రాజ్యసభలో నోట్ల కలకలం.. అసలైనవో.. నకిలీవో..? నిగ్గు తేలుస్తామన్న ధన్ ఖడ్

రాజ్యసభలో నోట్ల కలకలం.. అసలైనవో.. నకిలీవో..? నిగ్గు తేలుస్తామన్న ధన్ ఖడ్

న్యూఢిల్లీ: రాజ్యసభలో నోట్ల కట్టల కలకలం రేగింది. కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ సీటు వద్ద రూ.500 నోట్ల బండిల్ దొరికింది. ఇదికాస్తా వివాదానికి దారితీసింది. అధికార, ప్రతిపక్షాల మధ్య సభలో మాటల యుద్ధం జరిగింది. ఈ ఇష్యూపై చైర్మన్ విచారణకు ఆదేశించగా, విచారణ పూర్తికాకముందే సభ్యుడి పేరు ఎలా చెబుతారని ప్రతిపక్షం ప్రశ్నించింది. ఇదే ఇష్యూపై శుక్రవారం మొత్తం రాజ్యసభలో గందరగోళం నెలకొంది. దీనిపై కాంగ్రెస్ వివరణ ఇవ్వాల్సిందేనని బీజేపీ పట్టుబట్టింది. దీంతో సభ చివరకు సోమవారానికి వాయిదా పడింది. 

అసలేం జరిగింది..? 

రాజ్యసభ శుక్రవారం ప్రారంభమైన తర్వాత చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ మాట్లాడారు. సభలో రూ.500 నోట్ల బండిల్ దొరికిందని ప్రకటించారు. అందులో దాదాపు 100 నోట్లు ఉంటాయని చెప్పారు. ‘‘గురువారం సభ వాయిదా పడిన తర్వాత సెక్యూరిటీ సిబ్బంది సాధారణ తనిఖీలు చేపట్టారు. అప్పుడు 222వ సీటు వద్ద రూ.500 నోట్లు దొరికాయి. ఆ సీటు తెలంగాణ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీది. 

ఆ నోట్లు తమవేనని ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదు. ఈ విషయాన్ని సభ దృష్టికి తీసుకురావడం నా బాధ్యత. అవి అసలైనవో? నకిలీవో? స్పష్టత లేదు. రూల్స్ ప్రకారం.. దీనిపై విచారణకు ఆదేశించాను” అని తెలిపారు. భద్రత సవాళ్ల నేపథ్యంలో రాజ్యసభలో ఎప్పటికప్పుడు సాధారణ తనిఖీలు చేపడుతున్నామని, ఈ విషయంలో తాను చాలా జాగ్రత్తగా ఉంటానని చెప్పారు.

సభలో దుమారం.. 

రాజ్యసభలో చైర్మన్ చేసిన ప్రకటన వివాదానికి దారితీసింది. విచారణ పూర్తికాకముందే సభ్యుడి పేరు చెప్పడంపై రాజ్యసభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేశారు. చైర్మన్ అలా ప్రకటించడం కరెక్టు కాదని ఆయన అన్నారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ.. ‘‘సభ్యుడి పేరు చెబితే తప్పేంటి? నోట్ల కట్టలు ఎక్కడ దొరికాయో? ఆ సీటు ఎవరిదో చైర్మన్ ప్రకటించారు. 

అందులో తప్పేముంది?” అని ప్రశ్నించారు. రాజ్యసభాపక్ష నేత, కేంద్రమంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ.. ‘‘ఇది సీరియస్ ఇష్యూ. సభ గౌరవంపై జరిగిన దాడి. ఈ విషయంలో అధికార, ప్రతిపక్ష బెంచీలు అని విభజించి చూడొద్దు” అని అన్నారు. కొన్ని విషయాలను కవర్ చేసుకోవడానికి కాంగ్రెస్ తొందరపడుతున్నదని విమర్శించారు. ఈ క్రమంలో ఖర్గే స్పందిస్తూ.. తాము కవర్ చేసుకోవడానికి ప్రయత్నించడం లేదని, అలా చేసేది బీజేపీనే అని కౌంటర్ ఇచ్చారు.

ఒక్కటే నోటు తీసుకెళ్లాను: ఎంపీ సింఘ్వీ

రాజ్యసభలోకి తాను వెళ్లిన టైమ్ లో తన దగ్గర రూ.500 నోటు ఒక్కటే ఉన్నదని కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ తెలిపారు. గురువారం సభలో తాను కేవలం 3 నిమిషాలు మాత్రమే ఉన్నానని చెప్పారు. ‘‘నేను గురువారం మధ్యాహ్నం 12:57 గంటలకు రాజ్యసభ లోపలికి వెళ్లాను. ఆ తర్వాత ఒంటిగంటకు సభ వాయిదా పడింది. దీంతో క్యాంటీన్ కు వెళ్లాను. అక్కడ మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఉన్నాను. అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయాను” అని వివరించారు.