- మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం
- హైదరాబాద్ నుంచి యూపీకి వెళ్తున్న ప్రైవేట్ బస్సు
రెవా: మధ్యప్రదేశ్ లో ఘోరం జరిగింది. దీపావళి పండుగ కోసమని ఊరెళ్తున్న కూలీలు.. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. వాళ్లు ప్రయాణిస్తున్న బస్సు.. ట్రక్కును ఢీకొట్టడంతో 15 మంది చనిపోయారు. మరో 40 మందికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ కు వెళ్తున్న ప్రైవేట్ స్లీపర్ బస్సు.. శుక్రవారం రాత్రి 11:30 గంటలకు మధ్యప్రదేశ్ లోని రెవా జిల్లాకు చేరుకుంది. నేషనల్ హైవేపై సోహగి ఘాట్ రోడ్డులో వెళ్తుండగా.. బస్సు ముందున్న ట్రక్కు, దాని ముందున్న వెహికల్ ను ఢీకొట్టింది. దీంతో ట్రక్కు డ్రైవర్ సడెన్ గా బ్రేకులు వేయడంతో వెనకున్న బస్సు వెళ్లి ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 12 మంది స్పాట్ లోనే చనిపోయారు. మరో ఇద్దరు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా, ఒక్కరు ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ పొందుతూ మృతి చెందారు. బాధితుల్లో ఎక్కువ మంది కూలీలే ఉన్నారని, దీపావళి కోసం యూపీలోని సొంతూళ్లకు వెళ్తున్నారని రెవా ఎస్పీ నవనీత్ భాసిన్ శనివారం చెప్పారు. డ్రైవర్, కండక్టర్ డెడ్ బాడీలు బస్సు ముందు భాగంలో ఇరుక్కుపోయాయని, గ్యాస్ కట్టర్ సాయంతో బయటకు తీశామని తెలిపారు. బస్సు ఉత్తరప్రదేశ్ కు చెందినదేనని పేర్కొన్నారు. గాయపడినోళ్లకు ఆస్పత్రుల్లో ట్రీట్ మెంట్ అందజేస్తున్నామని వెల్లడించారు.
రాష్ట్రపతి, ప్రధాని విచారం..
ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి చనిపోయినోళ్ల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడినోళ్లకు రూ.50 వేల చొప్పున అందజేయనున్నట్లు పీఎం ఆఫీస్ ప్రకటించింది. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ యూపీ సీఎం యోగితో ఫోన్లో మాట్లాడారు. తీవ్ర గాయాలైనోళ్లకు రెవాలోని మెడికల్ కాలేజీలో ట్రీట్ మెంట్ అందిస్తున్నామని, ఆ ఖర్చు తామే భరిస్తామని చౌహాన్ చెప్పారు.