- సీనియర్ ఐఏఎస్‌ను నియమించిన సర్కార్
- ఇంకో మూడున్నరేండ్ల సర్వీస్ ఉండగానే వీఆర్ఎస్కు రెడీ
- ఈ నెల 2న వీఆర్ఎస్.. అదేరోజు బాధ్యతల స్వీకరణ
- 2030 ఏప్రిల్ వరకు పదవీకాలం
హైదరాబాద్, వెలుగు : విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సీనియర్ఐఏఎస్ బుర్రా వెంకటేశంను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చైర్మన్ గా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు గవర్నర్ జిష్టుదేవ్‌వర్మ శనివారం ఆమోదముద్ర వేశారు. ఈనెల 2న బుర్రా వెంకటేశం టీజీపీఎస్సీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత చైర్మన్ మహేందర్ రెడ్డి పదవీకాలం సోమవారంతో ముగియనుంది. 1995 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన వెంకటేశం సర్వీస్ 2028 ఏప్రిల్ 10 వరకు ఉంది. దాదాపు మూడున్నరేండ్ల పదవీకాలం ఉండగానే ఆయన టీజీపీఎస్సీ చైర్మన్‌గా వెళ్లేందుకు సిద్ధపడ్డారు. ఈ నెల 2న వీఆర్ఎస్ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోనున్నారు. ఆ వెంటనే టీజీపీఎస్సీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తారు. 2030 ఏప్రిల్‌వరకు పదవిలో కొనసాగనున్నారు. కాగా, ప్రభుత్వం మొదటి నుంచి టీజీపీఎస్సీకి పూర్తిస్థాయి చైర్మన్‌ను నియమించాలని అనుకుంది. తప్పనిసరి పరిస్థితుల్లో మహేందర్‌రెడ్డిని చైర్మన్‌గా నియమించింది. ఇప్పుడు ఆయనకు 62 ఏండ్లు నిండుతుండడంతో కొత్త చైర్మన్ నియామకం కోసం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది.
హోం ట్యూషన్స్ చెబుతూ స్టడీ..
బుర్రా వెంకటేశం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని (ప్రస్తుతం జనగామ జిల్లా) ఓబుల్ కేశవపురం అనే చిన్న గ్రామంలో పేద కుటుంబంలో పుట్టారు. తల్లిదండ్రులు నారాయణగౌడ్, గౌరమ్మ. ప్రభుత్వ పాఠశాలలోనే పదో తరగతి పూర్తిచేసిన వెంకటేశం.. ఇంటర్ కోసం హైదరాబాద్ వచ్చారు. తర్వాత ప్రభుత్వ కాలేజీలో డిగ్రీ చేస్తూ హోమ్ ట్యూషన్స్ చెప్పారు. 1990లో మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ రాసి సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం సాధించారు. 1995లో మరోసారి సివిల్స్ రాసి జాతీయ స్థాయిలో 15వ ర్యాంక్, రెండు తెలుగు రాష్ట్రాల్లో టాప్ ర్యాంక్ సాధించారు. 1996లో ఆదిలాబాద్ జిల్లా ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఉమ్మడి ఏపీలో- మెదక్, గుంటూరుతో పాటు వివిధ జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేశారు.
ప్రతి పోస్టులోనూ తనదైన ముద్ర
ప్రపంచ బ్యాంక్ స్కాలర్‌గా న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో 2004లో ఆర్థిక విధానంలో ఉన్నత విద్యను అభ్యసించారు. జిల్లా కలెక్టర్‌గా బుర్రాం వెంకటేశం అనుభవాలను దివంగత, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం తన ‘పాత్‌వేస్ టు గ్రేట్‌నెస్: కమింగ్ టుగెదర్ ఫర్ చేంజ్’ అనే పుస్తకంలో ప్రస్తావించారు. 2005లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ నుంచి ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. 2007లో మెదక్ జిల్లా కలెక్టర్‌గా ఆసియా ఖండంలోనే మొదటిసారి ఎస్ఏ8000 సర్టిఫికెట్ తీసుకున్నారు. 2016లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి అత్యుత్తమ పౌర పురస్కారం అందుకున్నారు.- తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కన్నడ భాషల్లో ప్రావీణ్యంతో పాటు స్పానిష్, పోర్చుగీస్, ఇండోనేషియన్, అరబిక్, ఉర్దూ, తమిళం, మలయాళం, జపనీస్ భాషలు తెలిసిన బహుభాషా ఐఏఎస్‌గా పేరొందారు.
రచయిత కూడా..
బుర్రా వెంకటేశం 2019లో ఇంగ్లిషులో ‘సెల్ఫీ ఆఫ్ సక్సెస్’ అనే పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకం ప్రస్తుతం తెలుగు, బెంగాలీ వెర్షన్‌లోనూ అందుబాటులో ఉంది. అమెజాన్‌లో సెల్ఫ్ హెల్ప్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న పుస్తకంగా నిలిచింది. తెలుగులో ‘జీవనధాన్య శతకం’, ‘బుద్ధ శతకం’ రాశారు. ఈ రెండు సరళ శతకాలతో పాటు మానవ బంధాల కోసం సూక్ష్మకావ్యం అనే కొత్త సాహిత్య పద్ధతిని తీసుకొచ్చారు. రామాయణం పాత్రలకు అనుగుణంగా రామాయణ పరివారం రాశారు. బతుకమ్మతో పాటు తల్లిదండ్రుల గొప్పతనాన్ని వివరించే “అమ్మగీసిన బొమ్మను నేను” అనే అద్భుతమైన పాట రాశారు. 2019లో క్రియేటివ్ ఇండియా మేగజైన్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికయ్యారు. తల్లిదండ్రుల కోరిక మేరకు తన గ్రామంలో శ్రీకల్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించారు.