- జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో ఘటన
- నిందితుడి అరెస్టు..26 తులాల బంగారం స్వాధీనం
మంచిర్యాల, వెలుగు: జల్సాల కోసం సొంత అన్న ఇంటికే కన్నం వేశాడో తమ్ముడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ అఖిల్‌మహాజన్ బుధవారం వివరాలు వెల్లడించారు. మంచిర్యాల ఏసీసీ పరిధిలోని సుభాష్‌నగర్‌కు చెందిన మలిపొర ప్రసన్నాచారి(24) డిప్లొమా చదివి కొంతకాలం మెకానిక్‌గా పనిచేశాడు. ఈ మధ్య ఖాళీగా ఉంటున్నాడు. దీంతో జల్సాల కోసం తన అన్న శ్రీనివాస్ ఇంట్లో చోరీ చేయాలని ప్లాన్ వేశాడు. శ్రీనివాస్ ఉపాధి కోసం దుబాయ్‌కి వెళ్లగా వదిన దివ్య ఈ నెల 17న ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లింది. దీంతో తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న 26 తులాల బంగారం, వెండి ఆభరణాలు దొంగిలించాడు. ఆ సొత్తును కవర్లో పెట్టుకొని అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా బుధవారం స్థానిక ముఖరం చౌరస్తాలో పోలీసులు పట్టుకున్నారు. రూ.10.40 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకున్న టౌన్ సీఐ నారాయణ నాయక్, ఎస్సైలు ఎండీ.తహసీనొద్దీన్, బి.అంజయ్య, సీసీఎస్ ఎస్సై ఎ.కొమురయ్య, హెడ్ కానిస్టేబుళ్లు బి.దివాకర్, సత్తయ్య, సతీశ్, కె.శ్రీనివాస్‌లను అభినందించి రివార్డు అందజేశారు.
రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే
రామకృష్ణాపూర్,వెలుగు: రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. బుధవారం రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఏడో వార్డులో నిర్వహించిన శక్తి కేంద్రం సమావేశానికి ఆయన చీఫ్‌గెస్ట్‌గా హాజరయ్యారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలన్నారు. దేశంలో 60 ఏళ్లలో జరగని అభివృద్ధి ఎనిమిదేళ్లలో బీజేపీ చేసి చూపించిందన్నారు. ఈ సందర్భంగా ఏడో వార్డుకు చెందిన పలువురు వ్యాపారులు, యువకులు బీజేపీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. రామకృష్ణాపూర్ టౌన్ బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడిని సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి అందుగుల శ్రీనివాస్, రామకృష్ణాపూర్ టౌన్ ప్రెసిడెంట్మహంకాళి శ్రీనివాస్, అసెంబ్లీ కన్వీనర్ అక్కల రమేశ్, టౌన్ జనరల్ సెక్రటరీ వెల్పుల సత్యనారాయణ, నియోకవర్గ కన్వీనర్ అందుగుల రవీందర్ పాల్గొన్నారు.
లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాల్సిందే
ఆసిఫాబాద్,వెలుగు: లంబడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకూ పోరాటం చేస్తామని తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు బుర్స పోచయ్య స్పష్టం చేశారు. లంబడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ తో ఈనెల 15న ప్రారంభించిన పాదయాత్ర బుధవారం కెరమెరి మండలం జోడేఘాట్ లో ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదివాసీ, బంజరాభవన్ పేరిట అడవి బిడ్డలను మభ్యపెడుతున్నారని ఫైర్అయ్యారు. ఆదివాసీలకు ఆరు శాతం రిజర్వేషన్లు ఉన్నా.. 10 శాతం ఉన్నా... అన్ని లంబాడాలకే చెందుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ఆదివాసీలను విచ్ఛినం చేసే కుట్ర జరుగుతోందన్నారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైప తరుణ్ కుమార్ మాట్లాడుతూ 10 శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదిస్తే లంబాడాలే ఎస్టీలయ్యే ప్రమాదం ఉందన్నారు. టీఆర్ఎస్ సర్కార్వలస వచ్చిన లంబడాల ఓట్లపైనే దృష్టి పెడుతోందని, ఇక్కడే పుట్టి పెరిగిన ఆదివాసీల గురించి ఆలోచించడం లేదన్నారు. జిల్లా అధ్యక్షుడు కొట్నాక్విజయ్ కుమార్ మాట్లాడుతూ ఆదివాసీల పథకాలతో లంబాడాలు లబ్ధిపొందుతున్నారన్నారు. పదిశాతం రిజర్వేషన్లు, పోడు భూములకు పట్టాలంటూ కేసీఆర్మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని, భూపాలపల్లి జిల్లాలో ఆదివాసీ మహిళలను చెట్లకు కట్టేసి చిత్రహింసలకు గురిచేసిన ఘటన మరిచిపోరన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెస్రం మోతీరాం, రాష్ట్ర కార్యదర్శి కొడప నగేశ్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల అధ్యక్షులు కొట్నాక విజయ్, గోడం గణేశ్, మడావి వెంకటేశ్, లీడర్లు కోవ విజయ్, పుర్క బాపురావు, వెట్టి మనోజ్, పెందోర్ పుష్పారాణి, కోవ ఇందిర తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ పార్లమెంట్ కోకన్వీనర్ కు సన్మానం
ఆసిఫాబాద్, వెలుగు: బీజేపీ ఆదిలాబాద్ పార్లమెంట్ కో కన్వీనర్ గా నియమితులైన కొలిపాక కిరణ్ కుమార్ ను బుధవారం రెబ్బెనలో బీజేపీ లీడర్లు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ సొల్లు లక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షుడు గుల్బం చక్రపాణి, జిల్లా కార్యదర్శి కుందారపు బాలకృష్ణ, మండల ప్రధాన కార్యదర్శులు జగన్నాథ ఓదెలు, చేపూరి నవీన్ గౌడ్, ఆదివాసీ బిరుదు గొండు తోటి సేవా సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కుడిమేత హనుమంతరావు, రెబ్బెన టౌన్ అధ్యక్షుడు పసులేటి మల్లేశం, గోలేటి ప్రధాన కార్యదర్శి ఎర్ర రాజేశ్తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు నెరవేర్చుదాం
నిర్మల్,వెలుగు: కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాల నెరవేర్చాడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ చెప్పారు. బుధవారం నిర్మల్‌లో లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి మున్సిపల్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, ఎఫ్ఏసీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, పద్మశాలి సంఘ బాధ్యులు నివాళి అర్పించారు.
తక్కువగా బరువు ఉన్న పిల్లలపై దృష్టి పెట్టండి
భైంసా,వెలుగు: బరువు తక్కువగా ఉన్న మూడేళ్లలోపు పిల్లలపై ఐసీడీఎస్ ఆఫీసర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని డీఆర్డీవో, ఇన్చార్జి డీడబ్ల్యూవో విజయలక్ష్మి చెప్పారు. బుధవారం భైంసాలోని నర్సింహ కల్యాణ మండపంలో పోషణ్అభియాన్ప్రోగ్రాం నిర్వహించారు. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు గుర్తించి వైద్య సిబ్బందిని సంప్రదించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. అనంతరం గర్భిణులకు సామూహిక సీమంతం కార్యక్రమం నిర్వహించి పోషకాహారంపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ విజయ్, సీడీపీవో నాగలక్ష్మి, సూపర్వైజర్ రాజశ్రీ, అంగన్వాడీ టీచర్లు జయశ్రీ, మాధురి తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ పెన్షన్లు
నర్సాపూర్ (జి), వెలుగు: అర్హులందరికీ ప్రభుత్వం ఆసరా పెన్షన్లు ఇస్తోందని ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి చెప్పారు. బుధవారం మండలంలోని గొల్లమడ గ్రామ రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో నలుగురికి షాదీ ముబారక్, 12 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. 320 మందికి ఆసరా పింఛన్‌కార్డులు అందజేశారు. తెలంగాణను సీఎం కేసీఆర్అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నారన్నారు. పెన్షన్లు రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అప్లై చేసుకుంటే విచారణ అనంతరం మంజూరు చేస్తారని తెలిపారు. గ్రామంలో లక్ష్మీనర్సిహ స్వామి ఆలయంలో రూ. 40 లక్షలతో కల్యాణ మండపం, రేణుక ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్మండల కన్వీనర్ పాపెన రాజేశ్వర్, ఎంపీపీ రేఖ రమేశ్, జడ్పీటీసీ రామయ్య, డీసీసీబీ డైరెక్టర్ తూర్పాటి వెంకటేశ్, సర్పంచులు చెన్న మహేశ్, గోవింద్ రెడ్డి, పోశెట్టి, సుధాకర్, ఎంపీటీసీ రాజవ్వ, ఎంపీడీవో ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.
