పాలనలో లాలిత్యం పోయి కర్కశత్వం తిష్టవేసి చాన్నాళ్లవుతోంది. అది మరింత బరితెగింపునకు మళ్లుతూ ప్రమాదకరంగా మారుతోంది. ‘మేమింతే... ఏం చేసుకుంటారు? చేసుకోండి!’ అన్నట్టుంది ఏలినవారి వ్యవహారం! లక్షలాది మంది జీవితాలతో ముడివడి ఉన్న కీలకాంశాల్లో కూడా తగినంత శ్రద్ధాసక్తులుండటం లేదు. తాజాగా.. గ్రూప్–1 పేపర్ లీకేజీ పరీక్షల రద్దు వంటి పరిణామాలతో లక్షల యువ హృదయాలు తుఫానులో చిగురుటాకుల్లా అల్లాడుతున్నాయి. సమస్య పరిష్కారం మీద, పునరావృతం కాకుండా లోపాల్ని సరిదిద్దడం పట్ల, పటిష్ట వ్యవస్థల ఏర్పాటుపైన ఎవరికీ శ్రద్ధ ఉండటం లేదు.
నీళ్లు, నిధులు, నియామకాల నినాదమే తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో నిత్య మంత్రమైంది. అదే మంత్ర మహిమతో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా.. నియామకాల్లేక సంవత్సరాల నిరీక్షణ నిరుద్యోగులకు తప్పలేదు. చివరకు ఉద్యోగాల కల్పనకు ఓ ఆశాకిరణం మెరిసింది. సీఎం కేసీఆర్సరిగ్గా ఏడాది కిందట వనపర్తి సభలో ఈ తీపి కబురు వినిపించారు. ‘రేపు, అంటే మార్చి 8న ఉదయం పది గంటలకు ఎవరూ మిస్ కాకుండా టీవీ చూడాల’ని ఊరించే ప్రకటన ఆ ముందు రోజున చేశారు. సుమారు 80 నుంచి 90 వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నామని అసెంబ్లీ వేదిక నుంచి ప్రకటించారు.
నిజానికి ప్రభుత్వమే నియమించిన రిటైర్డ్ ఐఎఎస్ అధికారి బిశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారం లక్షా తొంబై వేల ఖాళీలున్నా అందులో సగమే ప్రకటించారు. ఆ ఖాళీల భర్తీకి పలు విడతలుగా శాఖాపరమైన అనుమతులు, నోటిఫికేషన్లు, నియామక ప్రక్రియ మొదలైంది. అంతకు ముందే కొన్ని నియామకాలు తెలంగాణ రాష్ట్రంలో జరిగాయి. ఖాళీల భర్తీ, కొత్తగా అవసరమైన ఉద్యోగాలు, తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్ధీకరణ.. ఇలా పలు అవకాశాలున్నాయి గనుక ఎప్పుడెప్పుడు ఏయే ఉద్యోగాలు భర్తీ చేస్తారో ఏటా నిర్దిష్ట ప్రక్రియ కోసం ‘జాబ్ క్యాలెండర్’ ప్రకటించాలన్న డిమాండ్ ఎందుకో గాలికిపోయింది.
సర్కారు పట్టించుకోలేదు. ఎప్పటికప్పుడు జరపాల్సిన నియామకాలు అన్నీ ఆపి, సరిగ్గా ఎన్నికల ముందు అవి జరిగేట్టు ప్రక్రియ చేపట్టడం కుట్ర పూరితమని విపక్షాలూ విమర్శించాయి. అయినా, అదే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. కీలకమైన గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష జరిగి, ఫలితాలు వెల్లడై, 25 వేల మంది అర్హులయ్యారు. మెయిన్స్ నిర్వహించాల్సిన సమయంలో బాంబులాంటి వార్త, ప్రశ్నపత్రం లీకయిందని, కొందరు అనుచితంగా లబ్ధి పొందారని వెల్లడైంది. దర్యాప్తు మొదలైంది, తప్పెక్కడ జరిగిందో ప్రాథమికంగా గుర్తించారు. పలువురిపై కేసులు నమోదు చేసి, కొందరిని అరెస్టు కూడా చేశారు.
