యూటర్న్​ తీసుకుంటుండగా ఢీకొట్టిన బస్సు

  •     ములుగు​లో ఇంటలిజెన్స్ కానిస్టేబుల్ మృతి
  •     అర్ధరాత్రి డ్యూటీకి వెళ్తుండగా ఘటన

ములుగు, వెలుగు: ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో డ్యూటీకి వెళ్తున్న ఇంటలిజెన్స్   కానిస్టేబుల్​ను మృతి చెందారు. ఈ  ఘటన శనివారం రాత్రి 10.30 గంటలకు ములుగు జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా వాజేడు మండలం పెదగొల్లగూడెం గ్రామానికి చెందిన పోదెం కోటేశ్వరరావు(40) ములుగు లోని కృష్ణ కాలనీలో ఉంటున్నారు. 

2009 కానిస్టేబుల్ బ్యాచ్ కు చెందిన కోటేశ్వరరావు ములుగు ఎస్పీ ఆఫీసులో ఇంటలిజెన్స్ కానిస్టేబుల్​గా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి డ్యూటీకి బయలుదేరిన ఆయన  ములుగు జిల్లా ఆస్పత్రి సిగ్నల్ పాయింట్​ వద్ద బైక్​పై యూటర్న్ తీసుకుంటుండగా హనుమకొండ నుంచి ములుగు వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో కోటేశ్వరరావు తలకు తీవ్రగాయాలవడంతో స్థానికులు పక్కనే ఉన్న జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతి చెందారు. మృతుడికి భార్య సౌజన్య, ఆరేళ్ల కొడుకు, నాలుగేళ్ల కూతురు ఉన్నారు.  పోలీసులు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.