సర్టిఫికెట్ల కోసం పడిగాపులు!
పట్టించుకోని మండల రెవెన్యూ ఆఫీసర్లు
కుభీరు,వెలుగు: క్యాస్ట్, ఇన్ కమ్, డెత్ సర్టిఫికెట్ ఇలా ఏది కావాలన్నా... పడిగాపులు కాయాల్సిందే. కుభీరు తహసీల్దార్ ఆఫీస్‌లో ఏ పనీ టైంకు కావడంలేదు. ఆఫీసర్ల తీరుతో సర్టిఫికెట్లు సకాలంలో అందడంలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్టిఫికెట్ల కోసం ఆన్లైన్లో అప్లైచేసి చేసి నెలల తరబడి మీసేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. ఇలాంటి సమస్యపైనే గతంలో పార్డి (బి) గ్రామానికి చెందిన శంకర్ అర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన వ్యక్తం చేసినా.. ఆఫీసర్ల తీరు మారకపోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
కుభీరు మండలం పరిధిలో మూడు నెలల వ్యవధిలో కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కోసం 124 మంది అప్లై చేసుకున్నారు. అయితే 56 మందికే సర్టిఫికెట్లు వచ్చాయి. మిగతా 68 మంది రిక్వెస్ట్ లు పెండింగ్‌లో ఉన్నాయి. నివాసం సర్టిఫికెట్‌కోసం 129 మంది అప్లై చేసుకుంటే 86 మందికే సర్టిఫికెట్లు ఇచ్చారు. మిగతా 43 మంది రిక్వెస్ట్ లను పెండింగ్‌లో ఉన్నాయి. క్యాస్ట్ ఇన్కమ్ కోసం 681 మంది అప్లై చేసుకోగా 422 మంది అప్రూవల్ అయ్యాయి. ఇంకా 258 మంది రిక్వెస్ట్ లు పెండింగ్‌లో ఉన్నాయి. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం 25 మంది అప్లై చేసుకోగా అందులో 19 మందివి పెండింగ్‌లో ఉన్నాయి. సర్టిఫికెట్లే కాదు... వివిధ ధృవీకరణ పత్రాల కోసం రైతులు తదితరాల పనులు పెండింగ్‌లో పడుతున్నాయి. భూమి మిస్సయినట్లు ఆప్షన్ వచ్చినప్పటి నుంచి చాలా మంది తమ భూముల వివరాలు రికార్డు చేయాలని అప్లై చేసుకున్నారు. ఆ పనీ పెండింగ్‌లోనే ఉంది. ఈ విషయమై స్థానిక తహసీల్దార్‌ను వివరణ కోరగా తమ వద్ద ఏ సర్టిఫికెట్ పెండింగ్‌లో లేదని.. ఇప్పటి వరకు 16 సర్టిఫికెట్లు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.
