దుబాయ్: తొలి టెస్టులో అద్భుత బౌలింగ్‌తో ఆస్ట్రేలియా నడ్డి విరిచి టీమిండియాను గెలిపించిన పేస్ లీడర్ జస్‌ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్టు బౌలర్లలో మళ్లీ నంబర్ వన్ ర్యాంక్ అందుకున్నాడు. పెర్త్‌లో సెంచరీతో మెరిసిన యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ నంబర్ 2 ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. బుధవారం విడుదలైన తాజా ర్యాంకింగ్స్‌లో బౌలర్ల విభాగంలో బుమ్రా రెండు స్థానాలు మెరుగై టాప్ ప్లేస్ సొంతం చేసుకున్నాడు. పెర్త్ టెస్టులో మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ చేసిన బుమ్రా రెండు ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. దాంతో ఇండియా 295 రన్స్ తేడాతో ఆసీస్‌ను చిత్తుగా ఓడించి బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో శుభారంభం చేసింది.
బుమ్రా తన కెరీర్ బెస్ట్ 883 ర్యాంకింగ్ పాయింట్లతో సౌతాఫ్రికా స్టార్ కగిసో రబాడ (872), ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్‌వుడ్ (860)ని వెనక్కునెట్టి నంబర్ వన్‌గా నిలిచాడు. మహ్మద్ సిరాజ్ మూడు స్థానాలు మెరుగై 25వ ర్యాంక్‌కు చేరాడు. మరోవైపు తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 161 రన్స్‌తో అదరగొట్టిన యశస్వి జైస్వాల్ కెరీర్ బెస్ట్ 825 రేటింగ్ పాయింట్లతో 4 నుంచి రెండో స్థానానికి దూసుకొచ్చాడు. జోస్ బట్లర్ 903 పాయింట్లతో టాప్ ప్లేస్ నిలబెట్టుకున్నాడు. టెస్టుల్లో తన 30వ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ ఏకంగా తొమ్మిది స్థానాలు మెరుగై 13వ ప్లేస్‌కు చేరుకోగా.. రిషబ్ పంత్ ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. టెస్టు ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా, అశ్విన్ టాప్–2లో నిలిచారు.