ఢిల్లీలో ఎండలు ముదిరిపోవడానికి రాజస్థాన్‌లో అడవుల నరికివేత కారణమంటే నవ్వుకుంటారు. ఎక్కడ ఢిల్లీ, ఎక్కడ రాజస్థాన్ అనుకుంటారు. ప్రకృతి కల్పించిన సదుపాయాల్లో కొండలు, కోనలు, నదులు, సరస్సులు ఉన్నాయన్న విషయాన్ని మరచిపోతుంటాం. రాజస్థాన్‌లో 700 కిలోమీటర్ల పొడవున వ్యాపించిన ఆరావళి పర్వతాలు హర్యానా, ఢిల్లీ ప్రాంతాలకు ‘గ్రీన్ కవర్’లా పనిచేస్తుంటాయి. మైనింగ్‌వల్ల, అడవుల్లో జనావాసాలు పెరగడంవల్ల ఈ గ్రీన్ కవర్ చిరిగిపోతోంది. ఆరావళిలో ఇష్టమొచ్చినట్లుగా చెట్ల నరికివేత జరుగుతోంది. పర్యావరణపరంగా ‘ప్రొటెక్టివ్ జోన్’గా ఉండాల్నిన ఆరావళి కొండలు తరిగిపోతున్నాయి. దాని ఫలితంగానే ఢిల్లీకి వడగాల్పులు వీస్తున్నాయని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. ఈ వారంలో ఏకంగా రికార్డు స్థాయిలో 48 డిగ్రీల సెల్షియస్ టెంపరేచర్ నమోదైంది. ఇది ఢిల్లీలో ఆల్ టైమ్ హై టెంపరేచర్ నార్త్ ఇండియా మీదుగా వీస్తున్న వడగాలుల కారణంగా రికార్డు స్థాయిలో టెంపరేచర్ పెరిగిందన్నది అధికారుల అంచనా. ఢిల్లీలో పెద్ద ఎత్తున వడగాడ్పులు వీయడానికి, టెంపరేచర్ పెరగడానికి రాజస్థాన్‌లోని ఆరావళి కొండల్లో చెట్ల నరికివేతను ప్రధాన కారణంగా చెబుతున్నారు.. ఆరావళి పర్వతాలు దేశంలోనే అతి ప్రాచీనమైనవి. దేశానికి వాయవ్య దిక్కున 700 కిలోమీటర్ల పొడవున వ్యాపించి ఉన్నాయి. గుజరాత్‌లోని పలన్ పూర్ నుంచి ఢిల్లీ వరకు ఈ కొండలు విస్తరించాయి. పర్యావరణపరంగా ఢిల్లీ నగరానికి ‘ప్రొటెక్టివ్ జోన్’ గా ఆరావళి కొండలు ఉపయోగపడుతున్నాయి. కాలక్రమంలో ఈ పర్వతాల్లో చెట్లు నరికివేయడం మొదలైంది. వేల సంఖ్యలో వృక్షాలను ఎడాపెడా నరికివేస్తున్నారు. నిన్న మొన్నటిదాకా మనిషి వెళ్లాలంటేనే భయపడే కొండల్లో ఇప్పుడు విచ్చలవిడిగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఆరావళి కొండల్లో 1980 వరకు 247 చదరపు కిలోమీటర్ల మేర మనుషుల నివాస ప్రాంతాలు ఉండేవి. 2016 నాటికి జనావాసాలు మూడు రెట్లు పెరిగాయి. ఎక్కడ పడితే అక్కడ చెట్లను కొట్టేయడం, ఇష్టం వచ్చినట్లు నిర్మాణాలు చేయడం తో అడవి కాస్తా కాంక్రీట్ జంగిల్‌గా మారింది. 1980 వరకు ఆరావళి కొండల్లో పరిశ్రమలు అనేవే లేవు. ఇప్పుడు పరిస్థితి మారింది. 46 చదరపు కిలోమీటర్ల మేర పరిశ్రమలు
వచ్చేశాయి.
ఆరావళి కొండల చరిత్ర…
మన దేశంలోనే అత్యంత పురాతనమైనవి ఆరావళి కొండలు. వీటిలో అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ‘గురుశిఖర’. దీని ఎత్తు 1722 మీటర్లు. రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ వాయవ్య ప్రాంతంలో విస్తరించిన ఈ కొండలను స్థానికంగా ‘జర్గా కొండలు’ అని పిలుస్తారు. ఆరావళి అంటే సంస్కృతంలో ‘శిఖరాల వరుస’ అని అర్థం. ఖనిజ సంపదకు ఆరావళి కొండలు పెట్టింది పేరు. ముఖ్యంగా రాగి, సీసం, జింక్, యాజ్ బెస్టాస్ వంటి ఖనిజాలు ఇక్కడ పెద్ద ఎత్తున ఉన్నాయి.