పారదర్శకంగా పోడు భూముల సర్వే
మంచిర్యాల/ఆసిఫాబాద్,వెలుగు: పోడు రైతులకు పట్టాలు ఇచ్చేందుకు పారదర్శకంగా సర్వే చేయాలని మంచిర్యాల, ఆసిఫాబాద్ కలెక్టర్లు భారతి హోళికేరి, రాహుల్‌రాజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. మోకాపై ఉన్న వారికి సమాచారం అందించి మొబైల్ యాప్ ద్వారా భూమి హద్దులు, ప్రాంతం, ఇతర వివరాలు నమోదు చేయాలని, ఇందుకోసం జీపీఎస్‌ను వినియోగించాలని అన్నారు. గ్రామ స్థాయిలో పంచాయతీ సెక్రటరీ, బీట్ ఆఫీసర్, రెవెన్యూ అధికారుల సమన్వయంతో గ్రామసభలు నిర్వహించి తీర్మానాలు చేసి జిల్లా అధికారులకు సమర్పించాలన్నారు. మంచిర్యాల జిల్లాలోని 13 మండలాల పరిధిలో 88 గ్రామ పంచాయతీలు, 120 గ్రామాల్లో 4,486 మంది గిరిజనులు, 7,452 గిరిజనేతరుల నుంచి దరఖాస్తులు వస్తాయన్నారు. రోజుకు 10 దరఖాస్తులను పరిశీలించాలని, 2005, డిసెంబర్ 13కు ముందునుంచి మోకాపై ఉన్నవారిని అర్హులుగా గుర్తించాలని సూచించారు. మీటింగ్‌లో మంచిర్యాల అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్, ఉట్నూర్ ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి, ట్రెయినీ కలెక్టర్ పి.గౌతమి, డీఎఫ్‌వో టి.శివ్ ఆశిశ్ సింగ్, ఆసిఫాబాద్‌లో అడిషనల్ కలెక్టర్లు రాజేశం, చాహత్ బాజ్ పేయ్, డీఎఫ్‌వో దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మన ఊరు – మనబడి పనులను త్వరగా కంప్లీట్ చేయాలి...
మంచిర్యాల జిల్లాలో మన ఊరు – మన బడి పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. బుధవారం డీఈవో వెంకటేశ్వర్లుతో కలిసి ఇంజనీరింగ్ అధికారులు, ఎంఈవోలతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. మొదటి విడతలో 248 – స్కూళ్లను ఎంపిక చేశామని, ఇప్పివరకు 33 శాతం పనులు పూర్తయ్యాయని, 36 స్కూళ్లలో పుట్టి, పెయింటింగ్ టెండర్లు జరిగాయని, దనరా సెలవులు ముగిసేలోపు పనులు పూర్తి చేయాలన్నారు. మీటింగ్‌కు రాని గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ అధికారులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఉట్నూర్ ఐటీడీఏ పీవోకు సూచించారు.
ఉత్తమ పంచాయతీలను ఎంపిక చేయాలి..
జాతీయ గ్రామ పంచాయతీ అవార్డులు –2023 కార్యక్రమానికి జిల్లాలో ఉత్తమ పంచాయతీలను ఎంపిక చేయాలని కలెక్టర్ భారతి హోళికేరి ఆదేశించారు. మండలానికి మూడు జీపీలను ఎంపిక చేసి మొత్తం 20 పంచాయతీలను సిఫార్సు చేయాలన్నారు.
వర్తక సంఘం అధ్యక్షుడిగా విజయ్‌కుమార్
మందమర్రి,వెలుగు: మందమర్రి మార్కెట్వర్తక, వ్యాపారుల సంఘం అధ్యక్ష ఎన్నికల్లో తమ్మిశెట్టి విజయ్‌కుమార్ భారీ మోజార్టీతో విజయం సాధించారు. బుధవారం మార్కెట్లోని హనుమాన్ మందిర్‌లో ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు ఓటింగ్ జరిగింది. మొత్తం 469 ఓట్లకు గాను 431 ఓట్ల పోలయ్యాయి. అధ్యక్షుడి బరిలో నిలిచిన తమ్మిశెట్టి విజయ్‌కుమార్‌కు 232 ఓట్లు రాగా, మాయ రమేశ్‌కు 94 ఓట్లు, చీర్ల సత్యం 81 ఓట్లు, కొత్తపల్లి సత్యనారాయణకు 24 ఓట్లు వచ్చాయి. తమ్మిశెట్టి విజయ్‌కుమార్ మూడో సారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మార్కెట్ ఏరియాలో విజయోత్సవ ర్యాలీతో స్థానిక వ్యాపారులు సంబురాలు చేసుకున్నారు.
