
కొమురవెల్లి, వెలుగు: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని గౌరాయపల్లిలో మంగళవారం వరుసగా ఆరు ఇండ్లల్లో చోరీలు జరిగాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌరాయపల్లికి చెందిన నీల కనకయ్య ఇంటి తాళం పగులకొట్టి దొంగలు బీరువాలో ఉన్న సుమారు 10 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు.
బొచ్చు లక్ష్మి ఇంట్లో చొరబడి తులం బంగారం, 6 తులాల వెండి, రూ.21 వేల నగదు దొంగిలించారు. బండి మల్లవ్వ ఇంట్లో 25 తులాల వెండి, తులం బంగారం, రూ.4 వేల నగదు చోరీ చేశారు. సన్నపురి రాములవ్వ ఇంట్లో 20 తులాల వెండి, రూ.6 వేల నగదు దొంగిలించారు. నరెడ్ల మల్లవ్వ ఇంట్లో రూ.20 వేల నగదు ఎత్తుకెళ్లారు. దొంతర భిక్షపతి ఇంట్లో బీరువా పగలగొట్టి రూ.2 లక్షల 80 వేల నగదు చోరీ చేశారు.
వీరందరూ పీఎస్లో ఫిర్యాదు చేయగా క్లూస్ టీం ఏఎస్ఐ క్రాంతి చోరీలు జరిగిన ఇళ్లకు వచ్చి వేలి ముద్రలు సేకరించారు. చేర్యాల సీఐ శ్రీను, కొమురవెల్లి ఎస్ఐ నాగరాజు చోరీలు జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.