ఎయిర్ క్వాలిటీ పై ప్రభావం..
ఢిల్లీ, చుట్టుపక్కల ఏటా చలికాలంలో ఎయిర్ క్వాలిటీ 400 నుంచి 500 పాయింట్లు దాటుతోంది. ఆరావళి పర్వతాలను రక్షించుకోకపోతే 800 దాటినా ఆశ్చర్యం లేదు’ అని పర్యావరణవేత్తలు హెచ్చరించారు. ఆరావళి కొండలు బయో డైవర్సిటీకి సెంటర్లవంటివి. మినీ గ్రౌండ్ వాటర్ టవర్లుగానూ పనిచేస్తున్నాయి. భూగర్భ జల మట్టాన్ని పెంచుతున్నాయి. రాజస్థాన్, హర్యానాల్లోని చాలా చోట్ల ఇల్లీగల్ మైనింగ్‌తో కొండలు, గుట్టలు మాయం కావడంతో భవిష్యత్‌లో గ్రౌండ్ వాటర్ లెవల్స్‌ని మెయింటైన్ చేయటం కష్టం అంటున్నారు పర్యావరణవేత్తలు.
అడుగంటిన అండర్ గ్రౌండ్ వాటర్…
ఆరావళి కొండల్లో మైనింగ్ కార్యకలాపాల ఫలితంగా అండర్ గ్రౌండ్ వాటర్ అడుగంటిపోయింది. ఏకంగా కొండలనే మాయం చేయడంతో ఎడారి ప్రాంతం పెరిగింది. వీటన్నిటి ఫలితం ప్రజారోగ్యం పై పడింది. భూతాపం పెరగడం ఎక్కువైంది. ఫలితంగా వాతావరణంలో అప్పటికప్పుడు మార్పులు సంభవించడం మొదలైంది.
పొలిటీషియన్లు, ఆఫీసర్లు, కాంట్రాక్టర్లు కలిసిపోవడంతో ఆరావళి కొండల్లో అక్రమ మైనింగ్‌కి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అక్రమంగా కోట్ల రూపాయలు వస్తుండడంతో ప్రభుత్వాల్లోని పెద్దవారు కూడా దీనిని చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు.
31 కొండలు మాయం…
రాజస్థాన్‌లోని ఆరావళి కొండల్లోకి మైనింగ్ మాఫియా కూడా చొరబడింది. 115.34 హెక్టార్లలో అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు వార్తలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సుప్రీంకోర్టు కిందటేడాది సీరియస్ అయింది. అక్రమ మైనింగ్ ప్రభావంతో 31 కొండలు కనుమరుగయ్యాయంటూ కేంద్ర సాధికారత కమిటీ పేర్కొంది. ఈ విషయాన్ని జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం ప్రస్తావించింది. ‘31 కొండలు కనిపించకుండా పోవడం అంటే చిన్న విషయం కాదు. సంజీవని కోసం హనుమంతుడు పర్వతాన్ని చేతితో ఎత్తుకెళ్లినట్లు ప్రజలు ఎవరైనా ఈ కొండలను ఎత్తుకెళ్లారా? ’ అని జస్టిస్ లోకూర్ కామెంట్ చేశారు. థార్ ఎడారిలోని ఇసుక, దుమ్ము, ధూళి రేణువులు ఢిల్లీ వైపు గాల్లో కొట్టుకురాకుండా ఆరావళి కొండలే కాపాడుతుంటాయి.
కాగా, హర్యానాలోని అనేక ప్రాంతాలకు ఆరావళి కొండలు గ్రీన్ కవర్‌లా ఉంటాయి. ఆరావళి అడవుల్లో నిర్మాణాలకు అనుమతిస్తూ హర్యానా ప్రభుత్వం చట్టంలో కొన్ని సవరణలు చేసింది. దీంతో అటవీ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ బిజినెస్ ప్రవేశించింది. కొండలు, గుట్టలు మాయమవడం మొదలైంది. వాటి స్థానంలో విచ్చలవిడిగా నిర్మాణాలు జరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్ పేరుతో మనుషుల ఆరోగ్యానికి హాని చేస్తే సహించేది లేదని హర్యానా ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు హెచ్చరించింది.
దక్షిణ హర్యానా ప్రాంతంలోని ఆరావళి కొండలకు సంబంధించి 2016 లో వైల్డ్ లైఫ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఒక స్టడీ నిర్వహించింది. హర్యానా–రాజస్థాన్‌లోని అనేక ఏరియాల్లో అడవుల విస్తీర్ణం తగ్గిపోయిందని వెల్లడైంది. రకరకాల కారణాలతో గ్రీన్ బెల్ట్‌గా పనిచేయాల్సిన ఆరావళి కొండలు ఆ పనిచేయలేకపోతున్నాయని పేర్కొంది.