- కుల గణన వివరాలు తీసుకొనిస్టడీ చేస్తం
- బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ వెంకటేశ్వర రావు వెల్లడి
హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇస్తామని బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వర రావు ప్రకటించారు. కుల గణన పూర్తయ్యాక ప్రభుత్వం నుంచి వివరాలు తీసుకొని స్టడీ చేస్తామన్నారు. మసాబ్‌ట్యాంక్ సంక్షేమ భవన్‌లోని డెడికేటెడ్ కమిషన్ ఆఫీస్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అంతకుముందు రాజకీయ పార్టీలు, బీసీ సంఘాల నేతలు ఇచ్చిన వినతిపత్రాలు తీసుకున్నారు.
‘‘జిల్లా పర్యటనలో అనూహ్య స్పందన వస్తున్నది. త్వరలో మిగిలిన 5 జిల్లాల్లో పబ్లిక్ హియరింగ్ కంప్లీట్ చేస్తాం. బీసీలకు రాజకీయ రిజర్వేషన్ల కోసం ఎలాంటి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా నివేదిక అందజేసే ప్రయత్నం చేస్తున్నం’’అని వెంకటేశ్వర రావు తెలిపారు. ఈ సమావేశంలో కమిషన్ సెక్రటరీ సైదులు, ఎంబీసీ కార్పొరేషన్ సీఈవో అలోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
42% రిజర్వేషన్లు కల్పించాలి: బీజేపీ ఓబీసీ మోర్చా
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీజేపీ ఓబీసీ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ ఆనంద్ గౌడ్ కోరారు. కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వర రావును బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. బీసీల్లో ఉన్న మైనారిటీలను తొలగించాలని, ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగానికి విరుద్ధమని తెలిపారు. కుల గణన పారదర్శకంగా చేపట్టాలన్నారు. సర్వే వివరాలు పబ్లిక్ డొమైన్లో పెట్టాలని తెలిపారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా స్టేట్ ట్రెజరర్ ఆకారం రమేశ్, కార్యదర్శి వెంకటేశ్, అధికార ప్రతినిధులు వేణు, రాజు నేత, సెక్రటరీ గౌరీ శంకర్ పాల్గొన్నారు.
రిజర్వేషన్లు పెంచాలి:బీసీ సంక్షేమ సంఘం
కుల గణన ఆధారంగా.. జనాభా దామాషా ప్రకారం బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ వెంకటేశ్వర రావుకు బీసీ సంక్షేమ సంఘం తరఫున ఆయన వినతిపత్రం అందజేశారు.
రాష్ట్రంలో అన్ని వర్గాలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలవుతున్నాయన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు బీసీలకు మాత్రం జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు కావడం లేదని తెలిపారు. కులగణన నివేదికను ప్రామాణికంగా తీసుకుని బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.