భద్రాచలం, వెలుగు: బీఆర్ఎస్ లీడర్లు తన దిష్టిబొమ్మను దహనం చేయడంపై భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఫైర్అయ్యారు. మంగళవారం క్యాంపు ఆఫీసులో జడ్పీ చైర్మన్కోరం కనకయ్యతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేయడం ఏమిటని నిలదీశారు. భద్రాచలాన్ని వరదల నుంచి కాపాడాలని, సీఎం ఇస్తానన్న నిధులు ఏవి అని స్థానిక ఎమ్మెల్యేగా ప్రశ్నించడం తప్పా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ అబద్ధాల కోరు అని.. భద్రాద్రి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లోకల్ బీఆర్ఎస్లీడర్లకు దమ్ముంటే ఇచ్చి హామీ ప్రకారం కేటాయించాల్సిన నిధులపై సీఎంను నిలదీయాలని, తాను కూడా కలిసి వస్తానని సవాల్ విసిరారు.
ALSO READ :మంత్రి కేటీఆర్‌పై హెచ్ఆర్సీకి ఫిర్యాదు
భద్రాచలానికి పైసా ఇవ్వని కేసీఆర్ దిష్టిబొమ్మను తగలబెట్టాలని సూచించారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అందరి బొమ్మలు తన వద్ద ఉన్నాయని హెచ్చరించారు. అనంతరం భద్రాచలంలోని గోదావరి ముంపు ప్రాంతాలు, పునరావాస కేంద్రాలను పరిశీలించి, స్థానికులతో మాట్లాడారు. పోలవరం బ్యాక్ వాటర్‌తో భద్రాద్రికి ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది ప్రాణాలకు తెగించి పనిచేసిన గజ ఈతగాళ్లకు డబ్బులు ఇచ్చే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదంటే భద్రాద్రిపై వారికున్న ప్రేమను అర్థం చేసుకోవచ్చన్నారు.