బర్నింగ్​ సిటీలో బతుకులు ఆగమైతున్నయ్

జార్ఖండ్ లోని ఝరియా కోల్​ మైన్స్ లో 1916 నుంచి నిప్పులు చెలరేగుతూనే ఉన్నాయి. లక్షలాది మంది వివిధ రోగాల బారిన పడుతూనే ఉన్నారు. ఏటా వేలాది మంది మరణిస్తూనే ఉన్నారు. అయినా అక్కడ బొగ్గు ఉత్పత్తి ఆగలేదు. దేశంలోనే అత్యంత నాణ్యమైన బొగ్గు కాబట్టే ఇక్కడ ప్రజలు తమ బతుకులను పణంగా పెట్టి మరీ బొగ్గును ఉత్పత్తి చేస్తున్నారు. 2021 నాటికి ఇక్కడి నుంచి ప్రజలను దూరంగా తరలించి వారికి గృహ వసతి, పరిశుద్ధమైన మంచినీటి సౌకర్యం మొదలైన సదుపాయాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలు రూపొందించింది. అయితే రాజకీయ నాయకుల్లో చిత్తశుద్ధి, నిజాయితీ లేక కనీస వైద్య సౌకర్యం కూడా వారికి లభించని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడి రాజకీయ నాయకులు, కొందరు ప్రజాప్రతినిధులు అవినీతి, అక్రమాలను కొనసాగించడం కోసం ఏ సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ముందుకు సాగనివ్వకుండా అడ్డుపడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 

రోగాల బారిన పడుతున్నరు

ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి కన్నా అత్యంత ప్రమాదకరమైన ఝరియా బొగ్గు బావుల్లో నిప్పులపై జీవించే బతుకులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వాతావరణ పరిస్థితుల కారణంగా లక్ష మందికిపైగా ప్రజలు టీబీతో బాధపడుతుండగా, వినికిడి కోల్పోయే పరిస్థితిని 50 వేల మందికి పైగా ఎదుర్కొంటున్నారు. వెన్ను నొప్పి, గుండె సంబంధిత వ్యాధులు, కేన్సర్, గ్రానిక్ బ్రాంకెటైస్, హైపర్‌‌ టెన్షన్, తలనొప్పి, లంగ్స్ ప్రాబ్లం, శ్వాస ఇబ్బందులు, నిద్ర లేమి, మూత్రపిండాల సంబంధిత వ్యాధులు, చర్మ వ్యాధులు, డీహైడ్రేషన్ ఒక్కటేమిటి అమీబియాస్, మలేరియా, చికెన్ ఫాక్స్, ట్యూబర్ క్యూలోసిస్, ఆత్రేటిస్, చివరికి లెప్రసీ లాంటి వ్యాధులతోనూ బాధపడుతున్న వారు ఇక్కడ కనిపిస్తారు. ఝరియా వాట ర్ బోర్డ్ ఆధ్వర్యంలో సరఫరా చేస్తున్న మంచినీరు కూడా కనీస స్టాండర్డ్స్ ప్రకారం లేవు. క్లోరైడ్స్, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫేట్స్, నైట్రేట్స్, నేషనల్ స్టాండర్డ్స్ కన్నా అతి తక్కువగా ఉన్నాయి.

కాలుష్యం నిండిన దామోదర్ రివర్

దేశంలోనే అత్యంత కలుషిత నదిగా పేరున్న దామోదర్ రివర్ నుంచి ఇక్కడి ప్రాంతాలకు నీరు సరఫరా చేస్తున్నారు. అక్కడి పరిశ్రమల వ్యర్థమంతా ఇందులోనే ఉంటుంది. మంచినీటి సరఫరాను కూడా సక్రమంగా చేసే పరిస్థితి లేదు. దీని వల్ల కూడా ఆ ప్రాంత ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. దాదాపు మూడున్నర లక్షల మంది ప్రజలు ఈ ప్రాంతంలో తరచూ గ్యాస్ట్రిక్ సమస్యలతో సతమతమవుతుంటారు. చివరికి గనుల్లో పనిచేసే కార్మికులకు కూడా మంచినీటి సరఫరా చేయరు. దీంతో చాలా మంది కార్మికులు కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న దాఖలాలు ఉన్నాయి. క్యాంటీన్లు కూడా లేకపోవడం, ఇంటి నుంచే మంచినీరు, రొట్టెలు తెచ్చుకుంటామని రసూల్(40) అనే కార్మికుడు చెప్పాడు. బ్లాస్టింగ్ తర్వాత వాటర్ స్ప్రేయింగ్ కూడా లేదు. దీంతో పొగలు, మంటలు అన్ని కూడా గాలిలో కలిసిపోవడం, నీటిపై చివరికి ఆ ప్రాంత భూమిపై, మట్టిపై కూడా ప్రభావం చూపుతున్నది.