పేదల వైద్యానికి మోడీ సర్కార్ కృషి
నిర్మల్ వెలుగు: టీబీని రూపుమాపేందుకు మోడీ ప్రభుత్వం కృషిచేస్తోందని బీజేపీ జిల్లా హెల్త్ విభాగం కన్వీనర్ డాక్టర్ మల్లికార్జున్‌రెడ్డి చెప్పారు. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సేవా సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా నాయకులు స్థానిక హెల్త్ సెంటర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేదల వైద్యం, ఆరోగ్యం కోసం కోట్లాది రూపాయలతో వివిధ పథకాలు అమలు చేస్తుందన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వైద్యపరమైన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతుందన్నారు. హాస్పిటళ్ల అభివృద్ధితో పాటు డాక్టర్ల నియామకాలు చేపడుతూ పేదలకు ఉచిత వైద్యం అందించే ప్రయత్నం చేస్తుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎం అండ్ హెచ్ వో రవీందర్ రెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసెమ్మ రాజు, ఉపాధ్యక్షుడు కమల్ నయన్, కార్యదర్శి కొరిపల్లి శ్రావణ్ రెడ్డి, లీడర్లు అనుముల శ్రావణ్, మురళీధర్, నరేందర్, సాయి ప్రకాశ్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
సారూ.. న్యాయం చేయున్రి
బెల్లంపల్లి,వెలుగు: సఖీ కేంద్రం వెహికల్ టెండర్ ఇప్పిస్తానని తన వద్ద రూ. లక్ష తీసుకొని సీడీపీవో మోసం చేశారని ఓ బాధితుడు బుధవారం అదే ఆఫీస్ ఎదుట బైఠాయించాడు. బెల్లంపల్లి సీడీపీవో, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాజీ జిల్లా ఇన్ చార్జి అధికారిణి ఎం.ఉమాదేవి తనకు వెహికల్ టెండర్ వచ్చేలా చేస్తానని చెప్పి గత మార్చిలో రూ. లక్ష తీసుకున్నారని మండలంలోని మాలగరిజాల గ్రామానికి చెందిన దివ్యాంగుడు గోమాస ప్రసాద్ ఆరోపించారు. వాహనాల కోసం టెండర్లు పిలిచినా వాటిలో ఎవరూ పాల్గొనలేదన్నారు. అంతేకాదు.. మూడు నెలల పాటు సఖీ కేంద్రానికి వెహికిల్ నడిపించాలని కోరడంతో నడిపించానని తెలిపాడు. ఆ తర్వాత వెహికల్ వద్దన్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. న్యాయం చేయాలని వేడుకున్నాడు.
ఫుడ్ పాయిజన్ ఘటనపై మైనార్టీ కమిషన్ నోటీసు
కాగ జ్ నగర్,వెలుగు: కాగజ్‌నగర్ మండలం బలగాల గ్రామ మైనారిటీ గురుకులంలో ఫుడ్ పాయిజన్‌తో 56 మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురైన ఘటనపై జాతీయ మైనారిటీ కమిషన్ స్పందించింది. ఘటనపై ఏడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని కలెక్టర్ రాహుల్‌రాజ్‌ను ఆదేశించింది. మూడు రోజుల క్రితం బలగాల మైనార్టీ గురుకులంలో ఫుడ్‌పాయిజన్ ఘటనను సుమోటో గా తీసుకున్నట్లు సభ్యులు పేర్కొన్నారు.