పదేండ్లలో రూ.20 వేల కోట్ల భారం

పదేండ్లలో రూ.20 వేల కోట్ల భారం
  • బీఆర్ఎస్ హయాంలో ప్రజలపై కరెంట్ చార్జీల మోత 
  • అసలు చార్జీలు పెంచనేలేదన్న కేటీఆర్ 
  • డిస్కం లెక్కలతో బయటపడ్డ వాస్తవాలు 
  • 2015-16లో 5%, 2016-17లో 8%, 2022-23లో 16% చార్జీల వడ్డింపు 
  • 2020 నుంచి ఫిక్స్​డ్ చార్జీలతో మరింత వాత

హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో ఇరవై నాలుగు గంటలూ ఉచిత విద్యుత్ ఇచ్చినా.. ఎన్నడూ కరెంట్ చార్జీలు పెంచలేదంటూ సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల చెప్పిన మాటలు పచ్చి అబద్ధాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులే చెప్తున్నారు. ఈ నెల 25న సిరిసిల్లలో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘కాళేశ్వరం వంటి అతిపెద్ద ప్రాజెక్టు కట్టినా, మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేసినా.. ప్రజలపై, రైతులపై ఎలాంటి భారం మోపలేదు.

 ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చార్జీలు పెంచితే ఊకోం” అని అన్నారు. అయితే, కేటీఆర్ మాటల్లో ఏమాత్రం నిజం లేదని డిస్కంల లెక్కలు చూస్తే తెలిసిపోతుందని అధికారులు అంటున్నారు. ఇందుకు సంబంధించిన గణాంకాలను వారు బయటపెట్టారు. వాస్తవానికి గడిచిన పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం పలుమార్లు విద్యుత్​చార్జీలు పెంచడంతో ప్రతి ఇంటి కరెంట్​బిల్లు దాదాపు రెట్టింపయ్యింది.

 అప్పటి సర్కారు ప్రజలపై 2015--–16లో 5 శాతం, 2016--–17లో 8 శాతం, 2022--–23లో 16 శాతం మేరకు కరెంట్ చార్జీల భారం మోపింది. 2020 నుంచి ఫిక్స్​డ్ చార్జీలతో మరింత మోత మోగించిందని డిస్కంల లెక్కలను బట్టి తేలిపోయింది. 

చార్జీల పెంపుతోనే రూ. 20 వేల కోట్లు 

బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2015‌‌‌‌‌‌‌‌–2016లో డొమెస్టిక్, నాన్ డొమెస్టిక్ కేటగిరీల నుంచి విద్యుత్​చార్జీల రూపంలో రాష్ట్రంలోని డిస్కంలు (ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్) రూ.18,845 కోట్లు వసూలు చేశాయి. ఆ పార్టీ అధికారం కోల్పోయిన ఏడాది 20‌‌‌‌23–24లో  విద్యుత్​చార్జీల ద్వారా డిస్కంలకు వచ్చిన రాబడి రూ. 43,439 కోట్లు. 

అంటే పదేండ్లలో డిస్కంలు వసూలు చేసిన విద్యుత్​చార్జీలు రూ. 24,594 కోట్ల మేరకు పెరిగాయి.  ఇందులో పెరిగిన కనెక్షన్లు.. పెరిగిన విద్యుత్ వినియోగం పక్కన పెట్టినా సుమారు రూ.20 వేల కోట్ల భారం చార్జీల పెంపు ఫలితమేనని లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. 

2014 =2024 మధ్య చార్జీల పెంపు ఇలా.. 

బీఆర్ఎస్​హయాంలో 2015–16లో విద్యుత్​చార్జీలను 5% పెంచారు. 2016–17లో 8% చార్జీలను వడ్డించారు. 2022–23లో గంపగుత్తగా ఒకేసారి 16% చార్జీలు పెంచి.. వినియోగదారులపై ఏకంగా రూ. 6 వేల కోట్లకుపైగా భారం మోపారు. 2020కి ముందు ఫిక్స్ డ్​చార్జీల ప్రస్తావన లేదు. కానీ అప్పటి ప్రభుత్వం గృహ వినియోగదారుల నుంచి ఫిక్స్ డ్​చార్జీల వసూలు మొదలుపెట్టింది. 

తర్వాత అయిదేండ్లు చార్జీలు పెంచలేదని  చెప్పుకుంటూ వచ్చినా చాటుమాటుగా చార్జీలు వడ్డించడం ద్వారా ప్రజలపై భారం పెరుగుతూ వచ్చింది. పేదలను, మధ్య తరగతి ప్రజలను ఏ ఒక్క వర్గాన్ని కూడా వదిలి పెట్టకుండా గత ప్రభుత్వం ఒక్కో యూనిట్ పై 50 పైసల నుంచి రూపాయి చొప్పున వడ్డించింది. వీటితో పాటు ఫిక్స్ డ్​ కస్టమర్ చార్జీలను కూడా పెంచింది. అప్పుడు అన్ని చోట్లా వినియోగదారుల నుంచి ఆందోళనలు వ్యక్తమైనా బీఆర్ఎస్ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. 

వేల కోట్ల అప్పుల్లోకి డిస్కంలు

గత ప్రభుత్వం విద్యుత్ సంస్థల లాభనష్టాలను వెల్లడించకుండా అడ్డుకుంది. ఫలితంగా తెలంగాణ డిస్కంలు వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయాయి. ఏడాదికోసారి డిస్కంలు ఈఆర్సీకి సమర్పించాల్సిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్)లను కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదు.

 దీంతో 2014–15, 2019–20, 2020–21, 2021–22 సంవత్సరాల్లో డిస్కంలు ఈ నివేదికలను దాఖలు చేయలేదని విద్యుత్​రంగ నిపుణులు తేల్చి చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఎలాంటి కరెంట్​చార్జీలను పెంచకపోగా.. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు వాడే సుమారు 50 లక్షల కుటుం బాలకుఉచిత విద్యుత్​ అందిస్తోందని స్పష్టం చేస్తున్నారు.