అయ్యో.. : మేడిగడ్డ వెళుతున్న బీఆర్ఎస్ నేతల బస్సు టైరు బరస్ట్

మేడిగడ్డ ప్రాజెక్టును మేం కూడా చూస్తామంటూ.. హైదరాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు నుంచి వోల్వో బస్సుల్లో బయలుదేరిన బీఆర్ఎస్ నేతల బస్సు టైరు బరస్ట్ అయ్యింది. తెలంగాణ భవన్  నుంచి బయలుదేరిన వీరి  బస్సు.. జనగామ మండలం నెల్లుట్ల సమీపంలోకి రాగానే.. బస్సు టైరు పేలిపోయింది. పెద్ద శబ్ధంతో టైరు పేలటంతో భయపడ్డారు బీఆర్ఎస్ నేతలు. 

టైరు పేలిన విషయాన్ని గుర్తించిన బస్సు డ్రైవర్.. బస్సును రోడ్డున పక్కన నిలిపివేశాడు. టైరు మార్చారు. ఈ బస్సులో మాజీ ఎమ్మెల్యేలు, కొందరు నేతలు ఉన్నారు. వీరితో పాటు మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారు. టైరు పేలినా ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో.. అందరూ ఊపిరిపీల్చుకున్నారు. మేడిగడ్డ వెళుతున్న సమయంలో ఈ అపశృతి ఏంటీ అంటూ కొందరు నేతలు చర్చించుకోవటం విశేషం.

బస్సు టైరు పేలిన తర్వాత బస్సులోని కొందరు బీఆర్ఎస్ నేతలు.. బస్సును వదిలేసి కార్లలో మేడిగడ్డ బయలుదేరి వెళ్లారు. కొందరు నేతలు అయితే టైరు మార్చిన తర్వాత అదే బస్సులో బయలుదేరారు. 5 బస్సుల్లో ఈ రోజు ఉదయం 9 గంటలకు బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర నాయకులు మేడిగడ్డకు బయలుదేరారు.  తొలుత మేడిగడ్డను సందర్శించిన అనంతరం అన్నారం బ్యారేజీని పరిశీలించనున్నారు. అక్కడ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇవ్వనున్నారు.