TRS హామీలపై అడుగుతారనే BRS గా మార్చారు: బూర నర్సయ్య గౌడ్

కరీంనగర్: బీసీలు ఆర్థికంగా ఎదిగితే తన మాట వినరని సీఎం కేసీఆర్  అనుకుంటున్నారని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ వ్యాఖ్యానించారు. నిధులు ఇవ్వకపోయినా బీసీలు ఓటు వేస్తారనే ధీమాలో కేసీఆర్ ఉన్నారని..బీసీల సంక్షేమం కోసం రాష్ట్ర బడ్జెట్లో కేసీఆర్ కేటాయించింది కేవలం రూ.239 కోట్లేనని గుర్తు చేశారు. ఇటువంటి దురుద్దేశంతో ఉన్న కేసీఆర్ కు బీసీలు ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. కరీంనగర్ లో ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం వెళ్తే పాత హామీలపై ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతోనే.. తన పార్టీ పేరును బీఆర్ఎస్ గా కేసీఆర్ మార్చుకున్నారని తెలిపారు. ఒకవేళ ప్రజలు గత హామీల గురించి అడిగితే.. రద్దయిపోయిన టీఆర్ఎస్ పార్టీనే ఆ హామీలు అడగాలని, తమను అడగొద్దని కేసీఆర్ చెబుతారని పేర్కొన్నారు.

కోటి ఓట్లు... 90 సీట్లు.. అనే  నినాదంతో పార్టీ శ్రేణులు ముందుకు పోవాలన్నారు. ‘‘ అందరి తెలంగాణ.. అభివృద్ధి తెలంగాణ.. ఆత్మ గౌరవ తెలంగాణ కోసం మేం ఆనాడు తెలంగాణ ఉద్యమం చేశాం.కానీ ఇప్పుడు కేసీఆర్ సర్కారు బీసీలను విస్మరిస్తుంటే బాధేస్తోంది. కుల వృత్తులంటే కేసీఆర్ కు ఎందుకంత వివక్ష... రాష్ట్రంలో కుల వృత్తులపై ఆధారపడి 6 లక్షల కుటుంబాలు నడుస్తున్నాయి.. వారిని ఆదుకునే కార్పొరేషన్ పెట్టాలనే సోయి కూడా కేసీఆర్ కు లేదు’’ అని బూర నర్సయ్య గౌడ్ చెప్పారు. రాష్ట్ర ప్రజలను అడుక్కునే స్థితిలో ఉంచాలనే దుర్భుద్ధితో కేసీఆర్ ఉన్నారని కామెంట్ చేశారు. మోడీ వ్యాక్సిన్ తోనే దేశానికి బీఆర్ఎస్ పీడ విరగడ అవుతుందన్నారు.