
- బస్సు వచ్చే.. సంబురం తెచ్చే.. స్వాతంత్య్రం తర్వాత తొలిసారి
- మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా కటే
- మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రవాణా సదుపాయం కల్పించిన పోలీసులుఝరికి బస్సు
- డప్పులతో స్వాగతం పలికి మురిసిపోయిన ఆదివాసీలు
ఆదిలాబాద్ ( గడ్చిరోలి), వెలుగు: దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 78 ఏండ్లకు ఆ గూడేనికి తొలిసారి ఆర్టీసీ బస్సు వచ్చింది. ఇంతకుముందు నడవడానికి కూడా రోడ్డు సదుపాయం లేని తమ ఊరికి ఏకంగా బస్సే రావడంతో ఆదివాసీలు సంబురాలు జరుపుకున్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ధన్నోర తాలుకాలో కటేఝరి ఆదివాసీ గూడెం ఉన్నది. జిల్లా కేంద్రానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రవాణా సదుపాయం లేక ఇక్కడి ప్రజలు కాలినడకనే ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు.
ఈ గ్రామం ఒకప్పుడు మావోయిస్టు కార్యకలాపాలకు కేంద్రంగా ఉండేది. ప్రస్తుతం దేశంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాయి. ఈ గ్రామాల్లో సదుపాయాల కల్పనపై దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే కటేఝరి ఆదివాసీ గూడెంకు అక్కడి పోలీసులు రోడ్డు వేయించడమే కాకుండా ఏకంగా ఆర్టీసీ బస్సును తీసుకొచ్చారు. దీంతో ఆదివారం గూడెం ప్రజలు వారి సాంప్రదాయ డప్పు వాయిద్యాలతో బస్సుకు స్వాగతం పలికారు. జిల్లా ఎస్పీ నీలోత్పల్ బస్సు సౌకర్యాన్ని జెండా ఊపి ప్రారంభించారు. గ్రామస్తులు బస్సులో కూర్చొని మురిసిపోయారు.