సంక్రాంతి  పండుగ వేళ కిక్కిరిసిన హనుమకొండ, వరంగల్‍ బస్టాండ్లు 

  • ప్రయాణానికి పాట్లు.. సీటు కోసం ఫీట్లు..!

వరంగల్‍, వెలుగు: సంక్రాంతి పండుగ నేపథ్యంలో బస్సు ప్రయాణాలకు ప్రజలు పాట్లు పడాల్సి వస్తోంది. ప్రభుత్వం స్కూళ్లకు శనివారం నుంచి సెలవులు ప్రకటించడంతో సొంతూర్లకు వెళ్లే పబ్లిక్‍తో ఓరుగల్లులోని హనుమకొండ, వరంగల్‍ బస్టాండ్‍లు నిండిపోయాయి. ఆర్టీసీ సంస్థ బస్సుల సంఖ్య పెంచినా అందుబాటులో ఉన్న బస్సుల కంటే జర్నీ చేయాల్సిన ప్రయాణికుల సంఖ్య ఎక్కువ ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్సు ఫ్లాట్​ఫాం మీదకు రావడమే ఆలస్యం సీట్ల కోసం సర్కస్​ ఫీట్లు చేయడమే కనిపించింది. అక్కడక్కడ ప్రమాదకర ప్రయాణ దృశ్యాలు కూడా ఉన్నాయి.

ఉప్పల్‍, జాతర్ల కోసం ప్రత్యేక బస్సులు.. 

పండుగ ప్రయాణాల కోసం ఆర్టీసీ సంస్థ వరంగల్‍ రీజియన్‍ పరిధిలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. హైదరాబాద్‍ ఉప్పల్‍ నుంచి హనుమకొండ మధ్యలో 660 స్పెషల్‍ బస్సులు ఏర్పాటు చేశారు. హనుమకొండ డిపో నుంచి 90 బస్సులు, జనగామ 90, వరంగల్‍ 1 డిపో  92, వరంగల్‍ 2 డిపో 92, మహబూబాబాద్‍ 56, నర్సంపేట 56, పరకాల 56, తొర్రూర్‍ 74, భూపాలపల్లి డిపో నుంచి 54 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇవేగాక ఐనవోలు, కొత్తకొండ, కొమరవెళ్లి జాతర్లకు భక్తులు లక్షలాదిగా తరలివచ్చే అవకాశం ఉండటంతో..రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచామన్నారు.