లిక్కర్, సారాతో ఆందోళనకర పరిస్థితులు

హెవీ ఆల్కహాలిక్ ప్రాంతంగా ఝరియాను పిలుస్తుంటారు. ఇక్కడ పదేండ్ల వయసు పిల్లలు మొదలుకుని అరవై యేండ్ల వయసున్న వారి వరకూ అంతా మద్యం మత్తులో మునిగిపోతారు. ప్రధానంగా దేశీదారు సారా మత్తులో వారంతా కనిపిస్తారు. బాధలన్నీ దూరం చేసుకోవడానికి తాగుతున్నామంటారు. ఎన్నో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, ఆస్పత్రులను, డిస్పెన్సరీలను కూడా కొద్ది దూరంలో ఏర్పాటు చేశారు. వైద్యం సంగతి పక్కనబెడితే వ్యాధులు రాకుండా ప్రయత్నం చేయాల్సిన ప్రభుత్వం, అధికారులు ఆ దిశగా వెళ్లడం లేదని అక్కడి పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. పిల్లలు స్కూళ్లకు పోయే పరిస్థితి లేదు. సారా కోసం పుస్తకాలు అమ్ముకుంటున్న వారు కూడా ఇక్కడ కనిపిస్తారు. పలు ఎన్జీవోలు ఈ ప్రాంతంపై అధ్యయనం చేయడం, ఇక్కడి ప్రజలను వేరే ప్రాంతానికి తరలించి వారిలో కొంత మార్పు, ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నా పెద్దగా ఫలితం ఉండడం లేదు. దేశంలోని బొగ్గు ఉత్పత్తిలో 50 శాతం కన్నా ఎక్కువగా ఝరియాలోని బొగ్గు గనుల నుంచే ఉండడం వల్ల దీనిపై ప్రభుత్వం పెద్దగా శ్రద్ధ వహించడం లేదు. వందేండ్లకుపైగా కొనసాగుతున్న ఈ భారీ జీవన విధ్వంసం కళ్లారా చూస్తే కంటతడి పెట్టకుండా ఉండలేం. ఆ ప్రాంత పిల్లలు ముఖ్యంగా మహిళల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. కడుపులోనే పిండాలు చనిపోతున్న పరిస్థితి. ఏటా దాదాపు 150 మందికి పైగా వివిధ వ్యాధులతో మరణిస్తున్నట్లు అక్కడి అనధికార లెక్కలు చెబుతున్నాయి.
                                                                                                              - ఎండీ మునీర్,సీనియర్​ జర్నలిస్ట్

5 లక్షల మందిపై ప్రభావం

బర్నింగ్ సిటీగా ఝరియాకు పేరుంది. ఝరియా కోల్ మైన్స్​లో 105 సంవత్సరాలుగా బీభత్సమైన ఫైరింగ్​ జరుగుతోంది. వర్షం వస్తే కొంత అగ్గి తగ్గి మిథేన్ గ్యాస్ వెలువడుతోంది. ఇది కూడా ప్రమాదకరమే. వీటన్నింటి వల్ల కోల్​మైన్స్​కు చుట్టుపక్కల 250 కిలోమీటర్ల పరిధిలో జీవిస్తున్న 5 లక్షల మందికి పైగా ప్రజలపై ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. అయితే ఇక్కడి పరిస్థితుల గురించి పాలకులకు ఏమాత్రం పట్టింపులేదు. అక్కడి బొగ్గు బ్లాకులను వేలం వేసి అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఇటీవల బొగ్గు బ్లాకులను ప్రైవేటు వాళ్లకు అప్పగించడానికి కూడా సిద్ధమయ్యారు. 105 సంవత్సరాలుగా మండుతున్న ఝరియా బొగ్గు బ్లాకులపై దృష్టి సారిస్తే ఎవరికైనా కంట తడి రాకమానదు. నిప్పుల మూలకంగా సాధారణం కన్నా రెండు, మూడింతలు ఎక్కువగా ఇక్కడ వేడి రాజుకుంటూ ఉంటుంది. పసిపిల్లల చావులకైతే లెక్కేలేదు. గనుల నుంచి వెలువడుతున్న సీవో, సీవో2, మిథేన్, నైట్రస్​ ఆక్సైడ్ వల్ల భారీగా వాయు కాలుష్యం ఏర్పడి ఎర్త్ క్రాక్స్ కూడా వస్తున్న దాఖలాలున్నాయి.