ఒడిశా ప్రకృతి ప్రేమికుల్ని, పర్యాటకుల్ని ఆకర్షిస్తుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అక్కడ ప్రకృతితో కలిసిన అందాలు... ఆనందాలు చూస్తే గొప్ప అనుభూతి కలుగుతుంది. ముఖ్యంగా పూరి బీచ్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. మామూలుగా ఇండియాలోని చాలా బీచ్ లు ఎంత ఆహ్లాదంగా అనిపించినా.. చుట్టుపక్కల ఉండే చెత్త, చెదారాం, ప్లాస్టిక్ బాటిల్స్ ను చూసినప్పుడు మాత్రం పర్యాటకులు కాస్త అసౌకర్యంగానే ఫీలవుతారు. కానీ ఒడిశాలోని పూరీ బీచ్ మాత్రం దీనికి పూర్తిగా భిన్నం. ఇది దేశంలోనే క్లీన్ బీచ్ గా ప్రసిద్ధి గాంచింది. బంగాళాఖాతం తీరంలో పూరీ రైల్వే స్టేషన్ నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బీచ్ ను ముఖ్యంగా హిందువులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ బీచ్ కి సంబంధించిన ఫొటోలను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (ఐఎఫ్ఎస్) అధికారి సుశాంత నందా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోల్లో బీచ్ ను క్లీన్ చేస్తున్న దృశ్యాలు ప్రశాంతమైన, నిర్మలమైన వాతావరణానికి నిలువుటద్దంగా నిలుస్తోంది. ప్రకృతి రమణీయతను చాటి చెప్పే ఈ సుందర ప్రాంతాన్ని ఒడిశాలోని గోల్డెన్ బీచ్ గా సుశాంత నందా అభివర్ణించారు.