హైదరాబాద్ సిటీ, వెలుగు: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి, సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీ తేజ్ ను నిర్మాత బన్నీ వాసు ఆదివారం పరామర్శించారు. శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉండటంతో బన్నీ వాసు సంతోషం వ్యక్తం చేశారు.
శ్రీ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులను గుర్తించడం లేదని, పలకరిస్తే ప్రతి స్పందించడం లేదని కిమ్స్ డాక్టర్లు ఇప్పటికే ప్రకటించారు. ఘటన జరిగి దాదాపు రెండు నెలలు కావొస్తున్నా... శ్రీతేజ్పూర్తిగా కోలుకోలేదు. దీంతో మెరుగైన వైద్యం అందించడానికి బాలుడిని విదేశాలకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఇదే విషయమై తన సన్నిహితులతో బన్నీవాసు చర్చించినట్టు సమాచారం. ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సిఉంది. సంధ్య థియేటర్ ఘటనలో శ్రీతేజ్తల్లి రేవతి మరణించిన సంగతి తెలిసిందే.