- ఓపెనర్‌గా కేఎల్ రాహుల్‌ను ఆడిస్తాం
- జట్టు ప్రయోజనాలకే నితీశ్ రెడ్డి ఎంపిక: గంభీర్
- ఆస్ట్రేలియా బయల్దేరిన టీమిండియా
ముంబై: ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోతే వైస్ కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా నాయకత్వం వహిస్తాడని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు. రోహిత్ ప్లేస్‌లో కేఎల్ రాహుల్‌ను ఓపెనర్‌గా పంపిస్తామన్నాడు. సోమవారం రెండో విడతగా ఇండియా ప్లేయర్లు ఆసీస్‌కు బయలుదేరగా తన భార్య రెండో బిడ్డకు జన్మనివ్వనున్న నేపథ్యంలో రోహిత్ ఇండియాలోనే ఉండిపోయాడు.
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రోహిత్ తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా? లేదా? అన్న దానిపై క్లారిటీ లేదు. పరిస్థితి ఏంటన్నది తర్వాతి రోజుల్లో వెల్లడిస్తాం. సిరీస్ ఆరంభానికి ముందు దీనిపై స్పష్టత వస్తుంది. ఒకవేళ పెర్త్ మ్యాచ్‌లో రోహిత్ ఆడకపోతే బుమ్రా సారథ్యం వహిస్తాడు’ అని టీమ్ ఆస్ట్రేలియా బయల్దేరే ముందు జరిగిన మీడియా సమావేశంలో గంభీర్ తెలిపాడు. ఇండియా–ఎ తరఫున ఆడిన రాహుల్, అభిమన్యు ఈశ్వరన్ అందుబాటులో ఉన్నారన్న కోచ్ తొలి టెస్టుకు ఇద్దరిలో ఒకర్ని తీసుకుంటామన్నాడు.
‘ఓపెనింగ్ కోసం చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మ్యాచ్ టైమ్ దగ్గరపడినప్పుడు తుది జట్టుపై నిర్ణయం తీసుకుంటాం.
కొన్నిసార్లు అనుభవానికి కూడా పెద్ద పీట వేయాల్సి ఉంటుంది. రాహుల్ టాపార్డర్‌తో పాటు మూడు, ఆరో నంబర్‌లోనూ బ్యాటింగ్ చేయగలడు. ఇలాంటి ప్రతిభ ఉన్న ప్లేయర్లు ఎన్ని దేశాల్లో ఉన్నారో చెప్పండి. కాబట్టి మాకు అవసరం అనుకుంటే రాహుల్‌తోనే ముందుకెళ్తాం’ అని గంభీర్ వివరించాడు.
నితీష్‌కే మద్దతు..
అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డిని జట్టులోకి తీసుకోవడాన్ని గంభీర్ సమర్థించాడు. దీంతో ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కు దాదాపుగా తలుపులు మూసుకుపోయినట్లే అని హింట్ ఇచ్చాడు. ‘మేం జట్టుగా ముందుకు సాగాలని అనుకుంటున్నాం. దేశం తరఫున ఆడేందుకు మేం బెస్ట్ టీమ్‌ను ఎంపిక చేశామని భావిస్తున్నాం. జట్టు కోసం ఆడే అత్యుత్తమ ప్లేయర్లను తీసుకున్నాం. నితీష్‌లో అద్భుతమైన ప్రతిభ ఉంది. అతన్ని తీసుకోవడం వల్ల చాలా ప్రత్యామ్నాయాలు అందుబాటులో వస్తాయి. మేం ఏది అనుకుంటే దాన్ని అతను నెరవేరుస్తాడు’ అని గంభీర్ వెల్లడించాడు.
హర్షిత్ రాణాపై పని భారం పెంచొద్దనే ఉద్దేశంతోనే అనధికార టెస్ట్‌ల కోసం ఆసీస్‌కు పంపలేదన్నాడు. ‘పేసర్లను ఫ్రెష్‌గా ఉంచడం మాకు చాలా ప్రధానం. ఇది సుదీర్ఘమైన టూర్. ఐదు టెస్ట్‌లు ఆడాల్సి ఉంటుంది. టీమ్‌లోకి తీసుకున్న ప్రసిధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, హర్షిత్‌లో భిన్నమైన నైపుణ్యాలు మా పేస్ బౌలింగ్‌ను మరింత బలోపేతం చేస్తాయి’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
10 రోజుల శిక్షణ సరిపోతుంది...
ఆస్ట్రేలియా వాతావరణ పరిస్థితులకు అలవాటు పడటం చాలా కీలకమని కోచ్ చెప్పాడు. ‘చాలాసార్లు ఆసీస్‌లో ఆడిన అనుభవం ఉన్న ప్లేయర్లు జట్టులో ఉన్నారు. వారి అనుభవం యువ ఆటగాళ్లకు కూడా ఉపయోగపడుతుంది. రాబోయే పది రోజులు చాలా కీలకం కానున్నాయి. సరైన ట్రెయినింగ్‌తో అంతా సర్దుకుంటుందని భావిస్తున్నాం. ఈ నెల 22న ఉదయం ఓ ఫైర్‌తో తొలి బాల్‌ను వేసేందుకు మేం కచ్చితంగా సిద్ధంగా ఉండాలి’ అని గంభీర్ పేర్కొన్నాడు.
మా గురించి పాంటింగ్‌కు ఎందుకు?
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్, జట్టులో ప్లేస్‌పై ఇటీవల ఆందోళన వ్యక్తం చేసిన మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌పై గంభీర్ మండిపడ్డాడు. పాంటింగ్ ఆసీస్ జట్టు గురించి పట్టించుకుంటే బాగుంటుందన్నాడు. ‘టీమిండియాతో పాంటింగ్‌కు ఏంటి సంబంధం. ఆసీస్ క్రికెట్ గురించి అతను ఆందోళన చెందాలి. రోహిత్, కోహ్లీ ఫామ్ గురించి నాకైతే ఎలాంటి ఆందోళనలు లేవు. ఈ ఇద్దరు చాలా నైపుణ్యం ఉన్న స్టార్ ప్లేయర్లు. ఇండియన్ క్రికెట్ కోసం చాలా చేశారు. భవిష్యత్‌లోనూ దాన్ని కొనసాగిస్తారు. జట్టు కోసం ఇంకా ఎక్కువ సాధించాలని కోరుకుంటున్నారు’ అని గౌతీ పేర్కొన్నాడు.
న్యూజిలాండ్‌తో సిరీస్ ఓటమి తర్వాత టీమిండియాలో బాగా ఆడాలనే కసి పెరిగిందన్నాడు. బోర్డర్–గావస్కర్ కోసం ఆసీస్ ఓ రకమైన పిచ్‌లను తయారు చేస్తుందని అనుకోవడం లేదన్నాడు. వాళ్లు ఎలాంటి పిచ్‌లు ఇచ్చినా ఆడటానికి తాము సిద్ధంగా ఉన్నామన్నాడు. అత్యుత్తమ క్రికెట్ ఆడితే ఏ వికెట్‌పైనైనా, ఎవరినైనా ఓడించగలమని అని గౌతీ స్పష్టం చేశాడు.