
- ఇప్పటికే బీసీ, ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్సెక్రటరీగా డ్యూటీ
- కొత్తగా గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా అదనపు బాధ్యతలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ బుర్రా వెంకటేశంకు సర్కారు భారీగా బాధ్యతలు అప్పగిస్తోంది. ఒకటి, రెండు కాదు ఏకంగా ఆరు బాధ్యతలను ఇచ్చింది. అందులో కీలకమైన ఎడ్యుకేషన్, బీసీ సంక్షేమ శాఖలుండగా..కొత్తగా గవర్నర్ సెక్రటరీగా మరో బాధ్యత అలాట్ చేశారు. దీంతో ఆయన ప్రజలతో పాటు ఆయా శాఖల ఉద్యోగులు, అధికారులకు సరైన టైమ్ కేటాయించ లేకపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఆరు డ్యూటీలివే..
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బుర్రా వెంకటేశంను నియమించారు. ఈ క్రమంలోనే ఆయనకు బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎఫ్ఏసీ బాధ్యతలు ఇచ్చారు. విద్యాశాఖ సెక్రటరీ బాధ్యతలతో అదే విభాగంలోని మరో మూడు బాధ్యతలనూ సర్కారు అప్పగించింది. కాలేజీ విద్యాశాఖ కమిషనర్ గా, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్గా అడిషనల్ బాధ్యతలతో పాటు తెలంగాణ యూనివర్సిటీకి ఇన్ చార్జ్ వీసీగా కూడా ఉన్నారు. కొత్తగా గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా మరో ఎఫ్ఏసీ బాధ్యతలు ఇచ్చారు. దీంతో ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కు ఆరు బాధ్యతలు ఇచ్చినట్లయ్యింది. దీనివల్ల అన్ని శాఖలకు బుర్రా వెంకటేశం సరైన న్యాయం చేయలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
చాంబర్ ముందు పోలీసులు..
ఏకంగా ఆరు బాధ్యతలను నిర్వర్తిస్తుండటంతో బుర్రా వెంకటేశం చాలా బిజీ అయిపోయారు. సెక్రటేరియెట్లో నిత్యం ఆయన్ను కలిసేందుకు వందలాది మంది విజిటర్స్ వస్తున్నారు. ఈ తాకిడి తట్టుకోలేక ఆయన చాంబర్ ముందు పోలీసులను పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల నిత్యం ఆయా డిపార్ట్ మెంట్లకు సంబంధించిన ఫైళ్లపై సంతకాల కోసం కిందిస్థాయి అధికారులకు ఇబ్బందులు తప్పడం లేదు. పలు శాఖలకు ఆయన కీలక ఉన్నతాధికారిగా ఉండటంతో మిగిలిన శాఖలకు కొద్ది సమయమే కేటాయిస్తున్నారు. ఒక్కోసారి అత్యవసర సమావేశాల కారణంగా ఆ కాస్త సమయం కూడా శాఖలకు ఇవ్వలేకపోతున్నారు. దాంతో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ ఆలస్యమవుతుందనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో పెద్ద డిపార్ట్మెంట్ అయిన విద్యాశాఖను చూసేందుకే టైమ్ సరిపోదు. అలాంటిది పలుశాఖల విధులు అప్పగించడంతో ఇబ్బందులు తప్పడం లేదు. కాగా.. ఏపీలో విద్యాశాఖకే ఇద్దరు ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉన్నారు.
కొత్త బాధ్యతేఎక్కువ భారం
ప్రస్తుతం గవర్నర్ సెక్రటరీగా కూడా బుర్రా వెంకటేశంకు అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఇటీవల తమిళిసై రాజీనామా చేయడంతో, కొత్తగా జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కు ఇన్ చార్జ్ బాధ్యతలు అప్పగించారు. దీనివల్ల బుర్రా వెంకటేశం తెలంగాణలో ఎక్కువగా ఉండే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని శాఖల సమన్వయం ఇబ్బందికరంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ యూనివర్సిటీ బాధ్యతలను ఎవరైనా సీనియర్ ప్రొఫెసర్ కు లేదా హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లోని చైర్మన్ లేదా వైస్ చైర్మన్లలో ఒకరికి ఇన్ చార్జ్ ఇచ్చినా సరిపోతుందనే వాదనలున్నాయి.