ఆర్టీసీ బస్టాండ్లలోఅడ్డగోలు దోపిడీ..!

 ఆర్టీసీ బస్టాండ్లలోఅడ్డగోలు దోపిడీ..!
  • వీకెండ్​, ఫెస్ట్​వల్స్​ టైంలో కిటకిటలాడుతున్న బస్ స్టాండ్లు
  • ప్రయాణికుల రద్దీని క్యాష్ చేసుకుంటున్న స్టాళ్ల నిర్వాహకులు
  • ప్రతి వస్తువుపై రూ.5 నుంచి రూ.15 వరకు అధికంగా వసూలు
  • కనిపించని ఎమ్మార్పీ రూల్

హనుమకొండ, వెలుగు: ఆర్టీసీ బస్టాండ్లలోని స్టాల్స్ నిర్వాహకులు ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నారు. వాటర్ బాటిల్ నుంచి కూల్ డ్రింక్స్ వరకు ప్రతి వస్తువుపై అధిక ధరలు వసూలు చేస్తున్నారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయించకూడదనే రూల్ ఉన్నా, ఇష్టారీతిన దండుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్లలో అధిక ధరల వసూళ్లపై గతంలోనే ఫిర్యాదులు అందినా, ఆఫీసర్లు లైట్ తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఏది కొన్నా 5 నుంచి 15 ఎక్కువే..

వీకెండ్, పండుగల  నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి జనాలు సొంతూళ్లకు వెళ్తుంటారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని బస్టాండ్లన్నీ ప్రయాణికులతో రద్దీగా ఉంటున్నాయి. ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి హనుమకొండ, వరంగల్ మీదుగానే వస్తుండటంతో ఈ రెండు బస్టాండ్లు కిక్కిరిసిపోతున్నాయి. జనాల రద్దీని బస్ స్టేషన్లలోని వివిధ స్టాల్స్ క్యాష్ చేసుకుంటున్నాయి. టెండర్ ద్వారా షాపులను దక్కించుకుంటున్న నిర్వాహకులు ఆ తర్వాత అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రతి వస్తువుపై అధిక ధరలు వసూలు చేస్తున్నారు.

 ఎండా కాలం కావడంతో వాటర్ బాటిల్స్ కు ఎక్కువ డిమాండ్ ఉండగా, రూ.20 కు అమ్మాల్సిన లీటర్ బాటిల్ ను రూ.25కు అమ్ముతున్నారు. ఇక కూల్ డ్రింక్స్ లాంటివి అడిగితే ఎమ్మార్పీ పై రూ.10 నుంచి రూ.15  వరకు అధికంగా గుంజుతున్నారు. హనుమకొండ బస్ స్టేషన్ లో హోలీ ముందురోజైన గురువారం పరిశీలించగా, ఇదే విషయం స్పష్టమైంది. బస్ స్టేషన్ లో మొత్తం 18 స్టాల్స్ ఉండగా, అందులో ఒకరిద్దరు మినహా మిగతా వాళ్లంతా అధిక వసూళ్లకు పాల్పడుతున్నట్టు తేలింది. లీటర్ వాటర్ బాటిల్ ను రూ.25, రూ.42 ఉన్న మజాను రూ.50, రూ.12కు అమ్మాల్సిన బిస్కెట్ ప్యాకెట్ ను రూ.20, రూ.45కు అమ్మాల్సిన స్ర్పైట్​ బాటిల్ ను రూ.60 కి అమ్ముతుండటం గమనార్హం.

ఎమ్మార్పీ ముచ్చటే లేదు..

ఏదైనా వస్తువుపై ఉన్న ఎమ్మార్పీ కంటే అధిక ధరలు వసూలు చేయకూడదనే రూల్ ఉంది. ఇదే విషయం టెండర్ దారుల అగ్రిమెంట్ లో కూడా ఉంటుంది. కానీ బస్టాండ్లలో ఆ రూల్ మాత్రం అమలు కావడం లేదు. షాపులో అమ్మే ప్రతి వస్తువుకు సంబంధించిన విక్రయ ధరలు బోర్డుపై ప్రదర్శించాలి. కానీ ఆ బోర్డులు ఎక్కడా కనిపించవు. దీంతో ప్రయాణికులు దోపిడీకి గురవుతున్నారు. 

బస్టాండ్లలో దోపిడీ ఎప్పటినుంచో ఉండగా, గతంలో ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఆ సమయంలో తనిఖీల పేరున హడావిడి చేసిన అధికారులు ఆ తర్వాత లైట్ తీసుకున్నారు. దీంతో స్టాళ్ల నిర్వాహకుల దోపిడీకి అడ్డేలేకుండా పోయింది. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి, బస్టాండ్లలో ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

ఎమ్మార్పీపై రూ.8 ఎక్కువ తీసుకున్నరు

నేను బెంగళూరు నుంచి మా స్వగ్రామం జమ్మికుంట వెళ్లేందుకు హనుమకొండ బస్టాండ్ కు వచ్చాను. అక్కడ ఓ స్టాల్ లో మజా బాటిల్ కొన్నాను. ఆ బాటిల్ పై ఎమ్మార్పీ రూ.42 ఉంది. కానీ షాప్ నిర్వాహకుడు రూ.50 వసూలు చేశాడు. తప్పనిసరి పరిస్థితుల్లో అడిగినంత ఇవ్వాల్సి వచ్చింది.- లోకేంద్ర, ప్రయాణికుడు, జమ్మికుంట

అధిక రేట్లు వసూలు చేస్తే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తాం..

రూల్స్ కు విరుద్ధంగా ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేట్లు వసూలు చేసే షాపులపై సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. ప్రయాణికులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ చేస్తాం. ఎవరైనా ఎక్కువ ధరలు వసూలు చేస్తే ప్రయాణికులు వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలి.- డి.విజయభాను, ఆర్టీసీ రీజినల్ మేనేజర్, వరంగల్