బస్సు టైర్ల కింద నలిగిన ప్రాణాలు

బస్సు టైర్ల కింద నలిగిన ప్రాణాలు
  • బోరబండలో ఐదో తరగతి స్టూడెంట్..
  • సికింద్రాబాద్​లో గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం

జూబ్లీహిల్స్, వెలుగు: ప్రమాదవశాత్తు బస్సు చక్రాల కిందపడి సిటీలో వేర్వేరు చోట్ల ఇద్దరు దుర్మరణం చెందారు. బోరబండ పరిధిలోని ఓం నగర్​కు చెందిన చిరంజీవి ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఆయన పెద్ద కుమారుడు శివ చరణ్ (11) స్థానికంగా ఉన్న సెయింట్ సలోమోన్స్ స్కూల్​లో ఐదో తరగతి చదువుతున్నాడు. సోమవారం స్కూల్ అయిపోయిన తర్వాత శివ చరణ్ తన సైకిల్​పై ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో శ్రీసాయి చైతన్య స్కూల్​ బస్సు వెనక టైర్ల కిందపడి మృతి చెందాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో బోరబండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డెడ్​బాడీని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

సికింద్రాబాద్: ఆర్టీసీ బస్సు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన సికింద్రాబాద్ పరిధిలో సోమవారం జరిగింది. సికింద్రాబాద్​ నుంచి గండిమైసమ్మకు వెళ్తున్న బస్సు కోరమండల్​ భవనం వద్దకు రాగానే, ఓ వ్యక్తి ఫుట్​పాత్​ నుంచి ఒక్కసారిగా లేచి రావడంతో బస్సు కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి వయస్సు 35 – 40 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని గాంధీకి తరలించారు.