నాణ్యమైన వస్తువులే వాడాలి .. వాటిపై ఐఎస్ఐ మార్కు చూడాలి : సరోజా వివేక్

నాణ్యమైన వస్తువులే వాడాలి .. వాటిపై ఐఎస్ఐ మార్కు చూడాలి :  సరోజా వివేక్

ముషీరాబాద్,వెలుగు : నాణ్యతా ప్రమాణాలున్న వస్తువులనే వాడాలని కాకా బీఆర్ అంబేద్కర్  విద్యాసంస్థల కరస్పాండెంట్ డా. సరోజా వివేక్ స్టూడెంట్లకు సూచించారు. మంగళవారం బాగ్​లింగంపల్లిలోని అంబేద్కర్ కాలేజీలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ 77వ ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. చీఫ్​గెస్టుగా  సరోజా వివేక్ పాల్గొని మాట్లాడారు. వివిధ రకాల వస్తువులు, నిత్యావసరాలు సరైన నాణ్యత లేకపోవడంతో కొనుగోలుదారులు మోసపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ప్రతి ఒక్కరికి నాణ్యమైన వస్తు సేవలందించాలనే ఉద్దేశంతో ఐఎస్ఐ సంస్థను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. 

ఉత్పత్తుల నాణ్యత పరిశీలనలో ఐఎస్ఐ కీలకంగా పని చేస్తుందని తెలిపారు. బీఐఎస్  ఫౌండేషన్ డేను కాలేజీలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. బీఐఎస్ రీసెర్చ్ పర్సన్ జి. ప్రభాకర్ మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే పిల్లలకు నాణ్యమైన వస్తు సేవల ఉత్పత్తి లాభాలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. బంగారు నగలపై హాల్ మార్క్, వ్యవసాయ ఉత్పత్తులకు అగ్రి మార్క్, వస్తువులకు వాటి నాణ్యత ప్రమాణాలను తనిఖీ చేయడానికి ఐఎస్ఐ మార్క్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం స్టూడెంట్లకు నిర్వహించిన స్టాండర్డ్ రైటింగ్, పోస్టర్ మేకింగ్ కాంపిటీషన్​లో విజేతలకు సరోజా వివేక్  ప్రైజ్​లు,  సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో ఫ్యాకల్టీ, సిబ్బంది,  తదితరులు పాల్గొన్నారు.