న్యూఢిల్లీ: ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. కొత్తగా నిర్మిస్తున్న నాలుగంతస్తుల భవనం సోమవారం రాత్రి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మృతుల్లో ఇద్దరు బాలికలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి 12 మందిని రక్షించారు. శిథిలాల కింద నుంచి ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు.
రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని, శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకొని ఉండొచ్చని తెలిపారు. ‘రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఫైర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే స్పాట్‌కు చేరుకున్నారు. భవనం లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేయడానికి పలు బృందాలను ఏర్పాటు చేశాం’ అని పోలీసులు పేర్కొన్నారు.