నిజామాబాద్, వెలుగు: తాళం వేసిన ఇండ్లలో దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లొచ్చిన కుటుంబ ముఠాయే ఏటీఎంల్లో నగదు దోపిడీకి యత్నించిందని ఇన్చార్జి పోలీస్ కమిషనర్ జయరాం తెలిపారు. బడా భీంగల్, అంక్సాపూర్‌లో ఏటీఎంలు వీరే ధ్వంసం చేశారని ఆయన తెలిపారు. నలుగురు నిందితులను గురువారం మీడియా ఎదుట ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. జక్రాన్‌పల్లికి చెందిన అల్లెపు స్వామి అతడి తమ్ముడు అల్లెపు దేవేందర్, బామ్మర్ది నవీన్నిజామాబాద్, నిర్మల్జిల్లాల్లో 19 దొంగతనాలు చేసి జైలు వెళ్లొచ్చారు.
దొంగతనం చేసిన బంగారాన్ని దేవేందర్ తన భార్య శైలజ ద్వారా విక్రయించేవాడు. సులువుగా డబ్బు సంపాదించడానికి ఈ నలుగురు ఏటీఎం చోరీలను ఎంచుకున్నారు. ఈ నెల 9న అర్ధరాత్రి భీంగల్‌లోని బడాభీంగల్కాలనీలో ఏటీఎంను లూటీ చేయడానికి ప్రయత్నించారు. గడ్డపారలతో కొట్టినా మానీ బాక్స్ఓపెన్కాకపోవడంతో వెళ్లిపోయారు.
10వ తేదీ తెల్లవారుజామున వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్‌లోని యూనియన్ బ్యాంక్ ఏటీఎం పగులగొట్టడానికి విఫలయత్నం చేశారు. గంటపాటు ప్రయత్నించినా తెరుచుకోకపోవడంతో గడ్డపారల చప్పుడుకు ప్రజలు వస్తారని భయపడి అప్పటికే తెచ్చిపెట్టిన గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో ఏకంగా ఏటీఎం తరలించడానికి పూనుకున్నారు. ప్రజలు కేకలు వేయడంతో పారిపోయారు. టెక్నికల్ఆధారాలతో నలుగురు నిందితులను గుర్తించి అరెస్టు చేశామన్నారు.
ALSO READ: అర్థరైటిస్ పై అవగాహన కల్పించాలి : శ్రీనివాస్ గౌడ్
పోచంపాడ్ ఏటీఎం దోపిడీలో అరెస్టు
మెండోరా మండలంలో గత నెల 27న జరిగిన ఏటీఎం దోపిడీ కేసును ఛేదించామని ఇన్‌ఛార్జి కమిషనర్ జయరామ్తెలిపారు. హరియాణాకు చెందిన ఆరుగురు ఇందులో భాగస్వామ్యులయ్యారన్నారు. జునైల్అనే నిందితుడిని అరెస్ట్చేశామని, అయిదుగురు పరారీలో ఉన్నారన్నారు. ఈ ఘటనలో రూ.12.46 లక్షల నగదు దొంగలు ఎత్తుకెళ్లారన్నారు.