మేడారం వెళ్లే బస్సులకు వరంగల్​లో జాగ కరువు

  •    ఇప్పుడు అదే స్థలంలో కలెక్టరేట్  నిర్మాణ పనులు
  •     ఫ్రూట్​ మార్కెట్ స్థలంలో కూడా కన్ స్ట్రక్షన్
  •     అసంపూర్తిగా తాత్కాలిక బస్టాండ్  పనులు
  •     పరిష్కారం చూపకపోతే భక్తులకు ఇబ్బందులు

హనుమకొండ, వెలుగు : మేడారం వెళ్లే బస్సులకు వరంగల్ లో జాగ లేకుండా పోయింది. హనుమకొండ నుంచి వెళ్లే బస్సులకు హయగ్రీవాచారి గ్రౌండ్​ అందుబాటులో ఉండగా.. వరంగల్  నుంచి వెళ్లే బస్సులకు మాత్రం సరైన స్థలం కరువైంది. ఇదివరకు అజంజాహీ మిల్ గ్రౌండ్​తో పాటు పక్కనే ఉన్న ఫ్రూట్​ మార్కెట్​ స్థలాలను మేడారం బస్సుల కోసం వినియోగించేవారు. ఇప్పుడు ఆ రెండు చోట్ల నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో బస్సుల పార్కింగ్, షెల్టర్​కు అవకాశం లేకుండా పోయింది.

మరోవైపు వరంగల్ లో ప్రస్తుతం ఉన్న బస్టాండ్​ శిథిలావస్థకు చేరగా.. టెంపరరీ బస్టాండ్​ పనులు ఇంకా పూర్తి కాలేదు. దీంతో మేడారం వెళ్లే బస్సుల కోసం సెంటర్​ ఎక్కడ ఏర్పాటు చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. మరో నెల రోజుల్లో మేడారం మహాజాతర ప్రారంభం కానుండగా.. ఈ సమస్యకు పరిష్కారం చూపకపోతే వరంగల్​ నుంచి వెళ్లే భక్తులకు తీవ్ర ఇబ్బందులు తప్పని పరిస్థితి నెలకొంది.

వరంగల్  రీజియన్​ నుంచి 3 వేల బస్సులు

ఫిబ్రవరి 21 నుంచి మేడారం జాతర ప్రారంభం కానుంది. ఈసారి మేడారం జాతరకు వరంగల్​ రీజియన్​ నుంచి ముందుగా 2,400 బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ మహాలక్ష్మి పథకం ప్రభావంతో మహిళా ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఒక్క వరంగల్  రీజియన్​ నుంచే 3 వేల వరకు బస్సులు నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

అసంపూర్తిగా టెంపరరీ బస్టాండ్

​వరంగల్​లో ప్రస్తుతం ఉన్న బస్టాండ్​ పూర్తిగా శిథిలావస్థకు చేరింది. గత ప్రభుత్వ హయాంలో కొత్తగా బస్​ టర్మినల్​ నిర్మించేందుకు ఆర్టీసీ, కుడా (కాకతీయ అర్బన్  డెవలప్ మెంట్ అథారిటీ) ఆఫీసర్లు ప్రణాళిక రచించారు. ఈ మేరకు కుడా ఆధ్వర్యంలో  రూ.75 కోట్లతో బస్టాండ్​ ను పునర్నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సుమారు 2.32 ఎకరాల్లో 32 ప్లాట్​ ఫామ్స్​తో ఐదు అంతస్తుల్లో నిర్మించేందుకు ప్లాన్​ రెడీ చేశారు. కానీ ఆ ప్రక్రియ ఇంకా కాగితాల దశలోనే ఉండిపోయింది. దీంతో మేడారం జాతర, వరంగల్  బస్టాండ్​ మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం స్థానిక ఎస్ఎన్ఎం  క్లబ్​ ఎదురుగా, రైల్వే స్టేషన్​ కాంపౌండ్​ను ఆనుకొని తాత్కాలికంగా బస్టాండ్​ ఏర్పాటు చేస్తున్నారు.

