ఖమ్మం టౌన్, వెలుగు : నీట్, యూజీ ఎంట్రన్స్ లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ప్రధాని మోదీ స్పందించక పోవడాన్ని నిరసిస్తూ పీడీఎస్ యూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కేఎంసీ సెంటర్ లో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మణ్, వెంకటేశ్ మాట్లాడారు. బిహార్ లో 30 లక్షలకు నీట్ ప్రశ్నాపత్రాలు విక్రయించారని, అరెస్టులు జరుగుతాయని వార్తలు వస్తున్నా మోదీ స్పందించకపోవడం దారుణమన్నారు. నీట్ పరీక్షలో 67 మందికి ఫస్ట్ ర్యాంకులు రావడం ఎన్నో అనుమానాలకు తావిస్తోందన్నారు.
ఎనిమిది మంది స్టూడెంట్స్ 720 మార్క్స్ సాధించడం, టెన్ డేస్ ముందుకు జరిపి సరిగ్గా ఎన్నికల ఫలితాల ప్రకటన రోజు నీట్ రిజల్ట్ వెలువడడం ఎన్నో అనుమానాలు కలిగిస్తోందని తెలిపారు. నీట్ పేపర్ లీకేజ్‌కు బాధ్యత వహిస్తూ నీట్ చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీడర్లు కరుణ్, కార్తీక్, మణికంఠ, విష్ణు, నరేందర్, లాల్ పాషా, రాకేశ్, భూమిక, కావ్య, స్పందన, అఖిల, అనూష పాల్గొన్నారు.