నల్గొండ, వెలుగు: ఎన్నికల వేళ జంప్ జిలానీలకు బంపర్ ఆఫర్లు అందుతున్నాయి. బలం పెంచుకునేందుకు అధికార, ప్రతిపక్షాలు పోటీ పడి మరీ ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటున్నాయి. ఇందుకోసం ఎంతైనా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఇతర పార్టీల్లోకి వలస వెళ్తున్న నేతలకు భారీ నజరానాలు అందుతున్నాయి.
నియోజకవర్గ స్థాయి నేతలు, మండలాలు, పట్టణాల్లో ఓటర్లపై ప్రభావం చూపే ముఖ్య నేతలకు రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షల దాకా.. గ్రామ స్థాయి నేతలకు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల దాకా ఆఫర్‌చేస్తున్నట్టు తెలుస్తోంది. కొందరు కీలక నేతలకు క్యాష్తో పాటు కార్లు, బంగారం కూడా ఇస్తున్నట్టు చర్చ జరుగుతోంది. జంప్ జిలానీల కోసం ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్మధ్యే పోటీ ఉంది. ఇదే చాన్స్ అనుకుంటూ.. నేతలు కూడా ఎవరు ఎక్కువిస్తే అటువైపే మొగ్గుచూపుతున్నారు.
బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ గాలం..
చాలా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై లోకల్ ప్రజాప్రతినిధులు, సెకండ్ క్యాడర్ లీడర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీళ్లను బుజ్జగించేందుకు ఆయా నియోజకవర్గాలకు పార్టీ ఇన్చార్జులను పంపించినా ఫలితం కనిపించలేదు. ఇలాంటి లీడర్లకే కాంగ్రెస్ అభ్యర్థులు ఎర వేస్తున్నారు. బీఆర్ఎస్లో కొనసాగుతున్న రెండోస్థాయి నేతలంతా ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నోళ్లే కావడం, పైగా ఇప్పుడు మంచి ఆఫర్లు వస్తుండడంతో ఈజీగా పార్టీ మారుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో సొంత పార్టీ లీడర్లను కాపాడుకుందుకు బీఆర్ఎస్ క్యాండిడేట్లు కూడా భారీ మొత్తంలో ఆఫర్ చేస్తున్నారు. ఇటీవల నల్గొండ, నాగార్జునసాగర్, హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరారు. వాళ్లు పార్టీ మారకుండా ఉండేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు ఇస్తామని ఆఫర్ చేసినా ఒప్పుకోలేదని తెలిసింది.
అలర్ట్ అయిన బీఆర్ఎస్..
బీఆర్ఎస్ నుంచి వలస వచ్చే లీడర్లకు కాంగ్రెస్‌నుంచి భారీ ఆఫర్లు అందుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల నల్గొండలో పార్టీ మారిన కౌన్సిలర్లకు రూ.30 లక్షల నజరానా ఇచ్చినట్టుగా చర్చ జరుగుతోంది. ఈ ఆఫర్ గురించి తెలుసుకున్న మిగతా కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారని సమాచారం.
దీంతో అలర్ట్ అయిన బీఆర్ఎస్ క్యాండిడేట్.. నల్గొండ నియోజకవర్గంలోని సర్పంచులు, చోటామోటా లీడర్లు చేజారిపోకుండా అడ్వాన్స్ రూపంలో రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు ముట్టజెప్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. నాగార్జునసాగర్‌లో పార్టీ మారిన సర్పంచులు, ఎంపీటీసీలు.. కాంగ్రెస్ నేత జానారెడ్డి నుంచి రూ.2 లక్షలు తీసుకున్నారని ఎమ్మెల్యే భగత్ ఆరోపించడం గమనార్హం.
ఇతర సెగ్మెంట్లలోని నేతల్లో వణుకు..
కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు.. వలస వస్తున్న నేతలకు పోటా పోటీ ఆఫర్లు ప్రకటిస్తుండడంతో మిగిలిన నియోజకవర్గాల్లోని క్యాండిడేట్లు, ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. పక్క నియోజకవర్గాలను చూసి తమ సెగ్మెంట్ లోని లీడర్లు కూడా అసమ్మతిరాగం అందుకుంటున్నారని వాపోతున్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల ఖర్చు జనరల్ స్థానాల్లో రూ.50 కోట్ల వరకు, రిజర్వుడ్ స్థానాల్లో రూ.30 కోట్ల వరకు ఉండొచ్చని అభ్యర్థుల అంచనా. కానీ లోకల్ లీడర్లకే రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షల దాకా ఇస్తుండడంతో మరో రూ.50 కోట్లు కూడా చాలవని ఆందోళన చెందుతున్నారు.
పోటాపోటీగా ఆఫర్లు..
- కొత్తగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ప్రధాన అనుచరుడొకరు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవ్వగా.. బీఆర్ఎస్ భారీ ఆఫర్ ఇవ్వడంతో ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.
- భద్రాద్రి జిల్లాలోని చండ్రుగొండ మండలం లో కాంగ్రెస్ సీనియర్ ప్రజాప్రతినిధికి భారీ ఆఫర్ ప్రకటించడంతోనే ఆయన బీఆర్ఎస్లో చేరినట్టు చర్చ జరుగుతోంది.
- పినపాకలో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లోకి వెళ్లకుండా ఆపేందుకు కాంట్రాక్టులు ఇస్తామని అగ్రిమెంట్లు రాసిచ్చినట్టు తెలిసింది.
- మెదక్ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన ముగ్గురు ముఖ్య నాయకులు ఇటీవల బీఆర్ఎస్లో చేరారు. వారిలో ఒక్కొక్కరికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ముట్టజెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.
- జోగులాంబ గద్వాల జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి ఇతర పార్టీల నేతలకు రూ.5 లక్షల దాకా ఆఫర్ చేస్తున్నట్టు సమాచారం.
- మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ నియోజకవర్గం ఎమ్మెల్యే ఇతర పార్టీ నేతలకు రూ.15 లక్షలు ఆఫర్ చేసినట్టు తెలిసింది.