కండక్టర్ లేకుండా వెళ్లిపోయిన బస్సు.. తర్వాత ఏమైందంటే..

కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కండక్టర్ లేకుండానే 10 కిలోమీర్ల దూరం వెళ్లింది. అవాక్కయ్యారు.. అవునండీ మీరు చదివింది నిజమే.. బాన్సువాడ నుంచి నిజామాబాద్ కు వెళ్లే ఆ బస్సులో కండక్టర్ ఎక్కలేదు. ఆ విషయం తెలియని డ్రైవర్ బస్సును నడిపించాడు.

బస్సు నిండా ప్రయాణికులు ఉండటంతో… వెనక ఉన్న ప్రయాణికులు… కండక్టర్ ముందు ఉన్నాడని అనుకున్నారు. ముందు ఉన్న ప్రయాణికులు… కండక్టర్ వెనక ఉన్నాడని అనుకున్నారు. అలా బస్సు బయల్దేరింది. ఒక్కో స్టాపూ దాటుకుంటూ వెళ్లిపోతోంది. కానీ టికెట్ తీసుకుందామంటే కండక్టర్ కనిపించట్లేదు. ప్రయాణికుల్లో చాలా మంది కండక్టర్ తమ దగ్గరకు రావట్లేదని అనిపించినా… ఆ విషయాన్ని లైట్ తీసుకుని… అలాగే ఊరుకున్నారు. డ్రైవర్ కూడా బిజీ ప్రయాణికుల వల్ల కండక్టర్ తన వైపు రావట్లేదని అనుకుంటూ బస్సును నడిపించేశాడు.

బస్సు 10 కిలోమీటర్లు వెళ్లిన తర్వాత… ఒక దగ్గర ఆగింది. అప్పటిదాకా సైలెంట్‌గా ఉన్న ప్రయాణికులు… కండక్టర్ ఎక్కడ అని డ్రైవర్‌ను అడగసాగారు. అప్పుడు షాకైన డ్రైవర్… కండకర్టర్ ఎక్కడని తల పట్టుకున్నాడు. దీంతో ప్రయాణికులంతా అవాక్కయ్యారు. కండక్టర్ లేకపోవడంతో మార్గ మధ్యలోనే డ్రైవర్ బస్సును ఆవేశాడు. ఆ తర్వాత ప్రయాణికులను వేరే బస్సులో పంపించి.. ఆ బస్సును డిపోలోకి తీసుకెళ్లాడు.