
టీమిండియా తదుపరి టెస్ట్ కెప్టెన్‌గా స్పీడ్ గన్ జస్ప్రీత్ బుమ్రా ఎంపికైనట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే, బీసీసీఐ ఈ నిర్ణయంపై ఓ కొలిక్కి వచ్చిందని, ప్రకటించడమే మిగిలివుందని కథనాలు వస్తున్నాయి. బుమ్రాకు బాధ్యతలు అప్పగించేందుకు ప్రస్తుత సారథి రోహిత్‌ను బీసీసీఐ పెద్దలు ఒప్పించారని సమాచారం.
ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత రిటైర్మెంట్..?
ప్రస్తుతం రోహిత్ ఛాంపియన్స్ ట్రోఫీపైనే ద్రుష్టి పెట్టాడు. తరువాత ఐపీఎల్ ప్రారంభమవుతుంది. రాబోవు మూణ్నెల్లు ఈ రెండింటికే గడిచిపోతాయి. జూన్‌లో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ నెక్స్ట్ సర్కిల్ ప్రారంభమవుతుంది. అప్పుడు రోహిత్ టెస్టుల్లో కొనసాగుతాడా? లేదా? అనేది ఇంకా తెలియదు. ఇటీవల అతని ఫామ్ చూస్తే.. కొనసాగడం దాదాపు అసంభవమే. గెలిచినా.. గెలవకున్నా.. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిశాక అతడు రిటైర్మెంట్ ప్రకటించొచ్చని తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీసీసీఐ ముందస్తుగా కెప్టెన్‌ను సిద్ధం చేసిందన్నది వస్తున్న వార్తల సారాంశం.
బుమ్రాకు గాయాల బెడద..!
తదుపరి టెస్ట్ కెప్టెన్‌గా బుమ్రా ఎంపిక సరైనదే అయినప్పటికీ, పదే పదే గాయాల బారిన అతడు ఎన్ని మ్యాచ్‌ల్లో జట్టుకు అందుబాటులో ఉంటాడనేది అసలు ప్రశ్న. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ చివరలో వెన్ను నొప్పి గాయంతో దూరమైన బుమ్రా.. ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన టీ20, వన్డే సిరీస్‌లకు దూరమయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీ నుండి తప్పుకున్నాడు. బహుశా..! అతడు కోట్లు కురిపించే ఐపీఎల్ నాటికి జట్టుతో కలవచ్చు. ప్రస్తుతం బుమ్రా భారత టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్.
బుమ్రా ఇప్పటివరకు మూడు టెస్టుల్లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు. ఇందులో రెండు సందర్భాల్లోనూ రోహిత్ అందుబాటులో లేడు. జూలై 2022లో వాయిదా పడిన బర్మింగ్‌హామ్ టెస్ట్‌కు బుమ్రా తొలిసారి కెప్టెన్సీ చేశాడు. ఆ టెస్టులో భారత్ ఓడిపోయింది. ఆ సమయంలో రోహిత్ కోవిడ్ బారిన పడ్డాడు. అనంతరం ఇటీవల ఆసీస్ పర్యటనలో రెండు టెస్టుల్లో జట్టును నడిపించాడు. పెర్త్‌లో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో బుమ్రా ఒంటి చేత్తో భారత్‌కు విజయం అందించాడు. అనంతరం చివరి మ్యాచ్‌లో ఓటమిని చవిచూశాడు.