తడి ఆరిన కరుకుదనం
ప్రశ్నపత్రం లీకయింది. కొందరు అనుచితంగా లబ్ధిపొందారు. కానీ, లక్షలాది మందికి ఈ లీకేజీతో సంబంధమే లేదు. ఉన్నత చదువులు చదివి ఏండ్లుగా నిరీక్షించారు. నెలల తరబడి డబ్బు, శ్రమ, సమయం వెచ్చించి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. నిష్టతో పరీక్ష రాశారు. సానుకూల ఫలితాలతో సంబరపడ్డారు. అర్హులైన వారు మెయిన్స్‌లోనూ గెలుపొందాలని ఇంకా కష్టపడుతున్నారు. ఏకంగా ఇప్పుడు పరీక్ష రద్దు, ప్రిలిమ్స్ మళ్లీ రాయాలి. అంటే వారి మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఎవరైనా దీని గురించి, కనీసం మనసు పెట్టి ఆలోచించారా? జరిగిన తప్పు ఎలాంటిది, దానికి కారకులెవరు, అన్నదాంతో నిమిత్తం లేకుండా... ‘మేమెందుకీ క్షోభ అనుభవించాలి?’ అన్న బాధితుల ప్రశ్నకు ఎవరు సమాధానమిస్తారు? పాతికవేల మంది అర్హులందరిదీ ఈ బాధ అయితే, సొంత ప్రతిభతో వంద మార్కులుపైన స్కోర్ చేసిన వారంతా తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారు.
ఏ రోజున ఏ పోలీసు ఇంటికి వస్తాడో? ఏమడుగుతాడో? అన్న వ్యథ వారిని క్షణక్షణం వేధిస్తోంది. పోనీ, అదైనా ఏ స్వతంత్ర ప్రతిపత్తి, నిజాయితీ, నిష్పాక్షికత కలిగిన సంస్థతోనో దర్యాప్తు జరిపించి.. లీకేజీ ఎంత వరకు వెళ్లిందో తేల్చి, వారిని మాత్రమే అనర్హుల్ని చేసి మిగతా ప్రక్రియ యధాతథంగా కొనసాగించే యోచన ఎందుకు చేయలేదు? లీకేజీ వెలుగు చూసిన వెంటనే, తదుపరి ఏం చేయాలి? అనే విషయంలో విద్యారంగ నిపుణులు, ప్రస్తుత – రిటైర్డ్ వీసీలు, ఇతర అకడమీషియన్లు, దర్యాప్తు సంస్థల అధిపతులు, మేధావులు, యువ – విద్యార్థి సంఘాల వారితో ఒక సమావేశం ఎందుకు ఏర్పాటు చేయలేదు?
ఏకపక్షంగా పరీక్ష రద్దు ప్రకటించి.. ఓ ఇద్దరిని చూపి, వారి వళ్లే ఇదంతా జరిగింది, ఇంకెవరికీ సంబంధం లేదనే ఏకపక్ష ప్రకటన వెనుక ఉద్దేశాలు, దురుద్దేశాలు ఏంటి? అనే ప్రశ్న తలెత్తడం సహజం. దీనికి బాధ్యులైన వారు సమాధానం చెప్పాలి. ఇదివరలో పలు పరీక్ష పత్రాలు లీకయ్యాయి. ఇంటర్ సమాధాన పత్రాల మూల్యాంకనంలో ‘గ్లోబరీనా’ వంటి ఎజెన్సీల తప్పిదాలకు పలువురు యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దర్యాప్తులు జరిపారు, చివరకు ఏమైంది? ఏదీ ఒక హేతుబద్ధమైన ముగింపునకు రాలేదు. బలమైన శిక్షలు పడలేదు. ఇలాంటి నేరాలకు తలపడొద్దన్న భయం నిందితుల్లో లేకుండా పోయింది.
పౌర చేతనే చెర్నాకోల
వేలాది మంది విద్యార్థులు, నిరుద్యోగ యువత ఏ యూనివర్సిటీ క్యాంపస్‌లోనో, నగర-రాష్ట్ర గ్రంథాలయ ప్రాంగణాల్లోనో ఏ సౌకర్యాల్లేకుండా కుర్చీలు వేసుకొని దినమంతా పరీక్షలకు ప్రిపేరవుతున్నపుడు ఎవరికీ పట్టలేదు. ఎన్నికల హామీగా ప్రకటించి, బడ్జెట్‌లో ప్రతిపాదించి రాష్ట్రంలో ఏ ఒక్కరికీ నిరుద్యోగ భృతి ఇవ్వకుంటే కిమ్మనలేదు. కానీ, ఇప్పుడు, ఓ దరిద్రం జరిగాక... అన్ని రాజకీయ పక్షాలు తామే ముందుండి దీక్షలు, ర్యాలీలు, మిలియన్ మార్చ్‌లు అని గోల చేస్తున్నాయి. స్వార్థ రాజకీయ పదఘట్టణల్లో పడి నిరుద్యోగ యువత గొంతు కర్కశంగా నలిగిపోతోంది. విశ్వసనీయత తగ్గిన రాజకీయ పక్షాలు కాకుండా మొత్తం పౌరసమాజమే స్పందించాలి. గొంతెత్తి, పలుచనవుతున్న ప్రజాస్వామ్య ప్రక్రియలన్నింటినీ కాపాడుకోవాలి. సద్గురుగా పేరొందిన జగ్గీవాసుదేవ్ ఇటీవల అన్న మాట ఒకటి గుర్తొస్తోంది. ‘ప్రజాస్వామ్యం ఓ అద్భుత - వైవిధ్యమైన క్రీడ, ఇందులో ప్రేక్షకులుండరు... అందరూ పాల్గొని తమ వంతు ఆట ఆడాల్సిందే!’
