అంత్యక్రియలకు వెళ్లొచ్చేసరికి ఇంట్లో చోరీ

అంత్యక్రియలకు వెళ్లొచ్చేసరికి ఇంట్లో చోరీ
  •     35 తులాల గోల్డ్ , 15 తులాల వెండి మాయం
  •     హయత్ నగర్ పరిధి ప్రియదర్శిని కాలనీలో ఘటన 

ఎల్​బీనగర్,వెలుగు: హయత్ నగర్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. అంత్యక్రియలకు వెళ్లి వచ్చేసరికి చోరీ జరిగింది. బాధితురాలు తెలిపిన ప్రకారం.. హయత్ నగర్ ప్రియదర్శిని కాలనీకి చెందిన పసుపులేటి స్వాతి తమ సొంతూరు  సూర్యాపేటలో చిన్ననాటి ఫ్రెండ్ చనిపోవడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు గురువారం మధ్యాహ్నం వెళ్లింది. 

తిరిగి శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఇంటికి వచ్చి చూడగా తాళాలు పగలగొట్టి ఉండగా.. అనుమానంతో పక్కింటివారిసాయంతో లోపలికి వెళ్లి చూసింది. బీరువా పగలగొట్టి అందులోని 35 తులాల బంగారు ఆభరణాలు, 15 తులాల వెండి, ఒక మొబైల్ ను చోరీ అయినట్టు గుర్తించి పోలీసులకు తెలిపింది. అక్కడికి వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ధార్ గ్యాంగ్​పనేనా..? 

హయత్ నగర్ పీఎస్ పరిధిలో వరుస చోరీలు జరుగుతుండగా స్థానికుల్లో భయాందోళన నెలకొంది. 20 రోజుల కిందట ప్రజయ్ గుల్మర్ లో వరుసగా మూడు ఇండ్లలో చోరీ అయ్యాయి. అవి చేసినది ప్రమాదకరమైన మధ్యప్రదేశ్ కి చెందిన ధార్ గ్యాంగ్ గా పోలీసులు గుర్తించారు. ఇది కూడా వారి పనేనా అనే అనుమానాలు వస్తున్నాయి.

రెండిళ్లలో చోరీ.. నగలు, నగదు మాయం

ఘట్ కేసర్: తాళం వేసిన ఇంట్లో దొంగలు పడి నగలు, నగదు ఎత్తుకెళ్లిన ఘటన  ఘట్ కేసర్ పీఎస్ లో పరిధిలో జరిగింది.  ఇన్ స్పెక్టర్ ఎస్. సైదులు తెలిపిన ప్రకారం.. ఘట్ కేసర్ మున్సిపాలిటీ ఎన్ఎఫ్ సీ నగర్ బి–-2 కాలనీకి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి నితీశ్​కుమార్ శ్రీ వాత్సవ  గురువారం సాయంత్రం ఇంటికి తాళం వేసి  మియాపూర్ వెళ్లాడు. శుక్రవారం ఉదయం వచ్చి చూసేసరికి తాళం పగలగొట్టి ఉంది .

ఇంట్లోకి వెళ్లి చూడగా  బెడ్రూమ్ లోని బీరువా ఓపెన్ చేసి ఉండి అందులోని బంగారు నల్లపూసల దండ, జత కమ్మలు, ఉంగరం, వెండి నాణేలు, నగదు కనిపించలేదు. ఉత్తర ప్రదేశ్ వెళ్లిన అతని తమ్ముడి ఇంటి తాళం కూడా పగలగొట్టి ఉండి..  ఇంట్లో బీరువా వస్తువులు కనిపించలేదు. బాధితుడు కంప్లయింట్ చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఎన్ఎఫ్ సీ నగర్ లో వరుస చోరీలతో స్థానికులతో  భయాందోళన నెలకొంది.