20 ప్లాట్ ఫామ్స్​ తో దీనిని ఏర్పాటు చేస్తుండగా.. కేవలం రేకుల షెడ్డు, ప్లాట్​ఫామ్స్​ దిమ్మెల పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా ఎలక్ట్రిఫికేషన్, లైటింగ్స్, ఆర్టీసీ అధికారులు ఉండేందుకు ఏర్పాట్లు చేయాల్సి ఉంది. దీంతో ఈసారి వరంగల్  బస్టాండ్​ నుంచి మేడారం వెళ్లే బస్సులకు ఎక్కడ షెల్టర్​ ఏర్పాటు చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.

ప్రత్యామ్నాయం ఎక్కడ?

వరంగల్ సిటీ చుట్టుపక్కల ఉన్న హనుమకొండ, వరంగల్, కాజీపేట సెంటర్లలోని బస్సులనే ప్రయాణికులు ఆశ్రయిస్తుంటారు. ఈ మూడు సెంటర్ల నుంచే 1500 పైగా బస్సులు నడవనున్నాయి. ఇందులో హనుమకొండ నుంచి వెళ్లే మేడారం బస్సుల కోసం బాలసముద్రంలోని హయగ్రీవాచారి గ్రౌండ్, కాజీపేటలో రైల్వే స్టేడియం అందుబాటులో ఉన్నాయి. కానీ వరంగల్ ప్రాంతంలో మాత్రం బస్సుల రాకపోకలు, ప్రయాణికులకు క్యూ లైన్లు, టాయిలెట్స్, ఆర్టీసీ ఆఫీసర్ల కోసం సరైన ఏర్పాట్లు చేయడానికి అనుకూల పరిస్థితులు లేకుండా పోయాయి.

వరంగల్  నుంచి మేడారం వెళ్లే భక్తుల కోసం ఇదివరకు అజంజాహీ మిల్​ ​ గ్రౌండ్​ తోపాటు బస్టాండ్​ ఎదురుగా ఉన్న ఫ్రూట్​ మార్కెట్​ స్థలాన్ని వినియోగించేవారు. కానీ అజంజాహీ మిల్​ గ్రౌండ్​కు చెందిన 29 ఎకరాల్లో ఇప్పుడు వరంగల్  కలెక్టరేట్ నిర్మిస్తున్నారు. ఆ స్థలంలో రేకులను అడ్డుగా పెట్టి పనులు చేస్తున్నారు. దీంతో అక్కడ మేడారం బస్సుల కోసం సెంటర్​ ఏర్పాటు చేయలేని పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా ఇదివరకున్న ఫ్రూట్​ మార్కెట్​కు చెందిన 4.16 ఎకరాల స్థలంలో కొత్తగా ఇంటిగ్రేటెడ్​ మార్కెట్​ నిర్మిస్తున్నారు. ఆ పనులు  పిల్లర్ల దశలో ఉండగా.. అక్కడా బస్సులు నిలపలేని పరిస్థితి నెలకొంది.

భక్తులకు ఇబ్బందులు కలగనీయం 

ఒక్క వరంగల్ నుంచే దాదాపు 400 బస్సులు నడిచే అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడ నిర్మిస్తున్న టెంపరరీ బస్టాండ్​ ను తొందర్లోనే వినియోగంలోకి తీసుకొస్తం. నిర్మాణంలో ఉన్న మార్కెట్​ స్థలాన్ని కూడా మేడారం బస్సులు తిప్పేందుకు వాడుతం. మేడారం వెళ్లే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తాం. మేడారం జాతర పూర్తయిన తర్వాత వరంగల్  బస్టాండ్​ ను తొలగించి, బస్​ టర్మినల్​ ఏర్పాటుకు చర్యలు చేపడతాం.
- జె.శ్రీలత, ఆర్టీసీ వరంగల్  రీజినల్​ మేనేజర్