సంబంధం లేదంటే ఎలా?
‘పేపర్ లీకవటం మామూలే!’ ‘ఎవరివల్లో ఎక్కడో పేపర్ లీకయితే, ప్రభుత్వానికేంటి సంబంధం?’ ‘పరీక్ష రద్దు చేశాం, మళ్లీ పరీక్ష రాసే అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తాం, ఫీజు మాఫీ చేస్తాం.. మూడు పూటలా తిండి పెడతాం’ ఇవీ బాధ్యత కలిగిన ప్రభుత్వ ప్రతినిధులు, మంత్రులైన వారి మాటలు! నిజానికిది బాధ్యతారాహిత్యం కాదా? తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వద్ద నమోదుచేసుకున్న నిరుద్యోగుల సంఖ్య సుమారు 30 లక్షలు! గ్రూప్-1 ప్రిలిమ్స్ మాత్రమే కాకుండా జరిగిన కొన్ని ఇతర పరీక్షల్నీ రద్దు చేశారు. వారంతా ఇప్పుడు అయోమయంలో ఉన్నారు. అప్పో సప్పో చేసి.
ఇంటినీ, ఒంటి మీది నగల్నీ తాకట్టు పెట్టి చదివించిన తలిదండ్రుల ఆందోళన సంగతేంటి? వారి మానసిక స్థితి గురించి సర్కారు పెద్దలు ఒక నిమిషం కూడా ఆలోచిస్తున్నట్టు లేదు. ఒక రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రిగా నాటి లాల్ బహదూర్ శాస్త్రీ రాజీనామా చేసింది.. తానే ఆ ప్రమాదం జరిపి కాదు, నైతిక బాధ్యత వహిస్తూ! ఓ చిన్న ఉత్పత్తి సంస్థో, సేవా సంస్థో తన అమ్మకాల ప్రోత్సాహానికి లక్కీ ప్రైజ్, లక్కీ డిప్, లక్కీ డ్రా వంటివి ప్రకటిస్తే... ఆ పోటీకి సంస్థ ఉద్యోగులు, డీలర్లు అర్హులు కారు అని ముందే చెబుతుంది.
మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఉద్యోగ నియామక ప్రక్రియకు సదరు సంస్థ ఉద్యోగుల్ని ఎలా అనుమతించారు? పైగా, అలా పరీక్ష రాస్తున్న వారికి.. ప్రశ్నపత్రాలు దాగి ఉన్న రహస్య కంప్యూటర్ వ్యవస్థకు యాక్సెస్ ఎలా ఇచ్చారు? ఇందుకెవరు బాధ్యులు? తేల్చరా? ఇలాంటి అంశాలపై కూలంకషమైన చర్చ ఎందుకు జరుగదు? విద్యార్థి, యువజన సంఘాలు క్రియాశీలంగా లేకపోవటం వల్లే ఈ అనర్థాలా? ఏవో ప్రధాన స్రవంతి రాజకీయ పక్షాలకు, వారి రాజకీయ ఎజెండాకు ఊడిగం చేయటం తప్ప, తమ నిజమైన సమస్యలపై పోరాటాలు చేసే చేవ ఆయా సంఘాల్లో క్రమంగా చచ్చిపోయింది. విద్యార్థి సంఘ రాజకీయాల నుంచి మంచి నాయకత్వం పుట్టుకు వచ్చిన సందర్భాలున్నాయి. కాలేజీల్లో, యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘాలు, వాటి ప్రజాస్వామ్య నిర్మాణం, వార్షిక ఎన్నికలు వంటివి లేకుండా చేయడం ఒకరకంగా యువత పట్ల సర్కార్లు చేస్తున్న ద్రోహమే!
- దిలీప్ రెడ్డి,పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