న్యూఢిల్లీ: దేశంలో బిజినెస్ యాక్టివిటీ వేగంగా సాధారణ స్థాయికి చేరుకుంటోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. వినియోగం, డిమాండ్ రెండూ కరోనా ముందు లెవెల్స్‌కు చేరుకుంటున్నాయని చెప్పారు. ‘కమర్షియల్ కోల్ మైనింగ్’ వర్చ్యువల్ లాంఛ్‌లో ఆయన మాట్లాడారు. లాక్‌డౌన్ రూల్స్‌ను సడలిస్తుండడంతో దేశంలో పవర్, ఫ్యూయల్ వినియోగం, డిమాండ్ పుంజుకుంటున్నాయని పేర్కొన్నారు. లాక్‌డౌన్ తర్వాత గల పవర్ జనరేషన్, వినియోగాన్ని ఆయన ప్రస్తావించారు. కాగా లాక్‌డౌన్ రూల్స్ సడలించడంతో ఏప్రిల్‌తో పోల్చుకుంటే జూన్‌లో ఈ-–వే బిల్స్ 200 శాతం, రోడ్,హైవే టోల్ కలెక్షన్ 70 శాతం పెరిగాయి. ఇది లాక్‌డౌన్‌కు ముందు స్థాయి(ఫిబ్రవరి నెల)కి చేరుకున్నాయి. రైల్వే ఫ్రయిట్ టారిఫ్ కూడా ఏప్రిల్ నెలతో పోల్చుకుంటే మే నెలలో 26 శాతం పెరిగాయి. డిజిటల్ ట్రాన్సాక్షన్లు వాల్యుమ్, వాల్యూ పరంగా ఊపందుకున్నాయి.
ఇండియన్ ఎకానమీ వేగంగా పుంజుకుంటోందనడానికి ఈ ఇండికేటర్లే సాక్ష్యమని మోడీ చెప్పారు. పెద్ద పెద్ద సంక్షోభాల నుంచి గతంలో బయటపడ్డామని, ఇప్పుడు కూడా బయటపడతామని ధీమా వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ దెబ్బతో ఇండియా ఎకానమీ వృద్ధి 2020–21 లో తగ్గుతుందని కొన్ని ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజెన్సీలు, ఎనలిస్టులు అంచనావేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ప్రభుత్వం, ఆర్‌బీఐ కూడా 2020–21 కి సంబంధించి ఎకానమీ వృద్ధి అంచనాలను విడుదల చేయలేదు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది..
రూరల్ ఎకానమీ వేగంగా పుంజుకుంటోందని మోడీ అన్నారు. ఖరీఫ్ పంట విస్తీర్ణం గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 13 శాతం పెరిగిందని చెప్పారు. ఈ ఏడాది గోధుమ ఉత్పత్తి, సేకరణ కూడా పెరిగాయన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది గోధుమ సేకరణ 11 శాతం పెరిగిందని, దీనర్థం రైతుల ఆదాయం కూడా పెరుగుతోందని చెప్పారు. ‘ఇండియా గ్యారెంటీగా విజయం సాధిస్తుంది. మనం ఒకరిపై ఆధారపడకుండా మారతాం’ అని పేర్కొన్నారు.
కోల్ దిగుమతులను తగ్గిస్తామని, దేశంలోని కోల్ రిసోర్స్‌లను గుర్తిస్తామని మోడీ పేర్కొన్నారు. ‘స్వీయ భారతమంటే దిగుమతులపై ఇండియా ఆధారపడడాన్ని తగ్గించడం. స్వీయ భారతమంటే దిగుమతులపై వాడే వేల కోట్లను పేదల సంక్షేమానికి వినియోగించడం’ అని వ్యాఖ్యానించారు. దేశంలోని వనరులను గుర్తించి దిగుమతులను తగ్గించుకోవాలన్నారు. మనం ఇప్పుడు దిగుమతి చేసుకుంటున్నామని, రేపు ఇదే కమోడిటీని ఎగుమతి చేసే అతిపెద్ద దేశంగా ఎదుగుతామని చెప్పారు. బొగ్గు వనరులున్న దేశాలలో ఇండియా నాల్గో స్థానంలో ఉందని, అయినప్పటికి రెండో అతిపెద్ద బొగ్గు దిగుమతి దేశంగా ఉన్నామని గుర్తుచేశారు. కమర్షియల్ మైనింగ్‌తో ఎనర్జీ సెక్టార్‌లో మన అవసరాలను మనం తీర్చుకోగలుగుతామని చెప్పారు.
భవితను మార్చే అవకాశం
‘కొన్ని వారాల కిందటి వరకు మనం ఎన్95 ఫేస్ మాస్కులను, కరోనా టెస్టింగ్ కిట్లను, పర్సనల్ ప్రొటక్టివ్ ఎక్విప్‌మెంట్లను(పీపీఈ), వెంటిలేటర్లను దిగుమతి చేసుకునేవాళ్లం. ఇప్పుడు ఇండియాలోనే తయారు చేసుకుంటూ మన అవసరాలను మనమే తీర్చుకోగలుగుతున్నాం. స్వంత కాళ్లపై నిలబడడం అంటే దేశ దిగుమతులను తగ్గించి, ఎగుమతుల మిగులు దేశంగా మారడమే. ఇండియన్ కంపెనీలు, కార్పొరేట్ లీడర్లు తమ క్రమశిక్షణను అలానే కొనసాగించాలి. మనం ఈ గోల్స్‌ను చేరుకోగలం. మన కాళ్లపై మనం నిలబడగలం. ఇండియానూ నిలపగలం. ఇండియన్ కంపెనీలకు, కార్పొరేట్ లీడర్లకు ఇండియా చరిత్రను, భవితను మార్చే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని మనం చేజార్చుకోకూడదు. ఇండియాను ముందుకు తీసుకువెళ్లి ‘స్వీయ ఆధార భారత్’గా మారుద్దాం’ అని కార్పొరేట్ లీడర్లకు, కంపెనీలకు మోడీ పిలుపునిచ్చారు.
కరోనా టెస్టుల్లో ప్రైవేట్ దందా