రైతులపై టార్పాలిన్ల భారం..! రోజురోజుకు పెరుగుతున్న కిరాయిలు

  • ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యమే కారణం
  • కొనుగోలు కేంద్రాల్లో రైతులు వెయిటింగ్
  • ఒక్కో సెంటర్​కు 50 టార్పాలిన్లే పంపిన ఆఫీసర్లు
  • అకాల వర్షాలతో అన్నదాతల్లో టెన్షన్

కల్లూరు మండలంలో ఐకేపీ ఆధ్వర్యంలో బత్తులపల్లి, లక్ష్మీపురం, కొర్లగూడెం, పుల్లయ్యబంజరులో కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేశారు. మార్కెటింగ్ శాఖ ఆఫీసర్లు ఒక్కో సెంటర్ కు 50చొప్పున టార్పాలిన్లు ఇచ్చారు. వందల మంది రైతులు ధాన్యం తీసుకురాగా, ముందుగా వచ్చినవారికి మాత్రమే టార్పాలిన్లు అందించారు. ఇవి సరిపోక రైతులు ప్రైవేట్ టార్పాలిన్లను కిరాయికి తెచ్చి ధాన్యాన్ని తడవకుండా కాపాడుకుంటున్నారు. పుల్లయ్య బంజరు సెంటర్​లో రైతు బొడ్డు రామస్వామి100 బస్తాల ధాన్యాన్ని తెచ్చాడు. నాలుగు రోజులు గడుస్తున్నా కాంటాలు కాక, వర్షం పడుతుండడం, అక్కడ టార్పాలిన్లు లేక రూ.2 వేలు వెచ్చించి కొత్త టార్పాలిన్ కొన్నాడు.

ఖమ్మం, వెలుగు: ప్రస్తుత యాసంగి సీజన్ లో రైతులను వరుణుడు వెంటాడుతున్నాడు. రెండుసార్లు వడగండ్ల వానతో ఇబ్బందులు పడ్డ అన్నదాతలకు కొనుగోలు సెంటర్లతోనూ తిప్పలు తప్పడం లేదు. వర్షం ఎప్పుడు పడుతుందో తెలియక పంటను కాపాడుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం ఐకేపీ, ఏఎంసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కొనుగోలు కేంద్రాలకు టార్పాలిన్లు అందిస్తోంది. కానీ అవి సరిపోకపోవడంతో ఆరబెట్టిన ధాన్యాన్ని తడవకుండా ఉండేందుకు ప్రైవేట్ టార్పాలిన్లపై ఆధారపడుతున్నారు. పీఏసీఎస్ ల ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్రాలకు నిర్వాహకులే టార్పాలిన్లను తెచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఇచ్చే టార్పాలిన్లు సెంటర్ కు50 చొప్పున మాత్రమే పంపించారు. రైతులు ఎక్కువ సంఖ్యలో ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావడంతో అవి ఏమాత్రం సరిపోవడం లేదు. వందల మంది వేల బస్తాల ధాన్యం తెస్తే 50 టార్పాలిన్లు ఎవరికి సరిపోతాయని రైతులు ప్రశ్నిస్తున్నారు.

అర్ధరాత్రి వర్షం కురువడంతో...

జిల్లా మొత్తం గత 24 గంటల్లో 8.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అర్ధరాత్రి వేళ వర్షం కురువడంతో కొనుగోలు కేంద్రాలతోపాటు రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం, మక్కలను కాపాడుకునేందుకు రైతులు ఉరుకులు పరుగులు తీశారు. కల్లూరు మండలం పుల్లయ్యబంజరు శివారులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో పలువురు రైతులకు చెందిన ధాన్యం తడిసి ముద్దయింది. కుప్పాల బాబుకు చెందిన సుమారు100 బస్తాలు, పోకాల ప్రభాకర్ రావుకు చెందిన 250 బస్తాలు, సంగెపు వీరస్వామి కి చెందిన సుమారు 300 బస్తాల ధాన్యం వర్షం దాటికి తడిసి ముద్దయ్యాయి. పలువురు రైతులకు చెందిన కాంటావేసిన ధాన్యం కూడా అకాల వర్షానికి తడిసింది. ఒకపక్క ప్రైవేట్ వ్యాపారులు ధర తగ్గించి ధాన్యం కొనుగోలు చేస్తుంటే, మరోవైపు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న ఐకేపీ నిర్వాహకులు కింటాలుకు 4 నుంచి 6 కేజీల వరకు తరుగు తీస్తున్నారు అంటూ రైతులు వాపోతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు1100 మంది రైతుల నుంచి దాదాపు15వేల మెట్రిక్​ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. 

4వేల టార్పాలిన్లు సిద్ధంగా ఉన్నాయి..

జిల్లాలో ఐకేపీ, ఏఎంసీలకు సప్లై చేసేందుకు మొత్తం 4వేల టార్పాలిన్లు సిద్ధంగా ఉన్నాయి. గతంలో ఉన్న పాత వాటికి అదనంగా ఈ సీజన్​లోనే కొత్తగా1500 టార్పాలిన్లు తెప్పించాం. అన్ని సెంటర్లకు ముందుగానే పంపించాం. వాటిని ఉచితంగానే రైతులు వాడుకోవచ్చు.
–  నాగరాజు, మార్కెటింగ్ డీఎం, ఖమ్మం  

కొనుగోలు చేయకనే తడిసింది...

ఎనిమిదెకరాల్లో వేసిన వరిని10 రోజుల కిందనే కోసి ఆరబెట్టిన. 400 బస్తాల ధాన్యాన్ని కేంద్రంలో అమ్మేందుకు ఐదు రోజుల కింద తెచ్చిన. అప్పటి నుంచి అడుగుతున్నా మిల్లర్లు తీసుకుంటలేరని చెప్తున్నరు. వడ్లు ఉంచేందుకు జాగ లేక పొలంలోనే ఆరబెట్టినం. వడ్లు కొనాలని ఊరి రైతులందరం ఐకేపోళ్లను అడిగినా ఏం చెప్తలేరు. వర్షానికి పరదాలు అద్దెకు తెచ్చి కప్పినం. కింద ఉన్న వడ్లు తడిసినయి. ఎలా అమ్ముకోవాలో అర్థం అయితలేదు. 
   ‌‌ ‌‌ ‌‌  ‌‌ ‌‌  ‌‌ ‌‌  ‌‌ ‌‌–  నీలపాల నరసింహారావు, రైతు, కల్లూరుగూడెం.