఆఫర్ పెట్టడానికి ఓ కారణం కూడా ఉంది. వర్షాలతో అల్లాడిన చెన్నైలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. టమాటా అక్కడ కేజీ రూ.150లకు పైగా పలుకుతుంది. ఈ నేపధ్యంలో చెంగల్పట్టు జిల్లాలోని మధురాంతకం ప్రాపర్టీలోని అంబూర్ బిర్యానీ షాప్ యజమాని తన సేల్స్ పెంచుకోవడం కోసం కొత్త ఆఫర్ ప్రకటించారు. దీంతో బిర్యానీ కోసం భోజన ప్రియులు ఎగబడుతున్నారు. అంబూర్ బిర్యానీ షాప్‌లో ఒక కేజీ బిర్యానీ వంద రూపాయిలు.. ఎవరైనా రెండు కేజీల బిర్యానీ కొంటే వారికి అరకిలో టమాటాలు ఫ్రీగా ఇస్తామని ఆఫర్ చేశారు. ఒక కేజీ టమాటోలు తీసుకుని వచ్చి ఇస్తే.. ఒక కేజీ బిర్యానీ ఫ్రీగా ఇస్తామని ఆఫర్ ఇవ్వడంతో క్యూ కట్టారు. దీంతో యజమాని పంట పండింది. బిర్యానీకీ ఫుల్ డిమాండ్ పెరిగింది.